Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ సభలో వాగ్బాణాలు.. ఇప్పుడెందుకు ఈ బూతుల బాణాలు

ఆ సభలో వాగ్బాణాలు.. ఇప్పుడెందుకు ఈ బూతుల బాణాలు

ట్టసభల్లో రాజకీయ ప్రత్యర్థుల నడుమ విధానపరమైన మాటల యుద్ధం జరగడం సహజం. ఒకప్పుడు అసెంబ్లీలో వాదనల పదును, వ్యంగ్యాల చమత్కారం, సమయస్ఫూర్తితో కూడిన సంభాషణలు ప్రజాస్వామ్యానికి అందాన్నిచ్చేవి.

ప్రస్తుతం సీన్ పూర్తిగా మారింది. ప్రజా సమస్యలు పక్కకెళ్లాయి. వ్యక్తిగత దూషణలు, శారీరక ఆకృతిపై దాడి చేసే 'బాడీ షేమింగ్', అన్ పార్లమెంటరీ పదాల వీధి పోరాటాలకు చట్టసభలు వేదికగా మారడం చర్చకు ఆస్కారం కల్పించింది. దీనివల్ల

యువతకు ఇచ్చే సందేశం ఏమిటి?

శాసనసభ, మండలిలో జరిగే చర్చలు చూసేందుకు మంత్రి నారా లోకేష్ అనుమతితో స్పీకర్ అయ్యన్న పాత్రుడు విద్యార్థులను అనుమతిస్తున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు వాడే భాష విద్యార్థుల మెదళ్లను తొలిచివేయదా? బడిలో కూడా పిల్లలు ఇదే తరహా భాష వాడితే... అదే అలవాటు చేసుకుంటే.. పరిణామాలు ఎలా ఉంటాయి? చట్టసభల్లో చోటు చేసుకుంటున్న వాగ్బాణాలు యువత విద్యార్థులకు ఎలాంటి మాటలు నేర్పిస్తున్నాయి. అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

గతాన్ని పరిశీలిద్దాం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ అసెంబ్లీలో సమాశాల్లో చర్చలు హుందాగా ఉండేవి. ఆ అసెంబ్లీ రికార్డులను తిరగేస్తే, తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా నాయకులు ఎంతటి హుందాతనాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రదర్శించారో అర్థమవుతుంది. ఆ కోవలో టీడీపీ మాజీ మంత్రి నాగం జనార్థనరెడ్డి, అప్పటి ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య సంవాదం నవ్వుల పువ్వులు పూయించిన సందర్భం ఎవరూ మరువలేరు. వారి మాటల దాడి గంటలోనే అనేక మలుపులు తిరిగింది. నాగం మాట్లాడడం, హావభావాలను ఉటంకిస్తూ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య మధ్య ఆసక్తికరంగానే కాదు. నవ్వులు పూయించేది. ఇప్పటికీ ఈ తురుపు ముక్కల సంభాషణల వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూనే ఉంటుంది.

సీరియస్ విషయంపై కూడా హాస్యం పండించే ఎదురుదాడి చేసేవారు. సమ ఉజ్జీలుగా ఉన్న నేతల మధ్య వివిధ అంశాల మధ్య వాడివేడి చర్చలు, మాటల తూటాలు పేలేవి. పరస్పర గౌరవం, బాడీ షేమింగ్, కుటుంబాలను రచ్చకు తెచ్చిన సందర్భాలు కనిపించవు.

ఓ సంఘటన చూద్దాం..

టీడీపీ ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి సభలో లేచి తీవ్రంగా ఫిర్యాదు చేశారు

"అధ్యక్షా, మంత్రి రోశయ్య గారు నా చెయ్యి తీస్తా అన్నారు!"

దీనికి కాకలు తీరిన రాజకీయవేత్త, సీనియర్ మంత్రి కొణిజేటి రోశయ్య గారు ప్రశాంతంగా చిరునవ్వుతో స్పందించారు..

"అధ్యక్షా! నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఆయన నాపై చెయ్యి వేస్తే, ఆ చేతిని పక్కకు తీసివేస్తానని మాత్రమే అన్నాను!" అని రోశయ్య హావభావాలు ప్రదర్శిస్తూ, చేసిన వ్యాఖ్యల్లో ముఖ కవళికల్లో హాస్యం ప్రదర్శంచిన తీరు విపక్ష టీడీపీ సభ్యులను కూడా అప్పట్లో ఆకట్టుకుంది. దీనికి ప్రతిపక్షం నుంచి ఎలాంటి ఢిఫెన్స్ కూడా ఎదురు కాలేదు ఆరోపణ ఎంత సీరియస్ అయినా, భాషా పరిధి దాటకుండా హాస్యం పండించడం రోశయ్య మార్కు హుందాతనం.

ఇంతటితో అయిపోలేదు..

చంద్రబాబు - రోశయ్య మధ్య విమర్శల పదును ఎలా ఉందనేది కూడా ఆసక్తికరమే. కానీ, ఎక్కడా అదుపు తప్పిన దాఖాలాలు దివిటీ పెట్టి వెదికినా కనిపించదు. వినిపించదు.

ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి రోశయ్య మధ్య బడ్జెట్, సంక్షేమ పథకాలపై గంటల తరబడి వాడివేడి చర్చలు జరిగేవి.

చంద్రబాబు గణంకాలు, ఆర్థిక లోపాలపై కడిగిపారేస్తుంటే...

రోశయ్య తన చాకచక్యంతో, "తమ్ముడు చంద్రబాబు..." అంటూనే వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు.

అందుకు మరో ఉదాహరణ

వైసీపీ నేతలు వీధుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును వెన్నుపోటు పార్టీ అని తాజాగా కొత్త పల్లవి అందుకుంది. కానీ,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే అంశంపై కొణిజేటి రోశయ్య ఎలా కట్టడి చేశారో చూద్దాం..

అప్పటి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్యను ఉద్దేశించి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఓ వ్యాఖ్య చేశారు.

ఈ మధ్య రోశయ్యకు తెలివి ఎక్కువైంది అన్నారనేది విమర్శ.

టీడీపీ నేత నాగం జనార్థనరెడ్డితో సంవాదం పూర్తి కాగానే రోశయ్య ఆ విషయాన్ని ప్రస్తావించారు.

అధ్యక్షా.. నాకు తెలివి ఎక్కువైందని చంద్రబాబు అన్నట్లు విన్నాను.

నాకు అంత తెలివి ఎక్కడిది చంద్రబాబు. నాకు తెలివి ఎక్కు అయి ఉంటే నన్పు నమ్మిన వైఎస్. రాజశేఖరరెడ్డి ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు కసుక్కున పొడిచి ఆ కుర్చీలో కూర్చీ ఎక్కే వాడిని, అంతకుముందు సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డిని పొడిచే వాడిని, సీఎం మర్రి చెన్పారెడ్డిని పొడిచే వాడిని అని రోశయ్య ఘాటుగా సమాధానం చెబుతూ, చంద్రబాబు వెన్నుపోటును పరోక్షంగా ప్రస్తావించిన సందర్భం సభను సైలెంట్ చేసేసింది. చంద్రబాబు కూడా కిమ్మన లేదు. అది రోశయ్య మార్కు హాస్యం, విమర్శ, మాటల పదును..

కానీ, ఇద్దరి మధ్య విమర్శలు పర్వతమంత ఎత్తున ఉన్నా... ఎక్కడా వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్ ఉండకపోయేవి. సభ ముగిశాక బయటకు వచ్చి సాధారణంగా మాట్లాడుకునే సంస్కారం వారి మధ్య ఉండేది.

ఇప్పుడు భిన్నమైన పరిస్థితి...

అటువంటి ఘనమైన పార్లమెంటరీ సంప్రదాయాలు ఉన్న సభలు, నేడు అసభ్యకర పదజాలానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారడానికి దారి తీసిన అంశం ఏమిటి? పరస్పర గౌరవం ఎందుకు లోపిస్తోంది? మండలిలో చైర్మన్ మోషేన్ రాజు ఎందుకు నిబంధనల బెత్తం పట్టడం లేదనేదే చర్చకు దారితీసింది.

మంత్రి అచ్చెం నాయుడు, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన సంభాషణే దీనికి నిదర్శనం.

తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మెగా డీఎస్సీ అంశంపై చర్చ తీవ్ర ఘర్షణకు దారితీసింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి "దద్దమ్మ" అని తీవ్రంగా మండిపడ్డారు.

దానికి ప్రతిగా బొత్స స్పందిస్తూ... "మనిషి ఎద్దులాగా, ఆంబోతులాగా పెరిగితే సరిపోదు, బుర్ర పెరగాలి" అంటూ బాడీ షేమింగ్ వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

ఈ పదాలు "అన్ పార్లమెంటరీ" కావని స్వయంగా మంత్రులే సమర్థించుకున్నారు. ఒక వేళ అభ్యంతరం కరమైతే క్షమాపణ చెప్పడానికి తనకు ఎలాంటి భేషజం లేదని కూడా అచ్చం నాయుడు తన వంతు ఆఫర్ ఇచ్చారు. అధ్యక్ష స్థానంలో ఉన్న ఛైర్మన్ స్పష్టమైన రూలింగ్ ఇవ్వకుండా సభను వాయిదా వేయడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేసింది.

చిన్న పిల్లలా వారేమన్నా...

బాల్యంలో జరిగే సంఘటనలకు అసెంబ్లీ, శాసన మండలికి పోలిక ఉందా? ఇది సమంజమేనా? బడిలో పిల్లలు తుంటరి పనులు చేయడం సార్వసాధారణం. చెప్పింది రాయకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు టీచర్ ఏరా దద్దమ్మా ఏదీ సరిగా రాయవు అని నాలుగు తగిలిస్తారు.

ఇక్కడ దద్దమ్మ అనేది చేతకానివాడు, పనికిమాలినోడా అనే కదా అర్థం. అంటే సందర్భాన్ని బట్టి ఎలాగైన అన్వయించుకోవచ్చు.

అది పిల్లలైనా, పెద్దలైనా వాడే భాష అదుపు తప్పకుండా ఉండాలి. ఇక్కడ టీచర్ ఆ మాట అన్నారంటే, పిల్లలను గాడిలో పెట్టాలనేది గురువుగా ఆయనకు ఉన్న భావన.

మరి.. మండలిలో కూడా అలాగే అన్వయించుకోవాలా? ప్రజలకు దిశానిర్దేశం బాధ్యతాయువతమైన మంత్రులు, ప్రతిపక్ష నేతల మధ్య ఇలాంటి మాటలు వాంఛనీయమా? సమర్థనీయమా? అనేది సమాధానం లేని మిలియన్ డాలర్ల ప్రశ్నలు, మండలి ఛైర్మన్ ఈ మాటలకు అర్ధాలు వెదికి రూలింగ్ ఇవ్వడం వరకు ఎందుకు వెళ్లాలి. సందర్భం ఎదైనా సరే 15 సంవత్సరాల కిందటి తెలుగు చట్టసభల పనితీరును గుర్తు చేసుకోలేరా? అక్కడ కూడా వీరే సభ్యులు కదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

వైసీపీ హయాంలోనూ అదే తీరు

ఈ సంస్కృతి ఒక్కరోజులో రాలేదు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు విపక్షాలపై వాడిన భాష జుగుప్సాకరంగా మారిందనే విమర్శలు వచ్చాయి. నాయకులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, కుటుంబ సభ్యులను సైతం చర్చలోకి లాగడం ద్వారా చట్టసభల స్థాయి రచ్చబండ కంటే హీనంగా తయారైంది.

భావి తరాలకు ఇస్తున్న సందేశం ఏంటి?

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభను సందర్శించేందుకు పాఠశాల విద్యార్థులకు అనుమతినిచ్చారు. చట్టసభలు ఎలా నడుస్తాయో చూసి నేర్చుకోవాలని వచ్చిన విద్యార్థులకు, యువతకు మనం ఏ పాఠాలు నేర్పిస్తున్నాం?

నాయకులే ఒకరినొకరు 'ఎద్దు', 'పంది', 'దద్దమ్మ' అని పిలుచుకుంటూ, అది తప్పు కాదని సమర్థించుకుంటే... సమాజంలో, ముఖ్యంగా యువతలో అసహనం, శారీరక రూపాన్ని ఎగతాళి చేసే ధోరణి పెరుగుతుంది.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. నాటి రోశయ్య, చంద్రబాబు, నాగం వంటి నాయకులు విమర్శల్లో పదును తగ్గకుండానే గౌరవాన్ని కాపాడుకున్నారు. కానీ నేడు అధికారం మారినా, నాయకులు మారినా భాషా సంస్కృతి మాత్రం దారుణంగా దిగజారుతోంది. చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్, మండలి ఛైర్మన్‌లతో పాటు ప్రజాప్రతినిధులందరిపైనా ఉంది. అన్ పార్లమెంటరీ పదాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, చట్టసభలు భవిష్యత్తులో భావి తరానికి తప్పుడు మార్గాన్ని చూపే ప్రమాదముంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh