గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రసవం అంటేనే ఒకప్పుడు సహజ ప్రక్రియ. కానీ, కాలక్రమేణా అది కాస్తా రూట్ మార్చి ఆపరేషన్ (సి-సెక్షన్) మయంగా మారిపోయింది.
ఈ ధోరణిని మార్చి, మళ్లీ సహజ ప్రసవాలను (Normal Deliveries) ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మకమైన సి- సేఫ్ (C-SAFE) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే, సుఖవంతమైన డెలివరీల పేరుతో సహజ కాన్పులకు బదులుగా ఆపరేషన్లు చేస్తూ కాసులు కురిపించుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల వ్యాపార దందాను ఈ కొత్త విధానం ఎంత మేరకు అడ్డుకోగలదు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అంతర్జాతీయ అండతో పైలట్ సమరంరాష్ట్ర ప్రభుత్వం ఈ సవాలును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ ప్రసిద్ధ విద్యా, సేవా సంస్థలైన లివర్‌పూల్, బర్మింగ్‌హోమ్ యూనివర్సిటీలతో పాటు, ఫెర్నాండెజ్ ఫౌండేషన్, యునిసెఫ్ (UNICEF) భాగస్వామ్యంతో ఈ సి-సేఫ్ ప్రాజెక్టును నడుపుతోంది. తొలి విడతగా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు (GGH) సహా తణుకు జిల్లా ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టారు. లేబర్ రూమ్‌లు, ఆపరేషన్ థియేటర్లలో నాణ్యమైన సేవలు అందించేలా ప్రసూతి, శిశు వైద్యులు, నర్సులు, మిడ్‌వైఫ్‌లకు అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ ప్రభుత్వ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు.చేయి దాటిన ప్రైవేట్ సి-సెక్షన్ మాయాజాలంప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం.. ఏ ప్రాంతంలోనైనా మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు కేవలం 10% నుండి 15% లోపు మాత్రమే ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో ఈ లెక్కలు చూస్తే గుండె గుభేల్ అనక మానదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 57.89%, సిజేరియన్లు 42.11% జరుగుతుంటే.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అక్కడ నార్మల్ డెలివరీలు కేవలం 32.24% మాత్రమే అవుతుంటే, సిజేరియన్లు ఏకంగా 67.76% రికార్డవుతున్నాయి. అంటే ప్రైవేట్ గడప తొక్కిన ప్రతి ముగ్గురు గర్భిణులలో ఇద్దరికి పొట్ట కోయాల్సిందే అనే రీతిలో వ్యాపార వేట సాగుతోంది.ప్రసవాల ఆడిట్.. ప్రైవేటుకు చెమటలు పట్టేనా?ఈ విచ్చలవిడి వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఒక కఠినమైన అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇకపై కేవలం ప్రభుత్వ ఆసుపత్రులే కాదు.. అన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రతి సి-సెక్షన్ డెలివరీపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. అసలు ఆపరేషన్ చేయాల్సినంత అత్యవసర పరిస్థితి ఉందా? లేదా కేవలం డబ్బుల కోసమే చేశారా? అనే దానికి ఆసుపత్రులు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ లేకుండా, అనవసరంగా సిజేరియన్లు చేసినట్లు తేలితే సదరు ఆసుపత్రులు, వైద్యులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం గట్టి సంకేతాలు పంపింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలపై ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ఆడిట్'ఎంతవరకు విజయవంతం అవుతుందనేది క్షేత్రస్థాయిలో దీనిని ఎంత కఠినంగా అమలు చేస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాగితంపై ఈ నిర్ణయం విప్లవాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆడిటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, రాజీలేకుండా సాగినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. వైద్య కారణాలు లేకుండా, కేవలం ముహూర్తాల కోసమో లేదా కమర్షియల్ ప్రయోజనాల కోసమో సిజేరియన్లు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై గట్టి నిఘా ఉంచడం, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చు. అయితే, కేవలం ఆసుపత్రులను నియంత్రించడమే కాకుండా.. నార్మల్ డెలివరీ సురక్షితమైనదనే నమ్మకాన్ని, అవగాహనను గర్భిణుల్లోనూ, వారి కుటుంబ సభ్యుల్లోనూ కల్పించినప్పుడే ఈ ప్రసవాల ఆడిట్ సంపూర్ణంగా సక్సెస్ అయి, రాష్ట్రంలో సిజేరియన్ల దందాకు గట్టి బ్రేక్ పడుతుంది.
విజయం సాధించాలంటే ఏం చేయాలి?ప్రభుత్వం తెచ్చిన సి-సేఫ్, ఆడిట్ విధానాలు కాగితం మీద చాలా బలంగా కనిపిస్తున్నాయి. కానీ, గ్రౌండ్ లెవెల్‌లో ఇవి విజయవంతం కావాలంటే ప్రైవేట్ ఆసుపత్రుల లాబీయింగ్‌ను తట్టుకుని నిలబడాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు పారదర్శకంగా జరగాలి. ముహూర్తాల పేరుతో ఆపరేషన్ల వైపు మొగ్గుచూపే ప్రజల్లోనూ మార్పు రావాలి. ప్రభుత్వం ఈ నిబంధనలను ఎంత పక్కాగా అమలు చేస్తుందనే దానిపైనే... ఏపీలో ప్రసవాల పేరిట సాగుతున్న ఆపరేషన్ల దందాకు బ్రేక్ పడుతుందా లేదా అనేది ఆధారపడి ఉంది.

