ఉపాధి కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఆ కుటుంబంలో ఆస్తి చిచ్చు అంతులేని విషాదాన్ని నింపింది. తిరుపతి జిల్లాకు చెందిన ఒక మహిళ సౌదీ అరేబియాలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.
కుటుంబ కలహాలు, ఆస్తుల గొడవలే ఈ బలవన్మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సంసారంలో ఆస్తి చిచ్చుతిరుపతి జిల్లా పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత (36)కు, విశ్రాంత ఎస్‌ఐ కోనేటి చెంగయ్య చిన్న కుమారుడు కృష్ణతో గతంలో వివాహమైంది. వీరు కొంతకాలం శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్‌లో నివాసం ఉండేవారు. వీరికి రూపేష్, లోహిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకు సౌదీలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం రావడంతో, భార్యాపిల్లలతో కలిసి అక్కడే స్థిరపడ్డారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో తిరుపతిలోని కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివాదాలు వీరి జీవితాల్లో అలజడి సృష్టించాయి.మనస్తాపంతో బలవన్మరణంసౌదీలోని జుబేల్ ప్రాంతంలో నివసిస్తున్న మమత, గత కొంతకాలంగా తిరుపతిలో ఉన్న తమ కుటుంబ ఆస్తుల గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలే తన కుమార్తె ప్రాణం తీశాయని, తీవ్ర ఒత్తిడి కారణంగానే మమత ఈ కఠిన నిర్ణయం తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మృతదేహం కోసం తల్లిదండ్రుల నిరీక్షణకళ్లముందే తిరుగుతూ విదేశాలకు వెళ్లిన కుమార్తె, ఇలా శవమై తిరిగి వస్తుందని ఊహించని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సౌదీలో ఉన్న మమత మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం తమకు సాధ్యం కాదని, ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపి మృతదేహాన్ని ఇండియాకు వచ్చేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుమార్తెను కడసారి చూసుకునే అవకాశం కల్పించాలని వారు వేడుకుంటున్నారు.

