తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ అడ్డం తిరిగారు. ఆమె తన ఓటమిని అంగీకరించడం లేదు. ఇదో పెద్ద కుట్ర అని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమె మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని స్పష్టం చేస్తూనే, ప్రస్తుత పరిస్థితులపై సంచలన విమర్శలు చేశారు. తన పోరాట పంథాను మరింత ఉధృతం చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆమె ఏమన్నారంటే...
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు మమతా బెనర్జీ తెరదించారు. రాజీనామా చేస్తారా అని అడిగిన ప్రశ్నకు మమతా ఘాటుగా స్పందించారు. "అలాంటి ప్రసక్తే లేదు. నేను పోరాటం కొనసాగిస్తాను" అని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేయబోనని, ప్రజాతీర్పు కంటే కుట్ర కారణంగానే ఓటమి ఎదురైందని ఆరోపించారు.

బెంగాల్‌లో తాము ఒక రాజకీయ పార్టీతో పోటీ పడలేదని, ఆ పార్టీ తరపున పనిచేసిన ఎన్నికల సంఘంతోనే పోరాడామని మమతా వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని, సీఈసీ ఒక విలన్‌గా వ్యవహరించారని మండిపడ్డారు.
టెక్నికల్ అంశాలపై సందేహాలు..
ఈవీఎంల పనితీరుపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 80-90 శాతం ఛార్జింగ్ ఎలా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వెనుక ఉన్న గూఢార్థాన్ని ఆమె ఎండగట్టారు.
దాదాపు 90 లక్షల ఓటర్ల తొలగింపును ప్రస్తావిస్తూ, కోర్టుకు వెళ్లిన తర్వాతే 32 లక్షల పేర్లు చేర్చారని వివరించారు.
లెక్కింపులో అవకతవకలు
ఓట్ల లెక్కింపులో భారీ కుట్ర జరిగిందని, దాదాపు 100 స్థానాల్లో టీఎంసీ గెలుపును అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. టీఎంసీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికే లెక్కింపు ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా సాగించారని విమర్శించారు. ఎన్నికల అనంతర హింసపై విచారణకు 10 మంది సభ్యులతో కూడిన నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
భవిష్యత్తు కార్యాచరణ
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ వంటి జాతీయ నేతలు తనకు మద్దతు తెలిపారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 'ఇండియా' కూటమిని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు.
బెంగాల్‌లో మే 9న కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. మమతా బెనర్జీ ప్రతిపక్ష నాయకురాలి పాత్రలో ఇముడుతారా లేక వీధి పోరాటం చేస్తారా అనేది వేచి చూడాల్సిన ప్రశ్న. ఈ ఎన్నికలు చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతాయని మమతా హెచ్చరించారు.

