Dailyhunt
ఐఎన్‌ఎస్‌ తారాగిరి జలప్రవేశమైందిలా..

ఐఎన్‌ఎస్‌ తారాగిరి జలప్రవేశమైందిలా..

ఇండియన్‌ నౌకాదళంలోకి మరో శక్తివంతమైన యుద్ధనౌక చేరింది. ఐఎన్‌ఎస్‌ తారాగిరి పేరు కలిగిన ఈ వార్‌ షిప్‌ యుద్ధరంగంలో తన సత్తా చాటడానికి రంగ ప్రవేశం చేసింది.

దీనిని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో లాంఛనంగా జల ప్రవేశం చేశారు. జాతికి అంకితం చేశారు.

తారాగిరిని జాతికి అంకితం చేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

రాజ్‌నాథ్‌సింగ్‌ ఏమన్నారంటే?ఐఎన్‌ఎస్‌ తారాగిరి జలప్రవేశం అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. 'దేశ రక్షణతో పాటు సముద్ర వాణిజ్యం ఎదుర్కొంటున్న భద్రత సవాళ్లను అధిగమించడంలో ఇండియన్‌ నేవీ బహుముఖంగా పని చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సబ్‌సీ కేబుళ్లను కాపాడుకోవడం, సైబర్‌ దాడులను ఎదుర్కోవడం చాలా కీలకంగా మారింది. తీరాలను సురక్షితం చేసుకోవడానికే మనం పరిమితం కాకూడదు. మన జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కీలకమైన సముద్ర మార్గాలు, చోక్‌ పాయింట్లు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలకు కూడా రక్షణ కల్పించాలి. ఇండియ¯Œ నేవీ సామర్థ్యం ప్రపంచంలోనే చాలా పటిష్టమైనంది. సముద్ర రక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది. పర్షియన్‌ గల్ఫ్, మలక్కా జలసంధిలో మన నేవీ కీలకంగా వ్యవహరిస్తూ ఎంతో గర్వించదగ్గ పాత్ర పోషిస్తోంది. కీలకంగా వ్యవహరిస్తోంది. ఐఎన్‌ఎస్‌ తారాగిరి ప్రవేశంతో ఇండియన్‌ నేవీ మరింత బలోపేతం అవుతోంది. భద్రతాపరమైన పనులన్నింటిలో భారత నావికాదళం చురుకుగా పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది' అని రాజ్‌నాథ్‌సింగ్‌ ఉద్ఘాటించారు. అంతకుముందు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. ఐఎన్‌ఎస్‌ తారాగిరిని జలప్రవేశం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌ ఢిల్లీకి పయనమయ్యారు.

జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ఐఎన్‌ఎస్‌ తారాగిరి గురించి..

1980-2013ల మధ్య భారత నావికాదళం సేవల్లో ఉన్న లీండర్‌ క్లాస్‌ ఫ్రిగేట్‌ అయిన ఐఎన్‌ఎస్‌ తారాగిరి. అయితే 2013లో సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఈ యుద్ధనౌకకు రెండోసారి అదే పేరు పెట్టారు. దీనిని ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ నిర్మించారు. 2020 సెప్టెంబర్‌ 10న ఈ నౌక నిర్మాణాన్ని పూర్తి చేసి కేవలం రెండేళ్లలోనే 2022 సెప్టెంబర్‌ 11న జల ప్రవేశం చేయించారు. మజగావ్‌ డాక్‌ నిర్మించిన మూడవ ప్రాజెక్టు 17ఎ-తరగతి నౌక అయిన ఈ తారాగిరిని నవంబరు 28, 2025న భారత నావికాదళానికి అప్పగించారు. తొలుత దీనిని 2025 ఆగస్టు నాటికి, ఆ తర్వాత అదే ఏడాది డిసెంబరు నాటికి సేవల్లోకి ప్రవేశపెట్టాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. కాగా యుద్ధనౌక తారాగిరిని మొదట ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలని యోచించారు. అయితే అనివార్య కారణాలతో శుక్రవారం నాటికి షెడ్యూల్‌ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్, నేవీ ఉన్నతాదికారులు

ఐఎన్‌ఎస్‌ తారాగిరి ప్రత్యేకతలేమిటంటే?

యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ తారాగిరి 6,670 టన్నుల బరువును తీసుకెళ్ల గలుగుతుంది. 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు ఉంటుంది. గంటకు 28 నాట్స్‌ (52 కి.మీల) వేగంతో ప్రయాణిస్తుంది. ఈ నౌకలో 32 విమాన విధ్వంసక క్షిపణులు, 8 బ్రహ్మోస్‌ నౌకా విధ్వంసక క్షిపణులు, 8 భూమిపై దాడి చేసే క్రూయిజ్‌ క్షిపణులు, 76 ఎంఎం నావికా ఫిరంగి, ఏకే 630 తుపాకులు ఉంటాయి. అంతేకాదు.. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధానికి అవసరమైన రెండు ట్రిపుల్‌ టార్పెడో ట్యూబ్‌లు (వరుణాస్త్ర), ఆర్బీయూ-6000 జలాంతర్గామి వ్యతిరేక రాకెట్‌ లాంఛర్లు (72 రాకెట్లు), హెచ్‌ఏఎల్‌ ధృవ్‌/సీకింగ్‌ ఎంకే 42బీ హెలికాప్టర్లు ఉంటాయి. ఈ ఐఎన్‌ఎస్‌ తారాగిరి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయి సముద్ర కార్యకలాపాలను నిర్వహించగలుగుతుంది. ఈ నౌక శత్రువుల రాడార్లకు చిక్కని అధునాతన స్టెల్త్‌ సాంకేతికతతో, మెరుగైన ఆయు వ్యవస్థలతో రూపొందించబడింది.

నీలగిరి శ్రేణిలో నాలుగోది తారాగిరి..

భారత నావికాదళంలోకి నీలగిరి శ్రేణిలో మొదటి నౌకను గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం గత ఆగస్టులో మరో రెండు నీలగిరి శ్రేణి యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి చేరాయి. ఈ నౌకలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖపట్నంలో నేవీలోకి ప్రవేశపెట్టారు. భారత నావికాదళ చరిత్రలో ఒకేసారి రెండు యుద్దనౌకలను ప్రవేశపెట్టడం అదే తొలిసారి. వీటికి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, హిమాలయాల్లోని హిమగిరి పర్వతాల పేర్లను పెట్టారు.

విశాఖ కేంద్రంగా తారాగిరి సేవలు..

ఇకపై ఈ ఐఎన్‌ఎస్‌ తారాగిరి యుద్దనౌక తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం కేంద్రంగా తన విధులు నిర్వహిస్తుంది. అవసరమైన సమయంలో ఇక్కడ నుంచే కదనరంగంలోకి దూకుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh