Dailyhunt
అమరావతిలో అధికారుల నివాస భవనాలు నెలాఖరుకు పూర్తి

అమరావతిలో అధికారుల నివాస భవనాలు నెలాఖరుకు పూర్తి

రాజధాని అమరావతి అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 4,026 నివాస ఇళ్ల స్థితిగతులపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు.

బుధవారం జరిగిన ఈ సమీక్ష సమావేశానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (AGICL) ఎండీ శ్రీనివాస్, ఇంజినీర్లు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై విస్తృత చర్చ జరిగింది.

4,026 ఇళ్ల నిర్మాణం-పురోగతి ఎలా ఉంది?

అమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,026 నివాస యూనిట్లు నిర్మాణం జరుగుతున్నాయి. ఇందులో మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, AIS అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్ ఉద్యోగులు, గ్రూప్-డి ఉద్యోగుల కోసం బంగ్లాలు, అపార్ట్‌మెంట్ టవర్లు, విల్లాలు ఉన్నాయి.

ఇప్పటికే ఎక్కువ భాగం నిర్మాణాలు దశల వారీగా పూర్తి సమీపంలో ఉన్నాయి.

ఫినిషింగ్ పనులు (క్యాబినెట్లు, డోర్లు, ఇంటీరియర్ వర్క్స్) వేగంగా జరుగుతున్నాయి.

ఈ నెలలోనే పలు టవర్లు, భవనాలను ప్రభుత్వానికి అప్పగించేందుకు లక్ష్యం నిర్దేశించారు.

నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాలు (డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, సెవరేజ్, విద్యుత్ నెట్‌వర్క్, రోడ్లు) కల్పనపై సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇళ్లు సిద్ధమైన వెంటనే అధికారులు, ఉద్యోగులు వారి నివాసాలకు మారేందుకు అన్ని సదుపాయాలు సమకూర్చాలని మంత్రి నారాయణ సూచించారు.

కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి ఆదేశం

పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారం, వేగంగా పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్ట్ సంస్థలను మంత్రి ఆదేశించారు. ఆలస్యాలకు తావు లేదని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేసి, రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని నారాయణ పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణం ఇప్పుడు 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్' విధానంతో ముందుకు సాగుతోంది. అధికారులు, ఉద్యోగుల నివాసాలు సిద్ధమవడంతో రాజధాని పరిపాలనా యంత్రాంగం త్వరలో అమరావతికి మారడం సాధ్యమవుతుంది. ఈ పురోగతి అమరావతి భవిష్యత్‌పై నూతన ఆశలు రేకెత్తిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh