Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పుల మధ్య అభివృద్ధి హామీలు..

అప్పుల మధ్య అభివృద్ధి హామీలు..

శ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన భారీ హామీలను అమలు చేయాలంటే రూ. వేల కోట్ల అదనపు వ్యయం అవసరం.

కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది.

సంక్షేమ పథకాలు, ఉద్యోగుల డీఏ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన.. ఇలా అన్ని రంగాల్లో భారీ ఖర్చులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న రాష్ట్రం ఈ హామీలను ఎలా అమలు చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు..

2026-27 మధ్యంతర బడ్జెట్ ప్రకారం పశ్చిమ బెంగాల్ మొత్తం అప్పులు రూ.8.15 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి భారీ ద్రవ్యలోటు కూడా ఉంది.

బడ్జెట్ అంచనాల ప్రకారం..

  • ద్రవ్య లోటు : రూ.62,423 కోట్లు
  • రెవెన్యూ లోటు : రూ.21,759 కోట్లు
  • రుణ చెల్లింపులు : దాదాపు రూ.98,000 కోట్లు

ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల వడ్డీలు, సంక్షేమ పథకాలకే వెళ్తోంది.

బీజేపీ ప్రధాన హామీలు..

ఎన్నికల సమయంలో బీజేపీ పలు కీలక హామీలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమాన డీఏ, ఏడో వేతన సంఘం అమలు, మహిళలకు నెలకు రూ.3వేల ఆర్థిక సాయం, యువతకు ప్రోత్సాహకాలు, భారీ నియామకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమలకు ప్రోత్సాహం..ఇవన్నీ అమలు చేయాలంటే రాష్ట్రంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

డీఏ అమలు పెను భారమా?

గత ప్రభుత్వం అంచనా ప్రకారం కేవలం 4 శాతం డీఏ పెంపుతోనే రూ.750 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పూర్తి డీఏ సమానత్వం తీసుకురావాలని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి తోడు ఏడో వేతన సంఘం అమలు చేస్తే జీతాల భారం మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

సంక్షేమ పథకాలకే భారీ ఖర్చు..

ప్రస్తుతం రాష్ట్ర మొత్తం వ్యయంలో దాదాపు 46 శాతం సంక్షేమ పథకాలకే వెళ్తోంది. మధ్యంతర బడ్జెట్ ప్రకారం సంక్షేమ, సామాజిక రంగాలకు రూ.1.8 లక్షల కోట్లు కేటాయించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొన్ని పథకాల కింద చెల్లింపులను పెంచుతామని ప్రకటించడంతో ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఆదాయ పెంపు అంత ఈజీ కాదు..

జీఎస్టీ అమలయ్యాక రాష్ట్రాలకు పన్నుల వసూళ్లలో స్వేచ్ఛ తగ్గింది. దీంతో రాష్ట్రాలు స్వంత ఆదాయాన్ని పెంచుకోవడం కష్టమవుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్, డీజిల్‌పై అధిక వ్యాట్, మద్యం పై భారీ పన్నులు,

అధిక స్టాంప్ డ్యూటీలు, ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మోటారు వాహనాలపై అధిక పన్నులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరింత పన్నులు పెంచితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

"హామీలు అమలు కష్టమే"

ఆర్థికవేత్త ప్రశేన్‌జిత్ బోస్ (Prasenjit Bose) అభిప్రాయం ప్రకారం.. కేంద్రం నుంచి భారీ ఆర్థిక సహాయం రాకపోతే బీజేపీ హామీలు అమలు చేయడం చాలా కష్టమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిశ్రమలపై ఫోకస్..

కొత్త ప్రభుత్వం పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త భూ విధానం తీసుకురావాలని యోచిస్తోంది. ఆరు నెలల్లో కొత్త భూ విధానం వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంలో..

పరిశ్రమలకు భూముల సమీకరణ, భూ యజమానులకు మెరుగైన పరిహారం, ప్రభావిత కుటుంబాలకు దీర్ఘకాలిక ఆదాయం, వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది.

సింగూర్, నందిగ్రామ్ భయం..

పశ్చిమ బెంగాల్‌లో భూసేకరణ చాలా సున్నితమైన అంశం. గతంలో సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాలు అప్పటి లెఫ్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అదే ఉద్యమాల కారణంగా మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ పరిశ్రమల కోసం భూసేకరణ చేపడితే రాజకీయంగా ప్రతికూల ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

"డబుల్ ఇంజిన్"పై అసలైన పరీక్ష..

బీజేపీ ఇప్పుడు "డబుల్ ఇంజిన్ సర్కార్" నినాదాన్ని నిజం చేయాల్సిన పరిస్థితిలో ఉంది. రాష్ట్రం-కేంద్రం ఒకే పార్టీ చేతుల్లో ఉండటం వల్ల.. కేంద్ర నిధులు పెరగొచ్చు. పెట్టుబడిదారుల విశ్వాసం పెరగొచ్చు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కావొచ్చు అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అయితే పారిశ్రామిక వృద్ధి తక్షణ ఫలితాలు ఇవ్వదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కేంద్ర బకాయిలపై ఆశలు..

గ్రామీణ ఉపాధి, గృహ నిర్మాణ పథకాల కింద పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం నుంచి రూ.వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గత ప్రభుత్వం చెబుతోంది. ఈ నిధులు విడుదలైతే రాష్ట్రానికి కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

బీజేపీ ముందున్న అసలైన సవాలు..

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. హామీలు నిలబెట్టుకుంటుందా? లేక ఆర్థిక భారంతో వెనక్కి తగ్గుతుందా? అన్నది. ఎన్నికల హామీల నుంచి పరిపాలన వైపు అడుగుపెట్టిన బీజేపీకి ఇప్పుడు బెంగాల్ అసలైన అగ్నిపరీక్షగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh