అక్కడెక్కడో ఉన్న కడప నుంచి వచ్చాడు. ఇక్కడ ప్రజలను మతం ముసుగులో ఉద్ధరిస్తానంటూ ఊదరగొట్టాడు. కొండ కోనల్లో తిరిగాడు. నానా హడావుడి చేశాడు. కొంతమందిని తన వెంట తిప్పుకున్నాడు.
కూటమి నేతలతో పాటు ప్రతిపక్ష నాయకుడి పైనా నిప్పులు చెరిగాడు. కొందరి అమాయక స్థానిక గిరిజనుల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని చూశాడు. తన నోటి దురుసు, వివాదాస్పద వ్యాఖ్యలతో తక్కువ కాలంలోనే ప్రాచర్యుంలోకి రావాలనుకున్నాడు. అందుకోసం కొన్నాళ్లుగా స్కెచ్ వేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం దానికి పదును పెట్టాడు. తనపై హత్యాయత్నం జరిగిందంటూ క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకున్నాడు. అక్కడి వరకూ బాగానే ఉన్నా.. చివరకు ఈ పథకం బెడిసికొట్టి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇదంతా ప్రశాంత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ రూపంలో అలజడి రేపుతున్న భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ గురించేనని వేరే చెప్పక్కర్లేదు.

ఘటనా స్థలంలో దర్శన్ కారు
అభినయ్ అడవిలో అడుగు పెట్టాడిలా..కడప జిల్లాకు చెందిన నటుడు కూడా అయిన అభినయ్ దర్శన్ కొన్నేళ్లుగా క్రైస్తవ మత బోధకుడిగా ఉన్నాడు. ఏడాది క్రితం మార్చి 25న రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్/క్రైస్తవ ప్రభోదకుడు ప్రవీణ్ పగడాల మరణించిన సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభినయ్ వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన హిందూ మత వ్యతిరేక ప్రచారంతో మరింత ప్రచారంలోకి రావాలని తలంచాడు. అలా ఆయన ఈ ఏడాది జనవరిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి భరోసా పార్టీ అధ్యక్షుడినంటూ అడుగు పెట్టాడు. అల్లూరి జిల్లాలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు గిరిజనుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న నెపంతో అనంతగిరి మండలం చిలకలగెడ్డ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాడు. ఇక అక్కడ నుంచి తరచూ మత విధ్వేషాలను రెచ్చెగొట్టేలా వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు.

కారు నుంచి దర్శన్‌ను బయటకు లాగుతున్న కిరాయి కూలీలు
జగన్‌పైనా అభినయ్ కామెంట్లు..
'మా అన్న ఉన్నాడు తెలుసా.. జగనన్న. మా వాడే. మా బంధువవుతాడు. జగనన్న క్రైస్తవుడే. మణిపూర్‌లో క్రైస్తవులను నడిరోడ్డుపై ఊచకోత కోస్తే, నగ్నంగా ఊరేగిస్తే జగన్ మాట్లాడలేదు. మనం మాత్రం క్రైస్తవుడని ఓట్లేసేస్తాం. జగన్ మా ఊరోడు. మా కడపోడు. ఆయనకు మాట్లాడాలని ఉంటుంది. కానీ పదవి ముఖ్యం. పైనున్నోడు మోదీ తన్నుతాడని భయం. నేను గాని, నా తరఫున ఎన్నికల్లో నిలబెట్టే క్రైస్తవులు ఎలా వుంటారంటే.. ఎమ్మెల్యేలా, క్రైస్తవులా? అంటే ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తా.. నేను చచ్చిపోయే చివరి క్షణంలో రాజకీయ నాయకుడిగా కాదు.. క్రైస్తవుడిగా చనిపోవాలనుకుంటున్నా' అంటూ కొన్నాళ్ల క్రితం అల్లూరి జిల్లాలో చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. అంతేకాదు.. తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై కూడా ఆయన మత సంబంధిత విమర్శలే చే స్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గిరిజన సమస్యలను పరిష్కరిస్తున్న తనను హతమారుస్తామంటూ వీడియో కాల్‌లో బెదిరిస్తున్నారంటూ ఆయన ఇటీవల ఒక వీడియోను కూడా విడుదల చేశాడు.

ఘటన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న అభినయ్..
రక్తి కట్టించని హత్యాయత్నం డ్రామా..
ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రాంలో పోస్టులు చేసే జీకే వీధికి చెందిన వసంతరావు అనే వ్యక్తిని సంప్రదించాడు అభినయ దర్శన్. ఆయనకు తన డ్రామా సీన్‌ను వివరించాడు. మరికొందరు కిరాయి వ్యక్తులతో రెండ్రోజుల క్రితం జీకే వీధి మండలం మొండిగడ్డ వద్దకు బయల్దేరారు. అక్కడ తనపై వారు దాడి చేసినట్టు నటించాలని, ఒంటిపై గాయపరచాలని పథకం పన్నాడు. ఆ ప్రకారమే వారు ముఖాలకు మాస్కులు రించి కారులోంచి అభినయ్‌ను బయటకు లాగుతూ తూతూమంత్రంగా బీరు సీసాలతో గాయపరిచారు. ఆ సీన్ అంతటినీ వీడియోలో చిత్రీకరించి, తనపై హిందూత్వ వాదులు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాకు వదిలాడు. అనంతరం గాయాలకు కట్లు కట్టించుకుని వచ్చి మీడియాతో మాట్లాడాడు.
అడ్డంగా బుక్కయిన అభినయ్..
పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగిందంటూ సోషల్ మీడియాలో హోరెత్తడంతో మత విధ్వేషాలు చెలరేగుతాయని పాడేరుతో పాటు ఏపీ పోలీసులు కలవరపడ్డారు. అప్పటికే కొన్ని మీడియా ఛానల్స్, యూ ట్యూబర్లు, సోషల్ మీడియాలో పాస్టర్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగిందంటూ కథనాలను వండి వార్చడం మొదలెట్టారు. హత్యాయత్నం డ్రామాకు ముందు తనపై ఎక్కడ? ఎలా దాడి చేయాలో అవతలి వ్యక్తులకు పంపిన వాయిస్ రికార్డును పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు అభినయ్‌పై జరిగింది హత్యాయత్నం కాదని, తనంతట తానే చేసిన కుట్రగా తేల్చారు. దీంతో అభినయ్ ఆడిన డ్రామా బట్టబయలైంది. అనంతరం పోలీసులు విశాఖలో ఉన్న అభినయ్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని అల్లూరి జిల్లాకు తీసుకెళ్లారు. ఈ కుట్ర వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఎనిమిది మందిపై కేసులు నమోదుః ఎస్పీ
పాస్టర్ అభినయ్ దర్శన్ డ్రామా వ్యవహారంలో ఎనిమిది మందిపై అల్లూరి జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ1 పాస్టర్ అభినయ్, ఏ2 బిల్లా కిరణ్, ఏ3 కె.బెన్హర్, ఏ4 భానుప్రసాద్‌లతో పాటు దాడికి సహకరించిన వసంతకుమార్, ప్రేమ్‌కుమార్, సత్యరాజు, ఇంద్రకుమార్‌లపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ బుధవారం సాయంత్రం మీడియాకు చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న అభియోగంపై ఈ కేసులు పెట్టినట్టు తెలిపారు. అభినయ్‌పై గతంలో వరకట్నం, యువతిని వేధించిన కేసులు కూడా ఉన్నాయని చెప్పారు ఎస్పీ బర్దార్.

