పశ్చిమ బెంగాల్‌కు తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి, పదవి చేపట్టిన కొద్ది రోజులకే వరుస నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు.
భద్రత, చట్టం-శాంతి, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు వంటి కీలక అంశాలపై ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష టీఎంసీపై పూర్తిగా ప్రతీకార రాజకీయాలు చేయబోమనే సంకేతాలు కూడా ఇస్తున్నారు.
తొలి కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు..
కోల్‌కతాలో మే 9న జరిగిన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మే 11న జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బంగ్లాదేశ్ సరిహద్దుకు కంచె..
రాష్ట్రంలోకి అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణానికి భూమి బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 45 రోజుల్లోగా భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించాలని ఆదేశాలిచ్చారు. ఈ ప్రక్రియను ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించనున్నారు.
కేంద్ర పథకాలకు గ్రీన్ సిగ్నల్..
ఇప్పటివరకు టీఎంసీ ప్రభుత్వం అమలు చేయని కేంద్ర పథకాలను ఇప్పుడు అమలు చేస్తామని సువేందు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా, బేటీ బచావో బేటీ పఢావో వంటి పథకాలు రాష్ట్రంలో అమలు కానున్నాయి. అయితే టీఎంసీ ప్రభుత్వం ప్రారంభించిన లక్ష్మీర్ భండార్, స్వస్థ్య సాథి వంటి పథకాలు కొనసాగుతాయని కూడా ఆయన స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు వయోపరిమితి పెంపు..
ఉద్యోగాల కోసం సిద్ధమవుతోన్న యువతకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయసు 40 నుంచి 45 సంవత్సరాలకు,ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 43 నుంచి 48 ఏళ్లకు పెంచారు.
కొత్త క్రిమినల్ చట్టాల అమలు..
దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలను పశ్చిమ బెంగాల్‌లో కూడా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జనగణనకు పూర్తి సహకారం..
గత ప్రభుత్వం జనగణన ప్రక్రియలో ఆలస్యం చేసిందని ఆరోపించిన సువేందు, కేంద్ర ఆదేశాలను వెంటనే అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఐఏఎస్ అధికారులు కేంద్ర శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు.
పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు..
బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. అనధికార పశువుల మార్కెట్లను మూసివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో నిఘా కూడా పెంచుతున్నారు.
రోడ్లపై నమాజ్‌కు నియంత్రణ..
ప్రార్థనలు కేవలం అనుమతి ఉన్న మతపరమైన ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.
కోల్‌కతాలో బుల్డోజర్ చర్యలు
తూర్పు కోల్‌కతాలో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కోల్‌కతా, హౌరా ప్రాంతాల్లో బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగించారు. హౌరా రైల్వే స్టేషన్ బయట ఉన్న తాత్కాలిక దుకాణాలను కూడా కూల్చివేశారు.
బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు హామీ
టీఎంసీ పాలనలో హత్యకు గురయ్యారని ఆరోపిస్తున్న బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు న్యాయం చేస్తామని సువేందు ప్రకటించారు. వారి కేసులను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
టీఎంసీపై ప్రతీకారం ఉండదా?
ఎన్నికల తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీ కార్యకర్తల విషయంపై కూడా ప్రభుత్వం స్పందించింది. వారిపై హింస కేసులు లేకపోతే చర్యలు తీసుకోబోమని, కానీ కేసులు ఉంటే చట్టపరంగా వ్యవహరిస్తామని సువేందు హెచ్చరించారు.
ఆర్జీ కార్ కేసులో కీలక నిర్ణయం..
ఆర్‌జీ కార్ అత్యాచారం-హత్య కేసులో కొత్త ప్రభుత్వం వేగంగా స్పందించింది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
మరో కేబినెట్‌పై ఆసక్తి..
మే 18న జరిగే రెండో కేబినెట్ సమావేశంలో కరువు భత్యం, ఏడవ వేతన సంఘం అమలు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

