భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే దిశగా అమెరికా మరో కీలక అడుగు వేసింది. దశాబ్దాల క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించిన లేదా అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించిన 657 పురాతన వస్తువులను అమెరికా ప్రభుత్వం భారతదేశానికి తిరిగి అప్పగించింది.
వీటి మొత్తం విలువ సుమారు 14 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 117 కోట్లు).
మాన్‌హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్ ఆధ్వర్యంలోని 'పురావస్తు అక్రమ రవాణా నిరోధక విభాగం' (ATU) ఈ చారిత్రక కళాఖండాలను గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియలో న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ బినయ ప్రధాన్, కాన్సుల్ రాజలక్ష్మి కదమ్ పాల్గొన్నారు.
తిరిగి పొందిన వస్తువులలో కొన్ని శతాబ్దాల నాటి అరుదైన విగ్రహాలు కూడా ఉన్నాయి..
అవలోకితేశ్వరుడి (Avalokiteshvara) కంచు ప్రతిమ:
సుమారు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే ఈ విగ్రహం 1939లో లక్ష్మణ ఆలయం సమీపంలో వెలుగులోకి వచ్చింది. 1952 నాటికి రాయపూర్‌లోని మహంత్ ఘాసీదాస్ మెమోరియల్ మ్యూజియంలో ఉంచారు. అయితే ఈ ప్రతిమను మ్యూజియం నుంచి దొంగిలించి, 1982 నాటికి అమెరికాకు అక్రమంగా తరలించారు. చివరకు 2014లో న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ కలెక్షన్‌లోకి చేరింది. 2025లో మాన్‌హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం ఈ విగ్రహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది.
నృత్య గణేశుడు..
ఇక మరో ముఖ్యమైన విగ్రహం నృత్య గణేశుడు. ఈ విగ్రహాన్ని 2000లో మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయం నుంచి దొంగిలించారు. రంజీత్ కన్వర్ అనే వ్యక్తి దీనిని అక్రమంగా తరలించాడు. తర్వాత వామన్ ఘియా అనే ట్రాఫికర్ దీన్ని న్యూయార్క్‌లోని గ్యాలరీ యజమాని డోరిస్ వీనర్‌కు విక్రయించాడు.
2012లో వీనర్ మరణించిన తర్వాత, ఆమె కుమార్తె న్యాన్సీ వీనర్ ఈ గణేశ విగ్రహానికి తప్పుడు ఆధారాలు సృష్టించి, క్రిస్టీస్ న్యూయార్క్ వేలంలో విక్రయించింది. ఆ వేలంలో ఒక ప్రైవేట్ కలెక్టర్ ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం ఈ ఏడాది ఆ కలెక్టర్ ఈ విగ్రహాన్ని మాన్‌హాటన్ అధికారులకు స్వచ్ఛందంగా అప్పగించాడు.
అభయ ముద్ర బుద్ధ విగ్రహం..
మరొక పురావస్తువు ఎర్ర రాతితో చేసిన బుద్ధుని విగ్రహం. ఇది 'అభయ ముద్ర'లో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విగ్రహం కాళ్లు మోకాలికి దిగువన విరిగిపోయాయి. తల వెనుక ఉన్న కాంతివలయం భాగాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నష్టం దొంగతనం సమయంలో జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ విగ్రహం విలువ సుమారు 7.5 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ విగ్రహాన్ని కూడా స్మగ్లర్ సుభాష్ కపూర్ న్యూయార్క్‌కు అక్రమంగా తరలించాడు. అనంతరం అతని స్టోరేజ్ యూనిట్ నుంచి అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు.
గత దశాబ్ద కాలంగా మాన్‌హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలోని పురావస్తు ట్రాఫికింగ్ విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ సంస్థలతో కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి పురావస్తువులను అక్రమంగా దోచుకొని విక్రయించినట్లు కపూర్, అతని సహచరులపై ఆరోపణలు ఉన్నాయి.
2012లోనే కపూర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2019 నవంబర్‌లో అతను, మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. 2022లో భారత్‌లో కపూర్ దోషిగా తేలినా, అతని అమెరికాకు అప్పగింత (ఎక్స్‌ట్రడిషన్) ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే అతని ఐదుగురు సహచరులు దోషులుగా తేలారు.
ఈ కేసులో ఇప్పటివరకు 6,200కు పైగా విలువైన పురావస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 485 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. అందులో 5,900కు పైగా వస్తువులను 36 దేశాలకు తిరిగి అప్పగించారు.
అలాగే ఈ కేసులో ఇప్పటివరకు 18 మంది నిందితులు శిక్షలు పొందగా, మరో ఏడుగురు ట్రాఫికర్లు అప్పగింత కోసం ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వస్తువుల కోసం అన్వేషణ..
"భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కొనసాగుతున్న అక్రమ రవాణా నెట్‌వర్క్ పరిధి చాలా పెద్దది. 600లకు పైగా వస్తువులు తిరిగి పొందడం గొప్ప పరిణామమే అయినా, ఇంకా చాలా పని చేయాల్సి ఉంది" అని జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్ పేర్కొన్నారు.

