జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ తనయుడు నిశాంత్.. సమ్రాట్ చౌదరి ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించారా? గురువారం జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా?
అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. దాదాపు రెండు మాసాల క్రితం 45 ఏళ్ల నిశాంత్ జేడీ(యూ)లో చేరిన విషయం తెలిసిందే.
"నిశాంత్ పార్టీలో చేరినప్పటి నుంచి, కొత్త ప్రభుత్వంలో ఆయన చేరాలని కార్యకర్తల కోరిక. గత నెలలోనే ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం వచ్చింది. కాని ఆయన ఆ పదవి చేపట్టేందుకు తొలుత సంకోచించారు. కాని చివరకు అంగీకరించారు," అని నితీష్ సన్నిహితులు చెబుతున్నారు.
తన తండ్రి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
నితీష్ రాజీనామా అనంతరం బీజేపీ నేత సమ్రాట్ చౌదరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరినపుడు, జేడీ(యూ) అధినేత వారసుడు నిశాంత్ మంత్రివర్గంలో ఉంటాడనే ఊహాగానాలొచ్చాయి. అయితే, ఆ పదవిని స్వీకరించే ముందు పార్టీ కార్యకర్తగా తన సత్తా చాటుకోవాలను కుంటున్నానని ప్రకటిస్తూ, నిశాంత్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఫలితంగా, జేడీ(యూ) సీనియర్ నాయకులైన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మంత్రులుగా చేరి, ఉప ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ, అమిత్ షా..
బీహార్‌లో తొలిసారిగా కాషాయ పార్టీ గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ విచేస్తున్నారు. దాదాపు 12 మంది పార్టీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని జేడీ(యూ) వర్గాల సమాచారం.
జేడీ(యూ) నుంచి 16 మంది మంత్రులు..
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది శాసనసభ్యులున్నారు. అయితే మంత్రివర్గంలో 16 మంది దాకా మంత్రులు ఉండాలని తమ పార్టీ కోరుకుంటోందని జేడీ(యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహా గతంలో చెప్పారు. జేడీ(యూ) కోటాలో మంత్రులయ్యే వారిలో అశోక్ చౌదరి, శ్రవణ్ కుమార్, లేశీ సింగ్ ప్రముఖులు. వీరంతా గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు.
జేడీ(యూ), బీజేపీతో పాటు, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీఆర్‌వీ, జీతన్ రామ్ మాంఝీల నేతృత్వంలోని హెచ్‌ఏఎం, అలాగే రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్‌ఎల్‌ఎం నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

