Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిర్యానీ తిని పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా?

బిర్యానీ తిని పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా?

బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తింటే మనుషులు చచ్చిపోతారా? ఈ మిస్టరీ ఏమిటీ, వీళ్లందరూ ఎందుకు చనిపోయారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఒకే కుటుంబం అనుమానాస్పద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ముందు బిర్యానీ తిని, ఆ తర్వాత పుచ్చకాయ తినడంతో ఫుడ్ పాయిజనింగ్‌ అయి ఓ కుటుంబం మృతి చెందినట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అయితే ఈ అనుమానాలను ఆహార నిపుణుల విభాగం తోసిపుచ్చింది.

అసలేం జరిగిందంటే...

ముంబయికి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్‌, ఇద్దరు కుమార్తెలు ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ బిర్యానీ తిన్నారు. బయటికొచ్చాక ఓ ఫ్రూట్ స్టాల్ లో పుచ్చకాయ ముక్కలు కొని తిన్నారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత వాళ్లందరూ వాంతులు, విరేచనాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇది ముంబైలో సంచలనం రేపింది.

బిర్యానీ, పుచ్చకాయ తినడం వల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని మొదట పోలీసులు అనుమానించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) పరీక్షల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ లేకపోవడంతో పాటు, కృత్రిమ రసాయనాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో "బిర్యానీ-పుచ్చకాయ కలిపి తింటే ప్రాణాలు పోతాయి" అన్న వాదనకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టమైంది.

అయితే, అసలు మిస్టరీ ఇక్కడి నుంచి మొదలైంది. మృతుల పోస్టుమార్టం నివేదికలో కొన్ని అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు గుర్తించారు. మెదడు, గుండె, జీర్ణాశయంలో ఈ మార్పులు కనిపించడం సాధారణ ఫుడ్ పాయిజనింగ్ లక్షణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఏదైనా విషప్రయోగం జరిగి ఉండొచ్చని సంకేతంగా భావిస్తున్నారు.

ఇంకా షాకింగ్ విషయమేమిటంటే, అబ్దుల్లా డోకాడియా శరీరంలో మార్ఫిన్ (Morphine) అనే మాదకద్రవ్యం ఉందని గుర్తించారు.

ఇక మరో అనుమానం బ్యాక్టీరియా వైపు. FDA అధికారులు ఇప్పటివరకు బ్యాక్టీరియా పరీక్షలు చేయలేదని చెప్పడంతో, ఆహారంలో సూక్ష్మజీవుల ద్వారా విష ప్రభావం జరిగి ఉండొచ్చనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

ఆకుపచ్చగా మారిన అవయవాలు..

మృతుల పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లను ఆశ్చర్యపరిచిన అంశం వారి అవయవాల రంగు మారడం. అబ్దుల్లా, ఆయన కుటుంబ సభ్యుల మెదడు, గుండె, జీర్ణాశయ భాగాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు గుర్తించారు.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ లక్షణం కాదు. ఏదైనా అత్యంత ప్రమాదకరమైన విషాన్ని (Lethal Poison) ఆహారంలో కలిపినప్పుడు మాత్రమే అంతర్గత అవయవాలు ఇలా రంగు మారుతాయి.

'మార్ఫిన్' గుట్టు ఏంటి?

అబ్దుల్లా శరీరంలో మార్ఫిన్ (Morphine) అనే ఓపియాడ్ డ్రగ్ ఆనవాళ్లు లభించడం దర్యాప్తును మలుపు తిప్పింది. మార్ఫిన్ అనేది తీవ్రమైన నొప్పి నివారణకు (క్యాన్సర్ వంటి దశల్లో) వాడే మందు. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరకదు. అధిక మోతాదులో తీసుకుంటే ఇది శ్వాస వ్యవస్థను స్తంభింపజేసి ప్రాణాలు తీస్తుంది. ఆయన శరీరంలోకి ఈ డ్రగ్ ఎలా వచ్చింది? ఎవరైనా బలవంతంగా ఇచ్చారా లేదా బిర్యానీలో కలిపి ఇచ్చారా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

కీలక ప్రశ్నలు

ఫుడ్ పాయిజనింగ్ కాదంటే అసలు కారణం ఏమిటి?

మార్ఫిన్ శరీరంలోకి ఎలా చేరింది?

అవయవాలు ఆకుపచ్చగా మారడం వెనుక కారణం ఏమిటి?

ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక పూర్వ ప్రణాళికతో చేసిన చర్యా?

ఈ ఘటన సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కేసు కాదు. వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు నిజం ఏమిటో తేలడానికి పోలీసులు, నిపుణుల దర్యాప్తు కీలకం కానుంది.

మొత్తం మీద, "బిర్యానీ-పుచ్చకాయ" కాంబినేషన్ కాదు… దాగి ఉన్న మిస్టరీ కారణమే ఈ మరణాల వెనుక ఉందనే అనుమానం బలపడుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh