Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చీఫ్ జస్టిస్ 'బొద్దింకలు, పరాన్నజీవులు' వ్యాఖ్యలపై దుమారం!

చీఫ్ జస్టిస్ 'బొద్దింకలు, పరాన్నజీవులు' వ్యాఖ్యలపై దుమారం!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన మౌఖిక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

న్యాయకోవిదులు, సామాజిక కార్యకర్తలు, సామాన్యుల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఒక స్పష్టీకరణ ప్రకటన విడుదల చేశారు.

అసలేం జరిగింది? వివాదం ఏమిటి?

ఒక కేసు విచారణ సందర్భంగా కొందరు వ్యక్తులను ఉద్దేశిస్తూ "బొద్దింకలు", "పరాన్నజీవులు" అనే పదాలు వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. భారతదేశంలో అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడానికి బహుజన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలు సోషల్ మీడియాను ఒక ప్రధాన వేదికగా వాడుకుంటున్న తరుణంలో, ఈ వ్యాఖ్యలు నేరుగా వారిని, నిరుద్యోగ యువతను ఉద్దేశించినవేనంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

న్యాయవాదుల అర్హతలను తనిఖీ చేయడానికి జడ్జీల కమిటీని వేయకుండా, సీబీఐ (CBI) కి అప్పగించాలనే ఆలోచనలపై కూడా విమర్శలు వస్తున్నాయి. అసలైన అనర్హులంతా ఉండేది అక్కడేనని, సీబీఐ ఒక్క కేసైనా సరిగ్గా సాల్వ్ చేసిందా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఆధిపత్య మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబర్లను ఏమీ అనకుండా, కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని లక్ష్యం చేసుకోవడం న్యాయవ్యవస్థ పతనానికి అద్దం పడుతోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ప్రశాంత్ భూషణ్ తీవ్ర ఆగ్రహం

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 'X' (ట్విట్టర్) వేదికగా సీజేఐ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. "కొందరు నిరుద్యోగ యువకులను, సామాజిక కార్యకర్తలను 'బొద్దింకలు' అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన సాధారణీకరించిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. కోర్టు ముందుకు వచ్చిన సదరు యువకుడు బాధ్యతారహితంగా ప్రవర్తించి ఉండవచ్చు, అంతమాత్రాన దేశంలోని యువతను, కార్యకర్తలను ఉద్దేశించి అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు."

ఈ వ్యాఖ్యలు ప్రస్తుత "ఫాసిస్ట్ ప్రభుత్వ" ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని, సీజేఐ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సామాజిక కోణం: న్యాయవ్యవస్థపై ప్రశ్నలు

75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎందుకు ఇంతమంది నిరుద్యోగులు తయారవుతున్నారు? ప్రధాన స్రవంతి (మెయిన్‌స్ట్రీమ్) మీడియా పేదల వేదనకు తలుపులు మూసేయడం వల్లే కదా వారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 1980లలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) ద్వారా పేదల సమస్యలను చర్చించిన ఉన్నత న్యాయస్థానాలు, ఇప్పుడు కేవలం రాజకీయ, సెలెబ్రిటీల విషయాల చర్చా వేదికలుగా ఎందుకు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ

ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ డిగ్రీల గురించే మాట్లాడానని వివరించారు.

"నకిలీ, బోగస్ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశిస్తూనే నేను ఆ విమర్శలు చేశాను. అలాంటి వ్యక్తులే మీడియా, సోషల్ మీడియాతో పాటు ఇతర రంగాల్లో చొరబడ్డారు. అందుకే వారిని 'పరాన్నజీవులు' అన్నాను" అని ఆయన స్పష్టం చేశారు.

యువతపై గౌరవం ఉందన్నారు. దేశ యువతను తాను విమర్శించాననడం పూర్తిగా నిరాధారమని సీజేఐ అన్నారు. "భారతీయ యువత పట్ల నాకు ఎంతో గర్వం ఉంది. అభివృద్ధి చెందిన భారత్‌కు వారే మూలస్తంభాలు. నాపట్ల వారికి, వారిపట్ల నాకు పరస్పర గౌరవ మర్యాదలు ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

సీజేఐ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం మాత్రం చల్లారినట్టు లేదు. సూర్యకాంత్ పై ఇంకా అవాకులు చెవాకులతో కూడిన వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh