Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిగురుటాకులా వణికిన యూపీ, 92 మంది మృతి

చిగురుటాకులా వణికిన యూపీ, 92 మంది మృతి

ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి నిదర్శనమే ఇవాళ ఉత్తరప్రదేశ్ లో జరిగిన బీభత్సం. మండువేసవిలో ముంచుకొచ్చిన అకాల వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి.

తీవ్ర గాలిదుమారం, వడగళ్ల వాన, పిడుగులతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఒక్కరోజులోనే 91 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మరో 53 మంది గాయపడగా, వందల సంఖ్యలో పశువులు చనిపోయాయి. చాలా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.

మే నెలలో సాధారణంగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఉత్తర భారతం.. ఈసారి ఒక్కసారిగా ప్రకృతి విరుచుకుపడటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రయాగరాజ్, మీర్జాపూర్, భదోహీ, ఫతేపూర్, సోనభద్రజిల్లాల్లో పరిస్థితి మరింత విషమించింది.

జిల్లాల వారీగా మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లో 21 మంది, భదోహిలో 16 మంది, ఫతేపుర్‌లో 11 మంది, సంత్ రవిదాస్ నగర్‌లో 14 మంది, మీర్జాపుర్‌లో 12 మంది మరణించినట్లు స్థానిక యంత్రాంగం వెల్లడించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా దెబ్బతింది. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ ఘటనలపై యోగీ ఆదిత్యనాధ్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు, విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

క్యుములోనింబస్ మేఘాల ప్రభావమేనా?

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విపత్తుకు ప్రధాన కారణం "క్యుములోనింబస్" మేఘాల ఏర్పాటే. సాధారణంగా మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతాయి. భూమిపై వేడెక్కిన గాలి వేగంగా పైకి ఎగసిపోతుంది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే తేమగాలులు దీనితో కలిసిపోతాయి.

ఈ ప్రక్రియ వల్ల ఆకాశంలో భారీ ఎత్తులో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఇవి తక్కువ సమయంలోనే..

భారీ వర్షాలు,

వడగళ్ల వాన,

పిడుగులు,

తీవ్ర గాలిదుమారాలకు కారణమవుతాయి. ఈసారి యూపీలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు.

వాతావరణ మార్పుల ప్రభావమా?

వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటీవలి కాలంలో దేశంలో అకాల వర్షాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు, ఆకస్మిక తుఫానులు పెరగడం వెనుక వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఉత్తర భారతంలో వేసవికాలంలో తీవ్ర వడగాలులతో పాటు అకస్మాత్తుగా వడగళ్ల వానలు పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.

పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవడం, కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్ల భూఉపరితల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "వేడి తగ్గించడానికి కేవలం చెట్లు నాటడం సరిపోదు.. పట్టణ ప్రణాళిక, నీటి వనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ కూడా కీలకం" అని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వర్షాలకు హెచ్చరిక

వాతావరణ శాఖ రాబోయే 24 నుంచి 48 గంటల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావొద్దని, చెట్ల కింద నిలబడవద్దని, పిడుగుల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh