Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..

దేశవ్యాప్తంగా ఈ రోజు మందుల దుకాణాలు మూతపడ్డాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపు మేరకు వారు సమ్మెకు దిగారు.

దేశవ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 లక్షల వరకు ప్రైవేట్ మెడికల్ స్టోర్లు ఈ బంద్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఆన్‌లైన్ ఫార్మసీ యాప్‌లు, కార్పొరేట్ ఔషధ డెలివరీ సంస్థల విధానాలకు వ్యతిరేకంగా సాంప్రదాయ మెడికల్ షాప్ యజమానులు ఈ ఆందోళన చేపట్టారు.

ఎందుకు ఈ సమ్మె? కెమిస్టుల ప్రధాన ఆరోపణలేంటి?

1. భారీ డిస్కౌంట్లు - చిన్న దుకాణాలకు నష్టం..

ఆన్‌లైన్ ఫార్మసీలు 50 నుంచి 60 శాతం వరకు భారీ తగ్గింపులతో మందులు విక్రయిస్తున్నాయని కెమిస్టులు ఆరోపిస్తున్నారు. చిన్న మెడికల్ షాపులు అంత తక్కువ ధరలకు మందులు ఇవ్వలేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.

2. ఆన్‌లైన్ ఫార్మసీలపై సరైన నియంత్రణ లేదని ఆరోపణ

స్థానిక మెడికల్ షాపులకు కఠినమైన లైసెన్సులు, రెగ్యులర్ తనిఖీలు ఉంటాయి. కానీ ఆన్‌లైన్ ఫార్మసీలు మాత్రం తేలికపాటి నిబంధనలతో పనిచేస్తున్నాయని AIOCD ఆరోపిస్తోంది.

3. ప్రజారోగ్యానికి ప్రమాదమని ఆందోళన..

ప్రిస్క్రిప్షన్ మందులు సరైన ధృవీకరణ లేకుండానే అందుతున్నాయని కెమిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత నకిలీ లేదా AI ద్వారా తయారైన ప్రిస్క్రిప్షన్‌లతో మందులు కొనుగోలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎక్కడెక్కడ బంద్ ప్రభావం ఎక్కువ?

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో 25 వేలకుపైగా మందుల దుకాణాలు మూతపడ్డాయి. హైదరాబాద్ నగరంలోనే సుమారు 12 వేల దుకాణాలు బంద్‌లో పాల్గొన్నాయి.

తమిళనాడులో దాదాపు 40 వేల మెడికల్ షాపులను మూసివేశారు. అయితే అపోలో, మెడ్‌ప్లస్, తులసి ఫార్మసీ, ముత్తు ఫార్మసీ వంటి పెద్ద చైన్ స్టోర్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి ఫార్మసీలు, సహకార సంఘ ఫార్మసీలు, జన ఔషధి కేంద్రాలు కూడా తెరిచి ఉన్నాయి.

ఇక కర్ణాటకలో సుమారు 26 వేల ప్రైవేట్ మెడికల్ షాపులు బంద్‌లో ఉన్నాయి. బెంగళూరులో మాత్రమే 6,500కు పైగా షాపులను మూసివేశారు.

ఇతర ప్రభావిత రాష్ట్రాలు..

ఒడిశా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా సమ్మె ప్రభావం కనిపిస్తోంది.

కొన్ని రాష్ట్రాలు సమ్మెకు దూరం..

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, సిక్కిం వంటి రాష్ట్రాల ఫార్మసీ సంఘాలు సమ్మెలో పాల్గొనలేదు. అయితే కొన్ని వ్యక్తిగత మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేసే అవకాశం ఉంది.

ఈ రోజు మందులు ఎక్కడ దొరుకుతాయి?

మెడికల్ షాపులు మూసివేసినా ప్రజలకు మందులు పూర్తిగా అందుబాటులో లేకపోవడం లేదు. ఆసుపత్రి ఫార్మసీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలోని ఫార్మసీలు సాధారణంగా పనిచేస్తున్నాయి.

జన ఔషధి కేంద్రాలు..

ప్రభుత్వ ఆధ్వర్యంలోని జన ఔషధి కేంద్రాలు తెరిచి ఉన్నాయి. తక్కువ ధరలకు జెనరిక్ మందులు లభిస్తున్నాయి.

ఈ-ఫార్మసీలు..

ఆన్‌లైన్ ఫార్మసీ యాప్‌లు పనిచేస్తున్నాయి. అయితే సరఫరాలో కొంత ఆలస్యం ఉండే అవకాశం ఉందని సమాచారం.

ప్రజలకు సూచనలు..

అత్యవసర మందులు అవసరమైన వారు ముందుగానే సమీప ఆసుపత్రి ఫార్మసీ లేదా జన ఔషధి కేంద్రాలను సంప్రదించడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అవసరమైన మందులను ముందుగానే నిల్వ చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh