ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణంకంటే ముందే భారత ఉప ఖండాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఈ రుతుపవనాలు మే 20వ తేదీకల్లా కేరళలోకి ప్రవేశించ నున్నాయి.
ఆపై నైరుతి రుతుపవనాలు మే ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

నైరుతి రుతుపవనాల ఆగమన చిత్రం (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాదీ 'నైరుతి' ఆగమనం ముందుగానే..సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే 22 నాటికి అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత క్రమంగా అవి ముందుకు కదులుతూ జూన్ ఒకటికల్లా కేరళను తాకుతాయి. అయితే గత ఏడాది నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి తొమ్మిది రోజులు ముందుగా అంటే మే 13న ప్రవేశించాయి. నిర్ణీత తేదీకంటే ఎనిమిది రోజులు ముందుగా మే 24న కేరళను తాకాయి. ఈ సంవత్సరం కూడా ఈ రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ముందుగానే ప్రవేశించనున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనా ప్రకారం ఇవి ఈ వారాంతానికి అంటే 16 నాటికి అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 20 నాటికి కేరళను తాకే ఛాన్స్!ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఈనెల 20 నాటికి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ భావిస్తోంది. అంటే రుతుపవనాలు కేరళను తాకే నిర్ణీత సమయానికి (జూన్ 1కి) 10-12 రోజులు ముందుగానే ప్రవేశిస్తాయన్న మాట! అయితే రుతుపవనాలు ముందుగా కేరళను తాకినంత మాత్రాన వర్షాలు పుష్కలంగా కురుస్తాయని గాని, వర్షాభావ పరిస్థితులేర్పడవని గాని చెప్పలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇలా రుతుపవనాలు ముందుగా కేరళలోకి ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో అవి మందగమనంతో కదిలిన సందర్భాలను వీరు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా ఆ తర్వాత ఏర్పడే వాతావరణ పరిస్థితులు వానలు కురవడానికి లేదా మందగించడానికి దోహదపడతాయని పేర్కొంటున్నారు. 'ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయంకంటే ముందుగా ప్రవేశించినా ఆ తర్వాత అవి నెమ్మదిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది' అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. అల్పపీడనం వల్లే ముందుగా అండమాన్‌లోకి..ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే ఈ ఏడాది అండమాన్ సముద్ర ప్రాంతం, నికోబార్ దీవుల్లోకి ముందుగా నైరుతి రుతుపవనాలు ఆగమనానికి దోహదపడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏపీలోకి రుతుపవనాలు ఎప్పుడొస్తాయి?సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజులకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. ఆపై రాష్ట్రమంతా క్రమంగా విస్తరిస్తాయి. ఈ ఏడాది మే 20 నాటికే రుతుపవనాలు కేరళను తాకనుండడంతో నెలాఖరుకల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు..పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం ప్రాంత కేంద్రం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర కర్నాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. నాలుగు రోజుల అనంతరం పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. అల్పపీడనం తర్వాత మళ్లీ మండుటెండలే..పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరికొద్ది రోజులు అదే ప్రాంతంలో కొనసాగనుంది. అనంతరం అది బలహీన పడ్డాక రాష్ట్రంలో మళ్లీ మండుటెండలు, వడగాడ్పులు విజృంభిస్తాయని మురళీకృష్ణ చెప్పారు. ప్రస్తుతం అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఎండల ఉధృతి కాస్త తగ్గి ప్రజలకు ఒకింత ఉపశమనం కలిగిస్తోంది.

