అమెరికా కలలు కన్న ఆ తల్లిదండ్రులకు మిగిలింది తీరని శోకం. ఉన్నత చదువులు చదివి, గొప్ప ఉద్యోగంలో స్థిరపడతాడనుకున్న కొడుకు విగతజీవిగా తిరిగిరావడంతో ఆ గ్రామం మొత్తం కన్నీరుమున్నీరవుతోంది.
"అమెజాన్ కంపెనీలో ఉద్యోగం వస్తే మురిసిపోయాం.. ఇంట్లో నుంచే పనంటే సంతోషపడ్డాం.. ఎంఎస్ చేస్తానని అమెరికా వెళ్తే, అక్కడ ఉద్యోగం వచ్చి రాజభోగం అనుభవిస్తావనుకున్నాం.. కానీ ఇలా శవమై వస్తావని కలనైనా ఊహించలేదు బిడ్డా!" అంటూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు ఊరంతటినీ కదిల్చివేసింది.
అమెరికా వెళ్లకుండా ఇక్కడున్నా కళ్ల ముందే ఉండేవాడంటూ వారు పడుతున్న ఆవేదన చూసి కంటతడి పెట్టని వారు లేరంటే నమ్మండి.కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లికి చెందిన ఇరగనబోయిన చందు (26) కథ ఇది. 2021లో హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చందు, కొంతకాలం ఇక్కడే ఉద్యోగం చేశాడు. మెరుగైన భవిష్యత్తు కోసం 2022లో అమెరికా వెళ్లి, 2025లో ఎంఎస్ పూర్తి చేశాడు.చదువు పూర్తయ్యాక ఆశించిన స్థాయిలో ఉద్యోగం రాకపోవడంతో చందు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆర్థిక అవసరాల కోసం అక్కడక్కడా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో, అమెరికాలో వచ్చిన కొత్త నిబంధనలు (ట్రంప్ రూల్స్) పిడుగులా మారాయి.
స్టూడెంట్స్ పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి వీలులేకుండా పోవడంతో, అటు అమెరికా వెళ్లడానికి చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక, ఇటు ఇంటి పరిస్థితులు తలచుకుని తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు.చివరికి, గత నెల 28వ తేదీన చికాగోలోని తన అపార్ట్‌మెంట్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్వగ్రామంలో కన్నీటి వీడ్కోలుచందు మృతదేహాన్ని తానా (TANA) టీం స్క్వేర్ ప్రతినిధులు ఢిల్లీకి పంపించగా, అక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో విమానాశ్రయంలో ప్రక్రియ వేగంగా పూర్తయి, మంగళవారం ఉదయం 9 గంటలకు మృతదేహాన్ని వీరారెడ్డిపల్లికి తరలించారు. తమ కొడుకు భౌతికకాయాన్ని చూసి తల్లిదండ్రులు కేశవ, విజయలక్ష్మిలు గుండెలు పగిలేలా విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.అమెరికా వెళ్తే జీవితం మారిపోతుందని వెళ్తున్న ఎంతోమంది యువతకు చందు ఉదంతం ఒక హెచ్చరికలా మారుతోంది. ఆశలు, ఆశయాల వెనుక ఉన్న ఒత్తిడి, అప్పుల భారం ప్రాణాలను తీసే స్థాయికి చేరుతుండటం అత్యంత ఆవేదనాభరితం.

