ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వింత వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి (Trough) ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం అస్థిరంగా మారింది.
దీని వల్ల కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఎండలు మండిపోతుంటే, మరికొన్ని జిల్లాల్లో ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
జిల్లాల వారీగా వర్ష సూచనద్రోణి ప్రభావంతో మంగళవారం (మే 5) ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా. ముఖ్యంగా మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే వీలుంది.భానుడి ప్రతాపం.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలుఒకపక్క వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం నాడు గరిష్ఠంగా కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడిలో 43.9°C, విజయవాడలో 43.1°C, నంద్యాలలో 42.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 74 మండలాల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీల మార్కును దాటడంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలకు..రైతులకు సూచనలుప్రస్తుత విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినన్ని నీళ్లు తాగుతూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

