పశ్చిమ బెంగాల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫల్తా అసెంబ్లీ రీపోలింగ్‌కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అకస్మాత్తుగా ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. జహంగీర్ ఖాన్ పేరు ఇప్పటికే ఎన్నికల సమయంలో తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇప్పుడు ఆయన వైదొలగడం టీఎంసీకి రాజకీయంగా పెద్ద దెబ్బగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
"ఫల్తా శాంతి కోసం తప్పుకుంటున్నా"
మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జహంగీర్ ఖాన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. "నేను ఫల్తా బిడ్డను. ఫల్తా ప్రాంతం శాంతియుతంగా ఉండాలి. అభివృద్ధి చెందాలి. ముఖ్యమంత్రి సువెందు అధికారి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించారు. అందుకే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను" అని ఆయన తెలిపారు.
ఫల్తాలో ఎందుకు రీపోలింగ్?
ఈ ఏడాది ఏప్రిల్ 29న ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికల సమయంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఎన్నికల సంఘం పరిశీలనలో:
ఓటర్లను బెదిరించడం, ప్రతిపక్ష పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, ఈవీఎంలను తారుమారు చేయడం, సీసీటీవీ ఫుటేజ్ అసంపూర్ణంగా ఉండటం, వంటి అంశాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ను రద్దు చేసి, మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
జహంగీర్ ఖాన్ ఎవరు?
జహంగీర్ ఖాన్ ఈ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన నాయకులలో ఒకరిగా నిలిచారు. ఆయన టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఫల్తా నియోజకవర్గం అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది.
"అతను సింగం అయితే.. నేను పుష్ప"
ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ ఫల్తా ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు. ఆయనను చాలామంది "సింగం"గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జహంగీర్ ఖాన్ స్పందిస్తూ: "అతను సింగం అయితే.. నేను పుష్ప. నేను ఎప్పుడూ తలవంచను" అని వ్యాఖ్యానించారు. ఈ డైలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి జహంగీర్‌ను చాలామంది "పుష్ప" అని పిలవడం ప్రారంభించారు.
టీఎంసీ ఆరోపణలు..
జహంగీర్ ఖాన్ వైదొలగడంపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది. మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఫల్తాలో భయపెట్టే వాతావరణం సృష్టించారని ఆ పార్టీ ఆరోపించింది. టీఎంసీ ప్రకారం..''100 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. కొన్ని కార్యాలయాలను బలవంతంగా ఆక్రమించారు'' అని పేర్కొంది.
"మా కార్యకర్తలు ఒత్తిడిని ఎదుర్కొంటూనే నిలబడ్డారు. కానీ కొందరు చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది" అని పార్టీ తెలిపింది.
సొంత పార్టీలో నుంచే ఎద్దేవా..
జహంగీర్ ఖాన్ నిర్ణయం తర్వాత రాజకీయ ప్రత్యర్థులతో పాటు టీఎంసీ నాయకులే ఆయనను ఎగతాళి చేస్తున్నారు. సీనియర్ టీఎంసీ నేత కునాల్ ఘోష్ మాట్లాడుతూ: "జహంగీర్ పుష్ప అయితే.. ఇప్పుడు ఎందుకు తలవంచాడు?" అని ప్రశ్నించారు.
దాడిని మరింత పెంచిన బీజేపీ..
జహంగీర్ ఖాన్ వైదొలగడాన్ని బీజేపీ తమ విజయంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.."ఫల్తా టీఎంసీ కంచుకోట అయితే, అభిషేక్ బెనర్జీ ఎందుకు ప్రచారానికి రావడం లేదు?" అని ప్రశ్నించారు.
"పుష్ప ఎక్కడ?" అంటూ సువెందు సెటైర్లు
ముఖ్యమంత్రి సువెందు అధికారి కూడా తన ప్రచార సభల్లో జహంగీర్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. "పుష్ప ఎక్కడ?" అంటూ సభల్లో ప్రశ్నిస్తూ, ఎన్నికల హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫల్తా రీపోలింగ్ ఎందుకు కీలకం?
ఫల్తా రీపోలింగ్ ఇప్పుడు సాధారణ ఎన్నికగా కాకుండా, బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఒకవైపు బీజేపీ తమ ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని చూస్తుండగా, మరోవైపు టీఎంసీ తన కంచుకోటను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జహంగీర్ ఖాన్ వైదొలగడంతో ఫల్తా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

