పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ..
ఇప్పుడు మరో కీలక పోరాటంపై దృష్టి పెట్టింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి పోలింగ్ జరగనుండటంతో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
ఎన్నికల రోజున జరిగిన హింస, బూత్ క్యాప్చరింగ్, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పోలింగ్ మే 21న జరగనుండగా, ఫలితాలను మే 24న ప్రకటించనున్నారు.
208వ సీటుపై బీజేపీ ఫోకస్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే 207 సీట్లు సాధించిన బీజేపీ, ఇప్పుడు ఫల్తాను 208వ విజయంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఫల్తా నియోజకవర్గం 2011 నుంచి టీఎంసీ ఆధీనంలో ఉంది. 2021 ఎన్నికల్లో కూడా టీఎంసీ ఇక్కడ 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని బీజేపీ చెబుతోంది. ముఖ్యమంత్రి సువెందు అధికారి స్వయంగా ఫల్తాలో ర్యాలీలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్‌పై సువెందు విమర్శలు..
ఫల్తా పోరులో ప్రధాన చర్చగా మారింది టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పేరు. ఎన్నికల సమయంలో జరిగిన ఉద్రిక్తతలు, ఘర్షణలు, బూత్ క్యాప్చరింగ్ ఘటనల వెనుక ఆయన ఉన్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ర్యాలీలో సువెందు అధికారి, జహంగీర్‌ను "పుష్ప" అని వ్యంగ్యంగా సంబోధించారు. "పుష్ప ఎక్కడ?" అంటూ వేదికపైనే ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను జహంగీర్ ఖాన్ పూర్తిగా ఖండించారు. తాను ప్రజల కోసం పని చేశానని, నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు తెలుసని చెప్పారు.
"సింగం - పుష్ప" వ్యాఖ్యలతో వైరల్..
ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ బెంగాల్‌లో పరిశీలకుడిగా పనిచేశారు. ఆయనను చాలామంది "సింగం"తో పోల్చగా, జహంగీర్ ఖాన్ "ఆయన సింగం అయితే నేను పుష్ప" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.
అభిషేక్ బెనర్జీ ప్రభావాన్ని దెబ్బతీయాలన్న బీజేపీ వ్యూహం..
ఫల్తా నియోజకవర్గం డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి బలమైన కోటగా భావిస్తారు. సువెందు అధికారి, అభిషేక్ బెనర్జీ మధ్య రాజకీయ విభేదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అందుకే ఫల్తాలో బీజేపీ విజయం సాధిస్తే అది కేవలం ఒక అసెంబ్లీ సీటు గెలుపు మాత్రమే కాకుండా, అభిషేక్ ప్రభావానికి గట్టి దెబ్బగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఫల్తాకు ప్రత్యేక ప్యాకేజీ హామీ..
ర్యాలీలో సువెందు అధికారి ఫల్తా నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించారు. "ఇక్కడి ప్రజలు చాలా కాలంగా స్వేచ్ఛగా ఓటు వేయలేకపోయారు. ఈసారి భయపడకుండా ఓటు వేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
టీఎంసీ ప్రచారం బలహీనమైందా?
రీపోలింగ్ నేపథ్యంలో టీఎంసీ ప్రచారం పెద్దగా కనిపించడం లేదని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల అనంతర ఉద్రిక్తతల కారణంగా పలువురు టీఎంసీ నాయకులు బయటకు రావడానికే వెనుకంజ వేస్తున్నారని సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు షామిక్ భట్టాచార్జీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, "టీఎంసీకి ఇప్పుడు బూత్ ఏజెంట్లు కూడా దొరకడం లేదు" అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాల ఆరోపణలు..
లెఫ్ట్ పార్టీ అభ్యర్థి శంభు కుర్మి మాట్లాడుతూ, టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ప్రచారం చేసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. కాంగ్రెస్ తరఫున అబ్దుర్ రజాక్ బరిలో ఉన్నారు.
ఫల్తా పోరు ఎందుకు కీలకం?
ఫల్తా రీపోలింగ్ సాధారణ ఎన్నిక కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మూడ్ ఎలా ఉందో చూపించే తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని చూస్తుండగా, మరోవైపు టీఎంసీ తన కంచుకోటను కాపాడుకోవడానికి పోరాడుతోంది. అందుకే ఫల్తా రీపోలింగ్‌పై ఇప్పుడు మొత్తం బెంగాల్ దృష్టి నిలిచింది.

