Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫీడ్ ధరల పెంపు వెనుక దాగిన వ్యవస్థాగత సమస్యలు

ఫీడ్ ధరల పెంపు వెనుక దాగిన వ్యవస్థాగత సమస్యలు

ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల సాగు రైతులపై మరోసారి ఆర్థిక భారం పడుతోంది. ష్రిమ్ప్ ఫీడ్ తయారీ సంస్థలు ధరలను ఒక్కసారిగా పెంచడంతో వేలాది ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఫీడ్ కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో చర్చించి, "రైతుల అభిప్రాయాలు కాకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదు" అని తీవ్రంగా స్పందించారు. దీంతో ష్రిమ్ప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తక్షణం ధరల పెంపు అమలును నిలిపివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఈ నెల 15న ఉమ్మడి సమావేశం నిర్వహించి స్థిరమైన మార్గం చూడాలని మంత్రి ప్రకటించారు.

ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఇది ఒక 'తంతు'. ప్రతి సీజన్‌లో ఫీడ్ కంపెనీలు ముడి పదార్థాల ధరలు పెరిగాయని చెప్పి ధరలను పెంచేస్తాయి. రైతులు ఆందోళన చేస్తే, ప్రభుత్వం ఒత్తిడి తెస్తే కొంత తగ్గించి 'సమస్య పరిష్కరించామని' ప్రకటిస్తాయి. ఈసారి కూడా అదే జరిగింది. రైతులు సాగు విరామం (సాగు విరమణ) ప్రకటించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకోవడంతోనే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి, ఒక కంపెనీతో ధరలు తగ్గించే ప్రకటన ఇప్పించారు. కానీ రైతులు ఇది శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు.

రైతుకు ధర నిర్ణయించే హక్కు ఎందుకు లేదు?

ఆక్వా రంగంలో ఫీడ్ ఖర్చు మొత్తం ఖర్చులో 60-70 శాతం వరకు ఉంటుంది. రైతు ఫీడ్ కొనేటప్పుడు కంపెనీ నిర్ణయించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. పంట అమ్మేటప్పుడు ఎగుమతి మార్కెట్, డిమాండ్, బయోసెక్యూరిటీ సమస్యల వల్ల ధరలు తగ్గితే నష్టపోతాడు. సాధారణ పంటల్లో కూడా రైతు కొంత సరుకు దాచుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోగలడు. కానీ రొయ్యలు అలా కాదు, త్వరగా చెడిపోతాయి. కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు, సరైన మార్కెటింగ్ మెకానిజం లేకపోవడం వల్ల రైతు పూర్తిగా వ్యాపారులు, ఎగుమతిదారుల చేతుల్లో చిక్కుకుపోతాడు. ప్రభుత్వం ఈ సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. ఇప్పటికే చాలా మంది రైతులు ధర్నాలు చేశారు, ఇంకా చేయాలని సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత వహిస్తుంది?

కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుతామని ప్రకటించింది. మంత్రి అచ్చెన్నాయుడు "ఆక్వా రంగాన్ని కాపాడేందుకు పూర్తిస్థాయిలో అండగా ఉంటాం" అని హామీ ఇచ్చారు. కానీ ఇలాంటి తాత్కాలిక ఉపాధులు, వీడియో కాన్ఫరెన్సులు, ఉమ్మడి సమావేశాలు ఎన్ని జరిగినా సమస్య మూలాలను తాకడం లేదు. ముడి పదార్థాల ధరలు పెరుగుతున్నాయని కంపెనీలు చెబుతున్నా, ఆ ధరలను నియంత్రించడానికి లేదా రైతులకు సబ్సిడీ ఫీడ్ అందించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీడ్ ధరలను రెగ్యులేట్ చేసే నియంత్రణ వ్యవస్థ లేదు. రైతు సహకార సంఘాల ద్వారా స్వయం సహాయక ఫీడ్ యూనిట్లు ఏర్పాటు చేయడం, ఎగుమతి ధరలకు కనీస మద్దతు ధర (MSP) లాంటి వ్యవస్థ, కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రైతు ఎప్పటికీ లాబాలు సాధించ లేడు.

నష్టాల నుంచి బయట పడేందుకు ప్రతి ఏడాదీ సాగు

ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. కానీ రైతులు మాత్రం ప్రతి సీజన్‌లో లాభం కోసం కాకుండా నష్టాలను తట్టుకోవడం కోసం సాగు చేస్తున్నారు. ఈసారి సాగు విరామం, ఆందోళనలు ప్రకటించడం రైతుల నిస్పృహను చాటుతోంది. ప్రభుత్వం ఈరోజు జరిగే సమావేశంలో కేవలం ధరలను కొంత తగ్గించడంతో సరిపెట్టకుండా, దీర్ఘకాలిక వ్యూహాలను, ఫీడ్ ధర నియంత్రణ, స్టోరేజ్ సౌకర్యాలు, రైతు సహకారాలు అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అన్ని రంగాల్లోనూ రైతు ఆత్మగౌరవం కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ఆక్వాలో కూడా అది నిజమవ్వాలంటే తాత్కాలిక 'తంతు'లు కాకుండా నిర్మాణాత్మక చర్యలు అవసరం. లేకపోతే రైతుల ఆందోళనలు మరింత తీవ్రమవుతాయి. అది ఎవరికీ మంచిది కాదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh