జాతీయ రహదారిపై మళ్లీ రక్తసిక్తమైంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మరణించారు. మొత్తం 30 మంది ప్రయాణికుల్లో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సోమవారం వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో కడప జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా) పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లెకు సమీపంలో ఈ ఘోరప్రమాదం జరిగింది.

ఈ సంఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాదరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తిరుపతి నుంచి కడపకు..

కడప డిపో సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఆదివారం అర్ధరాత్రి తిరుపతి నుంచి బయలుదేరింది. రాత్రి కావడంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ బస్సు పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లె సమీపంలో సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆ శబ్దానికి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అప్పటికే బస్సులు ఆర్తనాలు మిన్నంటాయి.
ఈ సంఘటనలో కడప జిల్లా రాజంపేటకు చెందిన తొమ్మిది నెలల పసిబడ్డి పునీత్ సాయికి తలకు గాయం కావడంతో బస్సులోనే మరణించారు. ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా గాయపడ్డారని సమాచారం. ఇదే బస్సులో ప్రయానిస్తున్న శ్రీకాళహస్తికి చెందిన యశ్విత (16 కూడా గాయపడింది. అత్యవసర చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మర్గమధ్యలో మరణించినిట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 16 మందికి కాళ్లు, చేతులు విరగడం, తీవ్ర గాయాలతో రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే వాహనదారులు క్షతగాత్రులను రక్షించడానికి ముందుకు వచ్చారు. పుల్లంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

