Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నడ నటుడు దర్శన్ కేసుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

కన్నడ నటుడు దర్శన్ కేసుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

న్నడ నటుడు దర్శన్ తూగదీప (Darshan Thoogudeepa) ప్రమేయం ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ చాలా నెమ్మదిగా సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం..

ఏడాదిలోగా కనీసం 60 మంది కీలక సాక్షులను విచారించేలా చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణలో పురోగతి కనిపించకపోతే దర్శన్ మళ్లీ బెయిల్ కోసం కొత్త పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో విచారణ..

జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. జైల్లో తనకు కల్పిస్తున్న సౌకర్యాలు, నిర్బంధ పరిస్థితులపై దర్శన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తున్న సమయంలోనే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే దర్శన్‌కు గతంలో మంజూరైన బెయిల్ రద్దయ్యింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం, ట్రయల్ కోర్టు నుంచి నివేదికలను సుప్రీంకోర్టు కోరింది.

"విచారణ చాలా నెమ్మదిగా సాగుతోంది"

ట్రయల్ కోర్టు నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు, విచారణ పురోగతి సంతృప్తికరంగా లేదని పేర్కొంది. "ప్రస్తుతం విచారణ సాగుతున్న తీరు చూస్తే, 60 మంది సాక్షులను విచారించడానికే చాలా సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే అవసరం లేకుండా సాక్షుల సంఖ్య పెంచకూడదని కూడా సూచించింది.

దర్శన్ తరపు వాదనలు..

దర్శన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి (Mukul Rohatgi) వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ మొత్తం 272 మంది సాక్షులను జాబితాలో చేర్చిందని, కానీ అభియోగాలు నమోదు అయిన తర్వాత ఏడు నెలల్లో కేవలం 10 మంది సాక్షులను మాత్రమే విచారించారని ఆయన కోర్టుకు తెలిపారు. ఇంత నెమ్మదిగా విచారణ సాగడం నిందితుడి హక్కులను ప్రభావితం చేస్తోందని వాదించారు.

జైలు పరిస్థితులపై ఆందోళన..

దర్శన్‌ను ప్రస్తుతం "క్వారంటైన్ సెల్"గా పిలిచే ప్రత్యేక గదిలో ఉంచారు. ఇతర ఖైదీలతో కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. "మరిన్ని మూడు లేదా నాలుగు నెలల్లో కూడా విచారణలో పురోగతి లేకపోతే, అప్పుడు బెయిల్ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి" అని ఆయన అభ్యర్థించారు.

"ఇప్పుడే బెయిల్‌పై నిర్ణయం తొందరపాటు"

అయితే వెంటనే బెయిల్ అంశంపై నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని జస్టిస్ పర్దివాలా వ్యాఖ్యానించారు. "మేము ఇంకా కొంతకాలం పరిస్థితిని గమనిస్తాం. విచారణ వేగంగా జరిగేలా చూస్తాం" అని ధర్మాసనం తెలిపింది.

రేణుకాస్వామి హత్య కేసు..

ఈ కేసు కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించింది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు రావడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దర్శన్‌తో పాటు పలువురు సహ నిందితులు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో కేసు విచారణ మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh