భారతదేశం తత్వశాస్త్రం, సమాజశాస్త్రం చెప్పినప్పుడు, చదివినపుడు మన మనసులో గుర్తుకు వచ్చేవారు ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్.
అంబేద్కర్, గురు గోవింద్ సింగ్, ఛత్రపతి శివాజీ వంటి మహానుభావులు. వారు కేవలం రాజకీయ నాయకులే కాదు- సమాజాన్ని, సంస్కృతిని, ఆధ్యాత్మికతను మార్చిన తత్వవేత్తలు, సంఘ సంస్కర్తలు, మేధావులు.

ఇప్పుడు ఆ వరసలో నరేంద్ర మోదీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది గుజరాత్ బరోడాలోని మహారాజా సయాజీరావ్ విశ్వవిద్యాలయం (MSU).
జూన్ నుంచి మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరంలో బీఏ సోషియాలజీ నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు నాలుగో ఏడాదిలో పది పేపర్లు కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభ, దేశీయ నాలెడ్జ్ సిస్టమ్, హిందూ రిలీజియస్ స్టడీస్, జాతీయవాదం వంటి అంశాలు ప్రధాన స్థానం పొందనున్నాయి.
రెండేళ్ల ఎంఏ సోషియాలజీ కోర్సులో కూడా ఈ అంశాలు చేర్చారు. ముఖ్యంగా 'సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం' అనే కోర్సులో మోదీ తత్వాన్ని విద్యార్థులకు బోధించనున్నారు. సోషియాలజీ విభాగం సారథి డాక్టర్ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, "మీకు నచ్చినా నచ్చకపోయినా, ప్రధాని మోదీ రాజకీయ చతురత, నాయకత్వ లక్షణాలను మ్యాక్స్ వెబర్, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి మహానాయకులతో పోల్చి వివరిస్తాం" అని స్పష్టం చేశారు.
కోర్సులో ఇలా ఉంటాయి కొన్ని ముఖ్య అంశాలు..
డిజిటల్ జాతీయవాదం, పౌరసత్వం, వారసత్వం
నోట్ల రద్దు, UPI, ఫాస్టాగ్, జల్ శక్తి మిషన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు
కోట్లాది మంది ప్రజలు పొందిన లాభాలు, పథకాలకు వచ్చిన అమిత ఆదరణ
ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయి కార్యకలాపాలు, సమాజంపై వాటి ప్రభావం
ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాజా సయాజీరావ్ గైక్వాడ్-3 వంటి సంఘ సంస్కర్తల జీవితాలు
డాక్టర్ వీరేంద్రసింగ్ (నీతి ఆయోగ్‌లో ప్రజా ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారు) మాట్లాడుతూ, ఎంఏ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సర్వే ఫలితాల ఆధారంగానే ఈ కొత్త పాఠ్యాంశాలు రూపొందించారని తెలిపారు.
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కొందరు దీనిని దేశీయ జ్ఞాన వ్యవస్థను బలోపేతం చేసే చర్యగా చూస్తుంటే, మరికొందరు దీనిని ఒక వ్యక్తి కల్ట్‌ను విద్యావ్యవస్థలోకి తీసుకురావడంగా విమర్శిస్తున్నారు.
ఏమైనా, భారతీయ సమాజశాస్త్ర విభాగాల్లో ఇకపై మోదీ తత్వం కూడా ఒక అధ్యాయంగా చదువుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం రాజకీయం కాదు - సమకాలీన భారతదేశ సామాజిక మార్పులను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త కోణం అని విశ్వవిద్యాలయం చెబుతోంది.
చరిత్ర ఎప్పుడూ గత మహామహులతో ఆగిపోదు. కొత్త కాలం కొత్త వ్యక్తులను, కొత్త ఆలోచనలను కూడా తన జాబితాలో చేర్చుకుంటుంది.

