కర్ణాటక ప్రభుత్వం ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మేకెదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలో కేంద్ర జల సంఘానికి సమర్పిస్తామని ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తెలిపారు.
మేకెదాటు ప్రాజెక్టును అడ్డుకునే హక్కు తమిళనాడుకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నీట మునిగే అటవీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా అటవీకరణ కోసం భూములను గుర్తిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల సంఘం అనుమతి వచ్చాకే భూమిపూజ చేస్తామని వెల్లడించారు.
కావేరీ నదిపై కనకపుర సమీపంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా బెంగళూరుకు తాగునీరు అందించడానికేనని కర్ణాటక చెబుతోంది. తమిళనాడుకు కేటాయించిన 177 టీఎంసీల వాటాను తగ్గించబోమని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టుకు తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అన్బుమణి రామదాసు డీపీఆర్‌ను ఆమోదించవద్దని కేంద్రాన్ని కోరుతున్నారు. తమిళనాడు అనుమతి లేకుండా 2018లో ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కూడా ఆయన కోరుతున్నారు.

