ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
కేవలం పరిపాలన, అభివృద్ధి ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, దేశభక్తి - ఆర్థిక పొదుపు మేళవింపుగా సాగిన ఈ భేటీలో మునుపెన్నడూ లేని విధంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ నా దేశం - నా బాధ్యత అనే నినాదాన్ని ఏపీ ప్రభుత్వం తన భుజానికెత్తుకుంది.
కాన్వాయ్ దాటి ఆలోచిద్దాం.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంకేవలం కాన్వాయ్‌లు తగ్గిస్తే సరిపోదని, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించే ప్రతి మార్గాన్ని అన్వేషించాలని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీలైనంత వరకు సచివాలయానికి సైకిళ్లపై రావాలని లేదా సాధారణ ప్రజలలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని సూచించారు. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని, పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే, ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా మంత్రుల విదేశీ పర్యటనలను తాత్కాలికంగా రద్దు చేసి, అత్యధిక సమావేశాలను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు.ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆఫీసుల్లో ఏసీల నియంత్రణప్రభుత్వ శాఖల్లో అనవసర ఖర్చులను తగ్గించేందుకు సీఎం కఠిన నిబంధనలు విధించారు. ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అంశంపై సమగ్ర అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 24 నుండి 26 డిగ్రీల మధ్యనే నడపాలని, తద్వారా విద్యుత్ ఆదా చేయాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని సీఎం ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు.పవన్ కల్యాణ్ సూచన.. ప్రజలకు అవగాహన తర్వాతే అమలుపొదుపు చర్యల అమలుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచన చేశారు. ఒకేసారి కఠిన నిర్ణయాలు ప్రకటిస్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని, కాబట్టి ముందుగా వారికి అవగాహన కల్పించి దశలవారీగా అమలు చేద్దామని పవన్ కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ, రెండు రోజుల పాటు ప్రజలకు ఈ పొదుపు చర్యల ఆవశ్యకతను వివరించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించాలని తీర్మానించారు.రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులుపొదుపుతో పాటు అభివృద్ధిలోనూ కేబినెట్ వేగం పెంచింది. సుమారు రూ. 2,01,023 కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ యూనిట్లకు అనుమతి ఇచ్చారు. సూర్యఘర్, పీఎం కుసుం వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యుత్ సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని నిర్ణయించారు.నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహంఇదే సమావేశంలో పాలనాపరమైన క్రమశిక్షణపై సీఎం గట్టి సంకేతాలు పంపారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కార్యదర్శులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఉందని ముందే తెలిసినా సీరియస్‌నెస్ లేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తూ, సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

