రెండేళ్లపాటు వెంటే ఉండి, ప్రాణంగా చూసుకోవాల్సిన వ్యక్తే అనుమానంతో కాలయముడిగా మారిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో వెలుగుచూసింది. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం..
గుడ్లూరు మండలం పెదలాటరపికి చెందిన పొట్లూరి అంకయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్, కనిగిరికి చెందిన రాపూరి పేరయ్య అలియాస్ ప్రియ (26) అనే హిజ్రాతో గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, ఇటీవల ప్రియ మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందని అంకయ్య అనుమానం పెంచుకోవడమే ఈ దారుణానికి దారితీసింది.
పథకం ప్రకారమే పిలిపించి..ప్రియను ఎలాగైనా వదిలించుకోవాలని లేదా లొంగదీసుకోవాలని భావించిన అంకయ్య, గత నెల 27న ఆమెను మాట్లాడాలని నమ్మించి కందుకూరుకు రప్పించాడు. పట్టణంలోని పోతురాజుమిట్ట వద్ద ఉన్న తన పిన్ని ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ప్రియపై పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. అయితే దీనికి ఆమె నిరాకరించడంతో ఆవేశానికి లోనైన అంకయ్య, ప్రియ గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు.డ్రామా ఆడి దొరికిపోయాడుప్రియ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, ఏమీ తెలియనట్లు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు ఆమె అప్పటికే మరణించిందని చెప్పడంతో, గుట్టుచప్పుడు కాకుండా మరో అంబులెన్స్‌లో మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి అప్పగించి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ప్రియ మెడపై ఉన్న గాయాలను గమనించిన ఆమె తండ్రి అంజయ్యకు అనుమానం వచ్చి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోస్టుమార్టంలో బయటపడ్డ నిజంపోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపగా, ఆమెది సహజ మరణం కాదని, గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు నిందితుడు అంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా, తనే ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనుమానం, పెళ్లికి నిరాకరించడం వంటి కారణాల వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

