Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
''పీఎం శ్రీ'' పై స్పష్టత.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారంటే..

''పీఎం శ్రీ'' పై స్పష్టత.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారంటే..

మిళనాడులో ''పీఎం శ్రీ'' పథకాన్ని అమలు చేసే అవకాశంపై వచ్చిన ఊహాగానాలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ స్పష్టత ఇచ్చారు.

ఆ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేయదని చెప్పారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ఈ పథకాన్ని అంగీకరించవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే మంగళవారం ఆయన ఆ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు.

వివాదానికి కారణమైన వ్యాఖ్యలు..

సోమవారం మీడియాతో మాట్లాడిన రాజ్‌మోహన్.. "పీఎం శ్రీ విధానాలు తమిళనాడు లక్ష్యాలకు సరిపోతాయా? లేదా? అన్నది ప్రభుత్వం పరిశీలించాలి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను చాలామంది వేరేలా అర్థం చేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం రహస్యంగా పీఎం శ్రీ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందా? అన్న చర్చ మొదలైంది. దీనిపై మంగళవారం మంత్రి మరోసారి స్పందిస్తూ, "అలాంటి ఆలోచనే లేదు. తమిళనాడు తన విద్యా విధానంలో ఎలాంటి రాజీ పడదు" అని స్పష్టం చేశారు.

"రెండు భాషల విధానమే కొనసాగుతుంది"

తమిళనాడులో తమిళం, ఇంగ్లీష్ ఆధారిత ద్విభాషా విధానం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆ విధానాన్ని మార్చబోమన్నారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూను ఉదాహరణగా ప్రస్తావించారు.

"సింగపూర్ ప్రపంచ స్థాయి దేశంగా ఎదగడంలో ఆంగ్ల భాష కీలక పాత్ర పోషించింది. తమిళనాడు కూడా మాతృభాషతో పాటు ఇంగ్లీష్‌కి ప్రాధాన్యం ఇస్తుంది," అని రాజ్‌మోహన్ చెప్పారు.

"కేంద్రం నిధులను ఆపింది"

పీఎం శ్రీ పథకాన్ని తమిళనాడు అంగీకరించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం విద్యా నిధులను నిలిపివేసిందని మంత్రి ఆరోపించారు. "ఇవి ప్రభుత్వ అధికారుల కోసం కాదు.. విద్యార్థుల కోసం ఇచ్చే నిధులు. వాటిని ఆపడం సరైంది కాదు," అని ఆయన అన్నారు. కేంద్రం ఒత్తిడి తెచ్చినా తమిళనాడు తలొగ్గదని స్పష్టం చేశారు.

పీఎం శ్రీ పథకం అంటే ఏమిటి?

పీఎం శ్రీ అంటే "ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా".దేశవ్యాప్తంగా కొన్ని పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పథకం ద్వారా కేంద్రం కొత్త విద్యా విధానాన్ని, ముఖ్యంగా మూడు భాషల విధానాన్ని పరోక్షంగా అమలు చేయాలని చూస్తోందని తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది.

కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. 1 నుంచి 3వ తరగతి విద్యార్థులకు జూన్ 4 నుంచి తరగతులు మొదలవుతాయని చెప్పారు. కొత్త పాఠ్యపుస్తకాల అమలుకు ఉపాధ్యాయులను సిద్ధం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది ప్రత్యేక శిక్షకులను పంపుతున్నట్లు వెల్లడించారు.

పాఠశాల మౌలిక వసతులపై దృష్టి..

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదుల సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు నమోదు తగ్గుతోందో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పాఠశాల బస్సులపై హెచ్చరిక ..

పాఠశాలలు ప్రారంభానికి ముందు భద్రతా నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్‌మోహన్ హెచ్చరించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు.

పదో తరగతి ఫలితాలపై శుభాకాంక్షలు..

బుధవారం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాల సందర్భంగా విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh