పోలవరం (Polavaram) ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మణిహారం అనే ఇమేజ్ కు ఆర్ అండ్ ఆర్ (Rehabilitation and Resettlement: R&R) మధ్యవర్తులు అవినీతి మరకలు అంటిస్తున్నారా?
అవును ఎవరేమనుకున్నా, పోలవరం ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణ లో అవినీతి కి చెక్ పడటం లేదు. రెండవ దశలో ఏలూరు జిల్లా,జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల భూమిని, వరా రామచంద్ర పురం మండలం లోని గిరిజన నిర్వాసితుల కోసం భూములు సేకరిస్తున్నారు. ఈ భూములు గిరిజనేతర రైతుల నుండి తీసుకుంటున్నారు. ఈ భూముల్లో కొన్ని గిరిజనుల సాగు లో ఉన్నా వివాదాల భూములు అని అంటున్నారు. మధ్యవర్తులు ఒక మాఫియా స్థాయిలో ఈ ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీలను ప్రభావితం చేస్తున్నారు. దీనితో ప్రాజక్టు బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు.
దీనిని ఆసరా చేసుకునే వివిధ కారణాలు చెప్పి, రైతుల నుండి ఒక్కో ఎకరాకు 15 శాతం కమీషన్ ఇచ్చే విధంగా ఆర్ అండ్ ఆర్ మాఫియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీలుగుమిల్లి మండల కేంద్రం లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ మాఫియా సభ్యులు రైతుల నుండి ఖాళీ చెక్కులు, ప్రామిసరి నోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగస్వాములుగా ,జీలుగుమిల్లి, రౌతుగూడెం,కామయ్యపాలెం, తాటి రాముడు గూడెం, గ్రామాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది.
గతం లో కూడా అంటే,2015 సంవత్సరం లో ఇలాగే జరిగింది. చాలా మంది, అవినీతి అధికారులు ఈ మాఫియా తో చేతులు కలిపి లంచాలు తీసుకొని అనేక రకాల మోసాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు అప్పట్లో జీలుగుమిల్లి మండల తహసీల్దార్ గా పనిచేసిన సి. హెచ్. విద్యాపతి ఎనిమిది సంవత్సరాల సర్వీసు రివర్షన్ అయ్యి సస్పెండ్ అయ్యాడు. కొవ్వూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) ఆఫీసు లో లంచం పేరుతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేయగా అప్పటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్డి . పుష్ప మణి సస్పెండ్ అయ్యారు. ఆ కేసు ఇప్పటికీ రాజమండ్రి ఏసీబీ కోర్టు లో పెండింగ్ లోనే ఉంది. కోట రామచంద్రా పురం ఐ.టి.డి.ఏ కేంద్రం గా జరిగిన భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ల్లో భారీ అవినీతి జరిగిందని మొత్తం కార్యాలయాన్నే ఏలూరు కు మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి ప్రాజెక్టు అధికారి పి. వి.సూర్యనారాయణ పై అనేక అవినీతి ఆరోపణ లు వచ్చాయి. వేరే కేసు లో జైలు పాలయ్యాడు.
అంతే కాదు, పోలవరం ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణ లో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై విచారణ జరపాలని కోరుతూ, ప్రజా వ్యాజ్యం గౌరవ ఏపీ హై కోర్టులో దాఖలైంది. డబ్ల్యూ. పి. నెంబర్:47/2018. ఇది కూడా ప్రస్తుతం పెండింగ్ లోనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయినా, ఈ ఆర్ అండ్ ఆర్ మాఫియా కు ఏ భయమూ లేదు. ఇవన్నీ తెలిసి కూడా, భూసేకరణ అధికారులు వారితో చెట్టా పట్టా లేసుకుని తిరుగుతున్నారు. వారితో కలిసి మందు తాగడం, భోజనాలు చేయడం, ఆఫీసు లో స్వేచ్ఛ గా కూర్చోవడం చేస్తున్నారు. రికార్డులు పరిశీలించడం, ఇంకా అనేకం. వారి అనుమతి లేకుండా, సామాన్య రైతుల కు భూమి రికార్డులు ఆన్లైన్ కావడం లేదు. దీనంతటికి కారణం వారికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటమే!
అసలు ఈ మాఫియా ను వెనుక నుంచి నడిపిస్తున్న అసలు సూత్రధారి ఎవరు? దీనికి సమాధానం చాలా సింపుల్! ప్రజాప్రతినిధులే. ఎవరైనా రైతు తమ చెక్కులు ప్రామిసరి నోట్లు ఈ మాఫియా సభ్యులకు ఇవ్వక పోతే, వారికి ఏ విధమైన భూమి రికార్డులు ఇవ్వ వద్దని రెవెన్యూ అధికారులకు సదరు ప్రజా ప్రతినిధలు హుకుం జారీ చేసినట్లు రెవెన్యూ అధికారులు వాపోతున్నారు.
ఇదేమిటి? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, ఇసుక, మట్టి, డ్రగ్ మాఫియా లే ఉన్నాయికదా! మధ్యలో ఈ ఆర్ అండ్ ఆర్ మాఫియా ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? ఆ వివరాలు కావాలంటే మీరు ఒకసారి పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేసిన మొత్తం భూసేకరణ లోకి వెళ్లాల్సిందే. ఈ ఆర్ అండ్ ఆర్ మాఫియా చాపకింద నీరులా 2005 సంవత్సరంలో ప్రారంభం అయింది.అయితే అప్పట్లో నష్ట పరిహారం డబ్బులు తక్కువ కాబట్టి అంతగా లేదు. ఎప్పుడైతే,2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం డబ్బులు పెరిగిందో అప్పటి నుంచి ఈ మాఫియా సభ్యులు రెచ్చిపోయారు. ఈ రకమైన దోపిడీ 2015 నుండి బాగా విస్తరించింది. దానికి పోలవరం నియోజక వర్గం ప్రధాన అడ్డాగా మారింది.
ఆర్ అండ్ ఆర్ మాఫియా నెట్ వర్క్ ఎలా పనిచేస్తుంది?
ముందుగా ఈ మాఫియా సభ్యులు ఒక సిండికేట్ గా ఏర్పడి కొంత డబ్బు పోగు చేస్తారు. తర్వాత ఏ ఏ గ్రామాల్లో అధికారులు,భూములు సేకరిస్తారో ముందుగా తెలుసు కుంటారు. ఆ అధికారులు ఎవరు? వారి బలహీనత లు ఏమిటి? మొత్తం డేటా సంపాదిస్తారు. ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి.
మొదటి పద్ధతి
అవి గిరిజన గ్రామాలు అయితే ఆయా గ్రామాల్లో కీ పర్సన్ ను పట్టుకుని అతనికి అవసరానికి డబ్బులు ఇస్తూ, సరదాలు తీరుుస్తారు. అలా నెమ్మదిగా మంచిగా దగ్గరవుతారు. నెమ్మదిగా అక్కడ కొంత మంది వీరి మాట వినేలా తయారు చేస్తారు. వారి ద్వారా అవసరం ఉన్న వారికి నష్ట పరిహారం డబ్బులు వచ్చాక ఇద్దురు అని చెప్పి ఒక లక్ష రూపాయల కు రెండు లక్షలు చెల్లించాలని చెప్పి ఇచ్చి ఖాళీ చెక్కులు, ప్రామిసరి నోట్లు తీసుకుంటారు. అవసరమైన పీసా గ్రామ సభ తీర్మానం పొందుతారు.
రెండవ పద్ధతి
గిరిజన నిర్వాసితులకు భూమి కి భూమి ఇవ్వాలి కాబట్టి, ఆ భూములను ఇచ్చే విధంగా గిరిజనేతర రైతులను ఒప్పించి వారి నుండి భూమి రికార్డులు తీసుకొని ప్రపోజల్స్ సిద్ధం చేస్తారు. పోలవరం నియోజకవర్గంలో ఎక్కువగా 1/70 పేరుతో చాలా కాలంగా భూ వివాదాలు జరుగుతున్నాయి. కాబట్టి, ఇప్పుడు భూసేకరణ లో భూములు ఇచ్చేస్తే మీకు డబ్బులు అన్నా వస్తాయని, అన్నీ మేము చూకుంటాము, అధికారులు మాకు బాగా తెలుసు, వారికి కూడా ఇవ్వాలి.మీకు డబ్బులు వచ్చాకే మాకు ఇవ్వండి అని కన్విన్స్ చేసి, దానికి పర్సంటేజ్ ఫిక్స్ చేసి వారి వద్ద కూడా ఖాళీ చెక్కులు ప్రామిసరి నోట్లు తీసుకుంటారు. ఇట్లా రెండు వైపులా తీసుకుంటారు.
పర్సంటేజ్ ఎంత?
భూముల ను బట్టి పర్సంటేజ్ ఫిక్స్ చేస్తారు? గిరిజనేతరుల భూముల ను 1/70 ఉల్లంఘన పేరుతో గిరిజనులు సాగు చేస్తూ ఉంటే ఆ భూముల కు 50 శాతం కమీషన్ ఇవ్వాలి.
2. కొన్ని సందర్భాలలో గిరిజనేతరులే సాగులో ఉంటారు, కానీ, ఎల్ టి ఆర్ క్లియరెన్స్, ఆన్లైన్ లో పేర్లు ఉండవు. ఇటువంటి వాటికి, 20 నుండి 30 శాతం ఉంటుంది. ఈ క్రమంలో ఆర్ అండ్ ఆర్ మాఫియా సభ్యుల కు తెలియకుండా, ఎవరైనా ఆఫీసు వద్ద కు వస్తే ఏ పని చేయవద్దని, ముందుగానే అధికారులకు చెప్పి పెడతారు.
ఈ విధంగా, గ్రామ రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ (ఎల్ టి ఆర్ క్లియరెన్స్ కోసం), భూసేకరణ సర్వే సిబ్బంది, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) వ్యవస్థలలో వీరికి బాగా అండదండలు దొరుకుతున్నాయి. ఈ విషయాన్ని చాలా మంది జిల్లా కలెక్టర్ల దృష్టి కి బాధితులు తీసుకు వెళ్ళారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ గారు దీన్ని సీరియస్ గా తీసుకొని ఇలాంటి వ్యక్తులు పై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా నమోదు చేశారు.
అయినా సరే, మరలా ఇప్పుడు అదే మాఫియా సభ్యులు విజృంభిస్తున్నారు. రైతు గత్యంతరం లేక ఇక్కడ ఉన్న గిరిజన చట్టాల కు భయ పడి తమ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నారు. దాని ద్వారా వచ్చే డబ్బులు తో వేరే చోట భూములు కొనుగోలు చేయలేరు. అసలే తక్కువ ధర కేవలం ఎకరా ధర 15 లక్షల రూపాయలు. అందులో ఒక లక్షా యాభై వేలు కమీషన్ పోతే, రైతు కు మిగిలేది కేవలం 13 లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే. రైతు దీనస్థితి ఎలా ఉందంటే,
భయ పడి ఉంచుకోలేరు! అలాగని, తక్కువ ధరకు అమ్ముకోలేరు!! ఈ ప్రాంతం లో ఉన్నవారు ఎక్కువ మంది చిన్న సన్న కారు రైతులు. అటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భవిష్యత్తు లో పోలవరం ప్రాజెక్టు ప్రధాన మైన పర్యాటక ప్రాంతం గా చేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
ఈ ప్రాజక్టు రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కాబోతుంది. కాబట్టి,రాజకీయ పార్టీ నేతలు, ఓట్లప్పుడు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం కాదు. ప్రతీ ఒక్కరూ ఏ దళారీ లేకుండా/ఎవరికీ ఏ విధమైన కమీషన్ ఇవ్వకుండా తమ భూములను స్వేచ్ఛ గా ప్రభుత్వానికి ఇచ్చుకునే విధంగా వారి కోసం నిలబడాలి.
అలా అవినీతి రహిత సమాజం కోసం,భూసేకరణ కోసం అధికార పార్టీ నేతలు నిరంతరం అధికార యంత్రాంగం తో కలిసి పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఈ రకమైన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి. అప్పుడే ప్రజల కు నాయకుల పై నమ్మకం కలుగుతుంది.
-జువ్వాల బాబ్జి,అడ్వకేట్, జంగారెడ్డి గూడెం, ఆంధ్ర ప్రదేశ్

