జార్ఖండ్ లో గత నెల రోజుల నుంచి జరుగుతున్న విద్యార్థుల ఉద్యమం ఆదివారం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని, పాత పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
తమ డిమాండ్లపై జేఎంఎం-కాంగ్రెస్ కూటమి "నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైందని" ఆరోపిస్తూ, నిరసనకారులు రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 17) నాడు మరో విడత చర్చల కోసం నిరసనకారులను ఆహ్వానించింది. దీనితో విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాగడాల ప్రదర్శన..
'జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్' నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసన ఆదివారం నాటికి 23వ రోజుకు చేరుకోగా, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.తమ నిరసన స్థలమైన జైపాల్ సింగ్ మొండా స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకూ కాగాడాలు ప్రదర్శించి, అక్కడ రాహుల్ గాంధీ, సీఎం సోరెన్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఈ దిష్టిబొమ్మల దహనం జార్ఖండ్ లోని వివిధ జిల్లాలకు సైతం పాకింది. అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు.తమ డిమాండ్లపై అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమి "చర్యలు తీసుకోవడంలో విఫలమవడం" పట్ల విద్యార్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఉద్యోగార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిరసనలే కనిపించాయి.
తాజా చర్చలకు ఆహ్వానం
ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, జార్ఖండ్ ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తాజా చర్చల కోసం నిరసన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధులను ఆహ్వానించింది. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరసనకారులు, సబ్-డివిజనల్ ఆఫీసర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (శాంతిభద్రతలు) మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.విద్యార్థులను వారి న్యాయ సలహాదారుతో పాటు చర్చల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినట్లు ఒక అధికారి తెలిపారు. 'జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్' స్టేట్ గెస్ట్ హౌస్‌లో చర్చల కోసం ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించింది.కానీ తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొంది. "మేము ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నాము కాబట్టి, కచ్చితంగా చర్చలకు వెళ్తాము. నియామక పరీక్షలలోని అవకతవకలపై సీబీఐ విచారణ, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షలను రద్దు చేయడం అనే మా రెండు డిమాండ్ల విషయంలో మేము దృఢంగా ఉన్నాము" అని దాని నాయకుడు రవీంద్ర పాశ్వాన్ విలేకరులతో అన్నారు.చర్చల కోసం వెళ్లే ప్రతినిధి బృందంలో ఉండే విద్యార్థుల సంఖ్యను సోమవారం ప్రకటిస్తామని ఆయన అన్నారు. ప్రతిపాదిత ఈ సమావేశం, ప్రభుత్వం, ఆందోళన చేస్తున్న విద్యార్థుల మధ్య జరగనున్న ఏడవ విడత చర్చలు. ఆగస్టు 9న జరిగిన గత విడత చర్చలు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయాయి.
సీఎం నివాసాన్ని ముట్టడించనున్న నిరసనకారులు..
ఆగస్టు 20న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు శనివారం ప్రకటించారు. ఈ ప్రదర్శన కోసం జార్ఖండ్ నలుమూలల నుంచి విద్యార్థులు రాంచీలో సమావేశం కావాలని వారు పిలుపునిచ్చారు."జేఎంఎం, కాంగ్రెస్ రెండూ మాతో రాజకీయాలు చేస్తున్నందున, మేము సీఎం రాజీనామా కోరుతున్నాము" అని పాశ్వాన్ ఆరోపించారు. తమ ఆందోళనలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే, జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకోవాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల డిమాండ్లు ఏమిటి?
14వ జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని, ఆరోపించబడిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, విచారణ నివేదికను బహిరంగపరచాలని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.జార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మారండీ ఆదివారం సోరెన్‌ను విద్యార్థుల డిమాండ్లను అంగీకరించాలని కోరారు. సీబీఐ విచారణకు వారి పిలుపుకు మద్దతు తెలిపారు. "అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దానికి ఆదేశించాలని నేను భావిస్తున్నాను. దీనికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?" అని మారండీ అన్నారు.ప్రభుత్వ "నిర్లక్ష్యం" కొనసాగితే మరింత మంది యువత, విద్యార్థులు వీధుల్లోకి వచ్చేలా ఒత్తిడి చేయవచ్చని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించాలనే ప్రతిపాదనపై మారండీ మాట్లాడుతూ, మూడు వారాలకు పైగా "శాంతియుతంగా" నిరసన తెలుపుతున్న విద్యార్థులకు బీజేపీ నైతిక మద్దతు ఇస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ వైఖరి..
ఆగస్టు 18న జరిగే సమావేశంలో తమ రాష్ట్ర విభాగం ఈ అంశంపై చర్చిస్తుందని కాంగ్రెస్ తెలిపింది. "జార్ఖండ్ యువత భవిష్యత్తుకు హాని కలిగించే ఏ ప్రయత్నాన్నీ సహించబోము" అని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జ్ రాకేష్ సిన్హా అన్నారు. విద్యార్థుల ఆందోళనలను పార్టీ లేవనెత్తుతుందని, పారదర్శకత, నిష్పాక్షికత, కాలపరిమితితో కూడిన నియామక ప్రక్రియ కోసం ఒత్తిడి చేస్తుందని ఆయన తెలిపారు.విద్యార్థులకు మద్దతు తెలిపినప్పటికీ, ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని నిరసనకారులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కూడా విమర్శించారు. సినీ, టెలివిజన్ నటి కునికా సదానంద్ కూడా జైపాల్ సింగ్ ముండా స్టేడియంలోని నిరసన ప్రదేశాన్ని సందర్శించి విద్యార్థులను కలిశారు.రెండు వారాలకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న ఆరుగురు నిరసనకారులలో ఒకరైన సబితా కుమారితో ఆమె మాట్లాడి, విద్యార్థుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని అన్నారు.
ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసింది?
నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చే లక్ష్యంతో చర్యలను ప్రకటించడం ద్వారా జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించింది. తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, నియామక పరీక్షల చుట్టూ ఉన్న ప్రశ్నలు ఒక తరం ఉద్యోగార్థుల నమ్మకాన్ని కదిలించాయని సోరెన్ అన్నారు.అవకతవకల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని, పలుకుబడి లేదా హోదాతో సంబంధం లేకుండా దోషిగా తేలిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ప్రభుత్వం సూచించిన చర్యలలో కాలపరిమితితో కూడిన వార్షిక పరీక్షల క్యాలెండర్, సాంకేతికతతో కూడిన పరీక్షలు, జవాబు కీలు, OMR షీట్ల సకాల ప్రచురణ, నియామక ప్రక్రియలో బహుళ-స్థాయి జవాబుదారీతనం వంటివి ఉన్నాయి. పరీక్షా విధానంలో సంస్కరణలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి సూచనలు కోరేందుకు ప్రభుత్వం ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.అయితే, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న పరీక్షలను రద్దు చేయడం, నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరపడం వంటి తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళనను విరమించుకోబోమని నిరసనకారులు స్పష్టం చేశారు.

