Dailyhunt
రూత్ తలరాత మార్చిన కలెక్టర్ నాగరాణి!

రూత్ తలరాత మార్చిన కలెక్టర్ నాగరాణి!

లెక్టర్లు వస్తుంటారు, పోతుంటారు.. కొద్దిమంది మాత్రమే స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతారు. అటువంటి వారిలో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి.

మాట చెప్పడమే కాకుండా చేసి చూపించారు. ఓ బాలిక తలరాత మార్చేలా చేశారు.అసలేం జరిగిందంటే...ఒకవైపు చదువుకోవాలన్న తపన.. మరోవైపు అడ్డుతగిలే కుటుంబ పరిస్థితులు. రెక్కలు విప్పుకుందామంటే కట్టిపడేసే బంధనాలు. చిన్నవయసు, పెద్ద కష్టం.. కానీ, ఆ బాలిక సంకల్పం ముందు ఆ అడ్డంకులు తలవంచక తప్పలేదు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కండ్రు రూత్ కథ ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ఉండి గ్రామ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రూత్, కుటుంబ కలహాల కారణంగా పాఠశాలకు దూరమైంది. తన కూతురు చదువుకు కన్నతండ్రే అడ్డుపడడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అయితే, ఆ బాలికలోని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ఆమెను వదిలిపెట్టలేదు. జనవరి 24న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి నిర్వహించిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

"ఆ అమ్మాయికి చదవాలని ఉంది. ఇప్పుడు వచ్చినా తను ఖచ్చితంగా పాస్ అవుతుంది. కానీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి.." అని ఉపాధ్యాయులు విన్నవించారు. తల్లమ్మ చెరువునకు చెందిన బాలిక కుటుంబ తగాదాలతో పాఠశాలకు రాకుండా తండ్రి అడ్డుకుంటున్నారని, ఇప్పుడు తరగతులకొచ్చినా.. ఆమె కచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తుందని ఉపాధ్యాయులు చెప్పారు.

కలెక్టర్ నిర్ణయం.. మారిన రూత్ తలరాత

కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో ఆలోచించిన కలెక్టర్ నాగరాణి వెంటనే స్పందించారు. "ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు" అని ఆదేశిస్తూ, రూత్ పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను పురమాయించారు.

అధికారులు వెంటనే రంగంలోకి దిగి, జువ్వలపాలెంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రూత్‌ను కలిశారు. స్థానిక పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి, అక్కడే ఆమెకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

నేడు విజేతగా రూత్

గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రూత్ సెకండ్ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటి గడప దాటనివ్వని పరిస్థితుల నుండి, పరీక్షా కేంద్రంలో పెన్ను పట్టి విజయం సాధించే వరకు ఆమె సాగించిన ప్రయాణం అసాధారణం.

కలెక్టర్ అంటే అధికారమే కాదు.. ఒక భరోసా!

సాధారణంగా కలెక్టర్లు వస్తుంటారు, వెళ్తుంటారు. వీలయితే నాలుగురాళ్లు వెనకేసుకుంటారు, లేకుంటే చేతనైనకాడికి అందరితో మంచిగా ఉంటుంటారు. కానీ, ఒక విద్యార్థిని జీవితంలో వెలుగు నింపిన నాగరాణి చొరవ ఆమెను అందరిలోనూ ప్రత్యేకం (Different) అనిపించేలా చేసింది. రూత్ సాధించిన ఈ విజయం ఆమెది మాత్రమే కాదు.. అండగా నిలిచిన ఉపాధ్యాయులది, భరోసానిచ్చిన కలెక్టర్ గారిది కూడా!

ఆల్ ది బెస్ట్ రూత్.. నీ ప్రయాణం ఇలాగే కొనసాగాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh