Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాగర గర్భంలో సైకిల్ సవారీ!

సాగర గర్భంలో సైకిల్ సవారీ!

నీటిపై సైకిల్ నడపడమే ఓ పెద్ద సాహసం. అలాంటిది నీటి అడుగున సైకిల్ తొక్కడం అంటే ఇంకెంత సాహసం? అలాంటి అసాధ్యమైన సాహసాన్ని సుసాధ్యం చేశారు విశాఖకు చెందిన స్కూబా డైవర్లు.

సాగర గర్భంలో ఇలాంటి సైకిల్ విన్యాసం చేయడం దేశంలోనే తొలిసారి. అది ఎక్కడ? ఎలా? ఎందుకు?

సముద్ర గర్భంలో సైకిల్ విన్యాసాలు చేస్తున్న స్కూబా డైవర్లు

రుషికొండ తీరానికి చేరువలో..

బుధవారం వరల్డ్ సైక్లింగ్ డే. ఈ సందర్భంగా విశాఖపట్నం సముద్ర జలాల అడుగున స్కూబా డైవర్లు ఓ అరుదైన సాహసానికి ఒడిగట్టారు. ఇందుకు విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రుషికొండ బీచ్‌కు సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు బోటులో నలుగురు స్కూబా డైవర్లు వెళ్లారు. అక్కడ నుంచి ఆ స్కూబా డైవర్లు బోటుకు తాడు కట్టి సైకిళ్లకు ముడిపెట్టారు. 10 నుంచి 12 మీటర్ల దిగువన సాగర గర్భంలోకి సైకిళ్లపైకి వెళ్లారు. వీరు వెనక భాగంలో ఆక్సిజన్‌తో పాటు అవసరమైన ఇతర పరికరాలను అమర్చుకున్నారు. అనంతరం సాగర గర్భంలో 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కుతూ విన్యాసాలు చేశారు. సైక్లింగ్ విన్యాసాలు ముగిశాక వారు క్షేమంగా సముద్ర ఉపరితలంపైకి చేరుకున్నారు.

సముద్ర గర్భంలో సైకిల్ విన్యాసాలు చేస్తున్న స్కూబా డైవర్లు

ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ నేతృత్వంలో..

ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైవ్ ఇన్ అడ్వంచర్స్ స్కూబా డైవింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు బి.బలరాంనాయుడు నేతృత్వంలో ఈ అండర్ వాటర్ సైక్లింగ్‌కు శ్రీకారం చుట్టారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సముద్ర గర్భంలో సైక్లింగ్ విన్యాసాలు నిర్వహించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. సాగర గర్భంలో సైకిలింగ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం!

బలరాం నాయుడు

సైక్లింగ్‌ను ప్రమోట్ చేయడం కోసమే..బలరాం

సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో అవసరమని, గతంలో అనేక బైసికిల్ క్లబ్‌లు చురుగ్గా ఉండేవని, ప్రస్తుతం వాటి కార్యకలాపాలు తగ్గాయని బలరాం నాయుడు చెప్పారు. `సైక్లింగ్‌ను మరింత బలోపేతం చేసి యువతను సైక్లింగ్ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సైక్లింగ్ వల్ల ఇంధనం పొదుపు అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన రవాణా విధానాలను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుల పిలుపు మేరకు ఈరోజు విశాఖలో అండర్ వాటర్ సైక్లింగ్ నిర్వహించాం. ఈ ప్రదర్శన ద్వారా ప్రజలు తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని మేం ప్రోత్సహిస్తున్నాం. ఈ కార్యక్రమం స్థిరమైన రవాణా,శారీరక ధృఢత్వం, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటి చెప్పింది` అని బలరాం నాయుడు `ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌` ప్రతినిధితో చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh