మేకెదాటు అంతర్రాష్ట్ర జల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని AIADMK చీఫ్ ఇడప్పాడి కె. ఫళనిస్వామి (Edappadi K. Palaniswami)డిమాండ్ చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D. K. Shivakumar) ''మేకెదాటు డ్యామ్‌ను వ్యతిరేకించే హక్కు తమిళనాడుకు లేదు" అని అనడంపై ఫళని స్వామి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రైతులు, ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయని పేర్కొన్నారు.
కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకెదాటు వద్ద తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం జలాశయం నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడు జలహక్కులకు ముప్పు వాటిల్లుతుందని రాష్ట్రం వ్యతిరేకిస్తోంది.
తమిళనాడు హక్కులను దెబ్బతీసేలా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అయినా తమిళనాడు ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని పళనిస్వామి విమర్శించారు. పరిపాలన మారినా పరిస్థితి మారడం లేదన్నారు.
కావేరీ నీరు కేవలం డెల్టా జిల్లాల రైతులకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని 20 జిల్లాల ప్రజలకు తాగునీటి ప్రధాన వనరు అని ఆయన గుర్తుచేశారు. మేకెదాటు వద్ద ఆనకట్ట నిర్మిస్తే కావేరీ డెల్టా జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. తమిళనాడు కావేరీ హక్కులను ఏఐఏడీఎంకే ఎప్పటికీ వదులుకోదని స్పష్టం చేసిన పళనిస్వామి, కర్ణాటక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

