తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే నేత ఎ రాజ చేసిన వ్యాఖ్య తీవ్ర వివాదానికి దారితీసింది. టీవీకే ప్రభుత్వంలో మంత్రులుగా చేరిన విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నేతలనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారని కొంతమంది భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వీసీకే, టీవీకే నేతలు డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిన్న పార్టీలను అవమానించే ధోరణి మానుకోవాలని సూచించారు.
"నా తోటలోని కొబ్బరి చెట్టు వంగి, పక్కింటికి లేత కొబ్బరికాయలు ఇస్తే దానిని సాహిత్య భాషలో 'ముదత్తంగే' అంటారు. రాజకీయాల్లో దానికి ఏ పేరు పెట్టాలి?" అని సోషల్ మీడియా X లో పోస్టు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదానికి కారణమైంది.
ఈ వ్యాఖ్య టీవీకే ప్రభుత్వంలో తాజాగా మంత్రులైన వీసీకే ఎమ్మెల్యే వి. వన్ని అరసు, ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఏఎం షాజహాన్‌లను ఉద్దేశించిందేనని రాజకీయ వర్గాలు భావించాయి. దీనిపై వీసీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక న్యాయం కోసం పోరాడే చిన్న పార్టీలను అవమానించేలా డీఎంకే శైలి ఉందని ఆరోపించింది. తమ పార్టీ అణగారిన వర్గాల మద్దతుతో ఎదిగిందని స్పష్టం చేసింది. టీవీకే నేతలు కూడా రాజా వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి అధవ్ అర్జున మాట్లాడుతూ.. డీఎంకేలో గౌరవం, క్రమశిక్షణ తగ్గిపోయాయని విమర్శించారు. సీఎం విజయ్ కుల, మత రాజకీయాలను తిరస్కరించారని చెప్పారు.

