Dailyhunt
టీఎంసీ-ఈసీ మధ్య ఘర్షణ..

టీఎంసీ-ఈసీ మధ్య ఘర్షణ..

శ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా నుంచి భారీ సంఖ్యలో పేర్లు తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఎన్నికల సంఘం మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.

అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు కొద్ది రోజులే మిగిలి ఉండగా, ఈ వివాదం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం, డెరెక్ ఓ'బ్రియన్ నేతృత్వంలోని టీఎంసీ ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలిసింది. అయితే ఈ సమావేశం కేవలం ఏడు నిమిషాలకే ముగియడం గమనార్హం. సమావేశం అనంతరం ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది.

సమావేశంలో తమను "ఇక్కడినుంచి వెళ్లిపోండి" అని సీఈసీ చెప్పారని టీఎంసీ ఆరోపించింది. అధికారుల బదిలీలపై ప్రశ్నించగానే వాతావరణం ఉద్రిక్తమైందని తెలిపారు. సమావేశానికి సంబంధించిన వీడియో లేదా ఆడియో రికార్డులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. టీఎంసీ ప్రతినిధులు సమావేశంలో అరిచి, సీఈసీ మాట్లాడకుండా అడ్డుకున్నారని పేర్కొంది. ఈ సంభాషణ సాధారణ చర్చ మాత్రమేనని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో సుమారు 90.83 లక్షల పేర్లు తొలగించినట్లు సమాచారం. ఈ Special Intensive Revision (SIR) ప్రక్రియపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ విషయంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పెద్ద సంఖ్యలో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా పరిశీలనలో ఉన్న లక్షలాది మందికి ఓటు హక్కు ఇవ్వలేదని విమర్శించారు. అయితే నకిలీ, మరణించిన ఓటర్ల తొలగింపును ఆమె సమర్థించారు.

ఇక ప్రతిపక్ష బీజేపీ నాయకులు మాత్రం ఈ ప్రక్రియ ద్వారా అక్రమ ఓటర్లు బయటపడ్డారని పేర్కొన్నారు. టీఎంసీ మైనారిటీలు, మతువా వర్గాలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.

మొత్తానికి ఓటర్ల తొలగింపు అంశం బెంగాల్ ఎన్నికల ముందు ప్రధాన రాజకీయ వివాదంగా మారింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh