Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి మేయర్ పీఠంపై 'బాబు మార్క్' రాజకీయం

తిరుపతి మేయర్ పీఠంపై 'బాబు మార్క్' రాజకీయం

తిరుపతి నగర మేయర్ స్థానానికి నుంచి కూటమి ఎవరు పోటీ చేస్తారు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసే రాజకీయ ప్రయోగం ఎలా ఉండబోతోంది. తాజాగా జనసేనలోకి చేరిన ప్రణీత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.

డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారికి కార్పొరేటర్ సీట్లు ఇవ్వరనే ప్రచారం ఉంది. బీజేపీకి మేయర్ స్థానం కేటాయించాలని నిర్ణయిస్తే,టీడీపీ, జనసేన నేతల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ప్రయోగం ఫలిస్తుందా? వైసీపీకి లాభిస్తుందా? ఈ అంశాలను వైసీపీ నేతలు సునిశితంగా గమనిస్తున్నారు.


ఆశావహుల పరిస్థితి?
ఇదో చిక్కుముడి పడింది. తిరుపతి నగరంలో మెజారిటీ కాపు సామాజికవర్గం, ఆ తరువాత యాదవ సామాజక వర్గం నుంచి ఆశావాహులైన టీడీపీ నేతలు ఎక్కువ ఉన్నారు. జనసేన ఈ సీటు ఆశిస్తోంది. అయితే, ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం కావడం వల్ల విశాఖ తరువాత తిరుపతిని బీజేపీ ఆశిస్తోంది. ఈ మేయర్ సీటు కోసం పట్టుబడుతోంది. మధ్యేమార్గంగా ప్రణీత్ రెడ్డి (ఈయన కాపు సామాజికవర్గం నేత, విద్యా సంస్థ అధిపతి కూడా) టీడీపీ ఈయనను జనసేనలోకి పంపింది. ఆయనను మేయర్ స్థానానికి పోటీ చేయించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఆశావాహులకు టీడీపీ, జనసేనలో గొంతులో వెలక్కాయపడినట్లు అయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే తరహా పోటీ కారణంగా, ఆశావాహులు ఎక్కువ కావడంతో మధ్యేమార్గంగా తిరుపతి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించడం, ఇక్కడి నుంచి ఆ పార్టీ నేతగా ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు.
సామాజికవర్గాల సమతూకం..
తిరుపతి నుంచి కాపు సామాజిక వర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధికారిటీ తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకరరెడ్డి క్యాబినెట్ హోదా పదవిలో ఉన్నారు. తిరుపతి టీటీడీ నియోజకవర్గ ఇన్ చార్జి కాపు నేత జేబీ శ్రీనివాస్ ఉన్నారు. దీంతో తిరుపతి నగర మేయర్ సీటు కచ్చితంగా యాదవ సామాజిక వర్గం నేతలకు దక్కుతుందనేది ఆ సామాజికవర్గం నేతల లెక్కలు. ధీమా కూడా. అనూహ్యంగా విద్యా సంస్థ అధిపతి ప్రణీత్ రెడ్డి జనసేనలోకి రావడం ద్వారా మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రణీత్ రెడ్డి ఎవరు? వాస్తవానికి ఈయన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈయనది కడప జిల్లా రాజంపేట. టీడీపీలో రాజంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బండారు రత్నసభాపతి మనవడు కావడం గమనార్హం. ఈయనకు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ఆశీస్సులతోనే జనసేనలోకి పంపించారని ప్రచారం. దశాబ్దాలుగా టీటీడీకి అండగా నిలిచిన తిరుపతిలోని దాదాపు 2.20 లక్షల మంది ఓటర్లలో కాపు సామాజికవర్గం నుంచి 80 వేల నుంచి 90 వేలః మంది ఓటర్లు, యాదవ సామాజికవర్గం లో 40 వేల నుంచి 60 వేల వరకు ఉన్న ఓటర్లు, ఆ తరువాత కీలకంగా ఉన్న ఎస్సీ ఓటర్లు, పొరుగు ప్రాంతాల నుంచి తిరుపతిలో స్థిరనివాసం ఉన్న మైగ్రేటెడ్ ఓటర్లు టీడీపీ అధినేత నిర్ణయాన్ని స్వాగతిస్తారా?
ఎందుకు ఈ పట్టు..
తిరుపతి సీటును పట్టుబడుతున్న బీజేపీ మేయర్ స్థానానికి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి భార్యను పోటీ చేయించాలని భావిస్తున్నారు. భాను ప్రకాష్ రెడ్డి రెడ్డి సామాజికవర్గం నేత అయినా, ఆయన భార్య కాపు సామాజికవర్గం కావడం గమనార్హం. కూటమి మిత్రత్వంలో కాపు, రెడ్డి సామాజికవర్గం ఓట్లు కలిసొస్తాయనేది బీజేపీ భావనగా కనిపిస్తోంది.
దీనికి కారణం
తిరుపతి నగర పాలక సంస్థకు మొదటిసారి జరిగిన గత ఎన్నికల్లో బీసీ యాదవ సామాజికవర్గం నుంచి మహిళా డాక్టర్ కు వైసీపీ అవకాశం కల్పించింది. టీడీపీ కూటమిలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ నేతలు సునిశితంగా గమనిస్తున్నారు. సాధారణంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలోనే కాదు. రాజకీయాల్లో కూడా ప్రయోగాలు చేస్తుంటారనేది టీడీపీ వర్గాల్లో వినిపించే మాట. ప్రస్తుతం తిరుపతిలో బీజేపీ లేదా జనసేనకు మేయర్ స్థానం కేటాయిస్తే, ప్రతికూల పరిస్థితులు తప్పవనేది రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉంటేవైసీపీ అధికారంలో ఉండగా, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి మేయర్ స్థానానికి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీష ఎంపికయ్యారు. డిప్యూటీమేయర్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కొడుకు భూమన అభినయరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి చెందారు. దానికి ముందు అభినయ్ డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు.
మారిన సమీకరణ
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ మేయర్ పదవికి కార్పొరేటర్లతో నిర్వహించిన ఎన్నికలో టీడీపీ సీనియర్ నేత ఆర్.సీ మునికృష్ణ ఎంపికయ్యారు. దీనికి ప్రధానంగా వైసీపీ నుంచి పది మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడమే. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్తగా వచ్చి చేరిన వారికి టీడీపీలో సీట్లు లేదనే నిర్ణయం తీసుకున్నారు. ఇది వైసీపీ నుంచి వచ్చిన వారిని నిరుత్సాహ పరిస్తే, టీడీపీ కూటమికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి రాజకీయంగా కూటమి మధ్య సయోధ్య కుదరని స్థితిలో టీడీపీ సీనియర్ నేతలకు కాకుండా, మిత్రపక్షంలోని జనసేన, బీజేపీకి మేయర్ స్థానం కేటాయిస్తే, అంచనాలు తల్లకిందులయ్యే వాతావరణం లేకపోలేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh