మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారా? తిరుపతికి సమీపంలోని శ్రీవకుళామాత ఆలయం వద్దకు వస్తే చాలు. బాసర్ శ్రీజ్ఞానసరస్వతి ఆలయంలో మాదిరే మూడు నుంచి ఐదేళ్ల లోపు బాలలకు అక్షరాభ్యాసం చేయించేందుకు టీటీడీ జూలై మూడో తేదీ ముహూర్తంగా నిర్ణయించింది.
శ్రీవకుళామాత సన్నిధిలో "అక్షర గోవిందం" పేరిట అక్షరాభ్యాసం - అన్నప్రాశన సేవలు ప్రారంభించనుంది.మధ్యాహ్నం 12.00 నుంచి 12.30 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో, శ్రీ వకుళామాత సన్నిధిలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఆశీర్వచనం, ప్రసాదం, ప్రత్యేక "అక్షర గోవిందం కిట్" అందజేస్తాం అని టీటీడీ ప్రకటించింది.

ఐదేళ్ల లోపు పిల్లలకే..
ఈ కార్యక్రమంలో మూడు నుంచి ఐదేళ్ల లోపు వయస్సు చిన్నారులకు అవకాశం కల్పిస్తారు. అక్షర గోవిందం కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, పటిక బెల్లం, శ్రీవకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష తదితర పూజా, విద్యా సామగ్రి ఉచితంగా అందజేస్తారు.
ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు తొలి అన్నప్రాశనను ఆగమోక్తంగా నిర్వహించి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతల ఆశీస్సులను అందజేస్తారు.
గంట ముందు నమోదు..
ఈ ఏడాది జూలై నాల్గవ తేదీ నుంచి మంగళవారం మినహా అన్ని రోజుల్లో వకుళమాత ఆలయ అర్చకులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ బ్యాచ్ కు 25 మంది చిన్నారులు చొప్పున రెండు బ్యాచ్‌లలో మొత్తం 50 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు గంట ముందు ఆలయ ప్రాంగణంలో పేర్లు నమోదు చేసుకోవాలి. చిన్నారులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టిటిడి సూచించింది.
వకుళామాత ఆలయానికి ఎలా వెళ్లాలి..
తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవకుళామాత ఆలయాన్ని టీటీడీ మరో బాసర క్షేత్రం (శ్రీజ్ఞానసరస్వతి )గా తీర్చిదిద్దింది. 300 కిట్లతో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి ప్రణాళిక తయారు చేశారు.
తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ వద్ద కొండపై 17 వ శతాబ్దానికి చెందిన శ్రీవకుళామాత ఆలయం ఉంది. తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఎడమ వైపు గుట్టపై కనిపిస్తుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారికి స్వయాన తల్లి శ్రీవకుళామాత. ఆ ఆలయాలు కపిలతీర్థం సమీపంలోని మాల్వాడిగుండం దగ్గర ఒకటి. శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణమార్గంలో ఆగ్నేయ దిశలో పోటు ( వంటశాల) వకుళామాత గుడి ఉంది. ఏమి విగ్రహానికి ఎదురుగా కిటికీ లాంటి అర నుంచి ప్రసాదాల తయారీని చూసే విధంగా వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు.
ఆలయం ఉన్న కొండపైకి నడిచి వెళ్లడానికి స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం తో పాటు ఆనంద నిలయాన్ని పోలిన రీతిలో బంగారు తాపడం చేశారు. తిరుమల తరహాలోని ఒకుళా మాత ఆలయం ఉన్న పేరూరు కొండపై కూడా యాత్రికులు సులభంగా వెళ్లే విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించారు. కానీ, స్థలం తక్కువగా ఉంటుంది.
బాసర తరహాలోనే..
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర్ (Basar) వద్ద ఉన్న శ్రీ సరస్వతీ దేవి ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. దేశంలో సరస్వతీదేవి ఆలయాలు కాశ్మీర్ తరువాత బాసరలోని శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమీతులై కొలువు తీర్చారు. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు మాత్రమే.. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతీదేవి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షర కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తారు. దేవస్థానం పాలకమండలి కూడా ఇక్కడ అలాంటి ఏర్పాటు చేసి, ఆర్జిత సేవలు అందుబాటులో ఉంచారు.
బాసరలో...
బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి టిక్కెట్ ధర తీసుకోవాలి.
1. సాధారణ అక్షరాభ్యాసం చేయించాలంటే వంద రూపాయల టికెట్ తీసుకోవాలి. ఆలయ ప్రాంగణంలో సాధారణ విశాలమైన గదిలో మాత్రమే ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.
2. ప్రత్యేక అక్షరాభ్యాసం చేయించాలంటే వెయ్యి రూపాయల టికెట్ కూడా అందుబాటులో ఉంది. ఈ టికెట్ తీసుకున్న వారికి ఆలయంలో అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం కూడా బాసర ఆలయ అధికారులు కానుకగా అందిస్తారు.
3. బాసర అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాస పూజ కార్యక్రమాలు ఉదయం 7:30 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయి. సెలవు రోజుల్లో లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మార్పులు చేస్తూ యాత్రికులకు ఇబ్బంది లేకుండా బాసర ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంటుంది.
4. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వీలుగా టికెట్ కౌంటర్ వద్దే పలక, బలపం అందిస్తారు. గృహస్తులు ఇంటి నుండి పూజ సామాగ్రి తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుంది.. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం పరిమితంగా ఉండడం వల్ల, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే తల్లిదండ్రులు నేరుగా ఆలయానికి వెళుతుంటారు. వసంత పంచమి లేదా ఇతర పర్వదినాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
తిరుపతి వకుళామాత ఆలయం వద్ద
తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవకుళామాత ఆలయంలో కూడా బాసర తరహాలోనే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి మూహూర్తం నిర్ణయించింది.

