Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ట్రంప్ సేనలకు నరకం మరెక్కడో లేదు!' మొండికేసిన ఇరాన్

'ట్రంప్ సేనలకు నరకం మరెక్కడో లేదు!' మొండికేసిన ఇరాన్

ధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటూ సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

వాషింగ్టన్‌తో శాంతి ఒప్పందానికి రావడానికి "గడువు మించిపోతోంది" (Clock is ticking) అంటూ ట్రంప్ పంపిన స్పష్టమైన సంకేతాలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమ్యాయి.

అమెరికా విధించిన ఆర్ధిక, నౌకాదళ ముట్టడితో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో, ట్రంప్ నేరుగా టెహ్రాన్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ మైండ్ గేమ్‌కు తెరలేపారు.

మొజ్తాబాకు ట్రంప్ అల్టిమేటం!

ఏప్రిల్ 13 నుండి ఇరాన్ రేవులపై అమెరికా కొనసాగిస్తున్న నౌకాదళ దిగ్బంధనం (Naval Blockade) నెల రోజులు దాటినా ఇరాన్ లొంగకపోవడంతో ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. అయితే, ఈ డెడ్‌లాక్‌కు అసలు కారణం ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహమేనని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తమ షరతులకు లొంగిపోయి, అమెరికాతో ఒప్పందం చేసుకున్నారనే 'విజయ సంకేతాన్ని' ప్రపంచానికి చాటాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు.

అటు ఇరాన్ మాత్రం తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని అంటోంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమని, ట్రంప్ తమకు గౌరవప్రదమైన ఎగ్జిట్ (Face-saving exit) ఇవ్వకుండా కేవలం తమను దారికి తెచ్చుకోవాలనే చూస్తున్నారని టెహ్రాన్ భావిస్తోంది.

"ఒమన్ గల్ఫ్ అమెరికాకు స్మశాన వాటికే" - ఇరాన్ కౌంటర్

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఎక్స్‌పెడియెన్సీ కౌన్సిల్ సభ్యుడు, మాజీ IRGC కమాండర్ మొహసేన్ రెజాయ్ అంతే తీవ్రంగా స్పందించారు. అమెరికా వెంటనే ఈ దిగ్బంధనాన్ని ఆపాలని, లేకపోతే "ఒమన్ గల్ఫ్ అమెరికా సైన్యానికి స్మశాన వాటికగా మారుతుంది" అని హెచ్చరించారు.

తమ సాయుధ బలగాల చేతులు ఎప్పుడూ "ట్రిగ్గర్" పైనే ఉన్నాయని, చర్చలు ఒకవైపు సాగుతున్నా.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి యుద్ధానికైనా సిద్ధమని మొజ్తాబా ప్రభుత్వం స్పష్టం చేసింది.

అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్

అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ తన సొంత కౌంటర్-ప్రపోజల్‌ను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా పంపింది. అయితే, అమెరికా కేవలం తమ ఆస్తులను 25% మాత్రమే విడుదల చేస్తామని, తమ అణు కేంద్రాలను మూసివేయాలని ఏకపక్ష షరతులు పెట్టడాన్ని ఇరాన్ తప్పుబట్టింది. అమెరికా ఎటువంటి నమ్మదగిన, స్పష్టమైన రాయితీలు ఇవ్వకుండా కేవలం ఇరాన్ లొంగిపోవాలని కోరుకుంటోందని, ఇలాంటి షరతులకు లొంగేది లేదని మొజ్తాబా ఖమేనీ స్పష్టం చేశారు.

ట్రంప్ డెడ్‌లైన్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఒక లిఖితపూర్వక సందేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని తాము ఎంతమాత్రం సహించబోమని, "ఈ సముద్ర జలాల అడుగు భాగమే అమెరికన్లకు సరైన స్థలం" అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం లేని ఒక "కొత్త అధ్యాయం" మొదలైందని ఆయన ప్రకటించారు.

సైనిక చర్యల్లో భాగంగా ఇరాన్ వ్యూహాత్మక 'హార్ముజ్ జలసంధి'పై తన పట్టును మరింత బిగించింది. శత్రు దేశాల నౌకలను పూర్తిగా నిషేధించడమే కాకుండా, ఈ మార్గం గుండా ప్రయాణించే ఇతర వాణిజ్య నౌకల నుంచి భారీగా టోల్ (రుసుము) వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్, IRGC సరికొత్త ప్లాన్ వేశాయి.

తమతో సహకరించే, స్నేహపూర్వక దేశాల (చైనా, జపాన్, పాకిస్తాన్ వంటి) నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తూ, అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

యుద్ధ సన్నద్ధతపై మొజ్తాబా సమీక్ష

ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ, సైనిక కమాండర్లతో వరుస బేటీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. ట్రంప్ ఒకవేళ మరిన్ని దాడులకు దిగితే, బదులుగా ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడేందుకు ఇరాన్ సైన్యానికి ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు టెహ్రాన్ వర్గాలు వెల్లడించాయి.

ట్రంప్ ఎంతలా గడువు విధిస్తూ ఒత్తిడి పెంచుతున్నా.. మొజ్తాబా నాయకత్వంలోని ఇరాన్ మాత్రం తాము లొంగిపోయేది లేదని, అవసరమైతే పూర్తి స్థాయి యుద్ధానికైనా సిద్ధమంటూ సైనిక చర్యలతోనే సమాధానం ఇస్తోంది.

సముద్రంలో 'తేలియాడే జైలు'..

ఈ ఉద్రిక్తతల నడుమే, గాజాపై ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధనాన్ని సవాల్ చేస్తూ 54 నౌకలతో బయలుదేరిన "గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా" మరో రెండు రోజుల్లో పాలస్తీనా జలాల్లోకి ప్రవేశించనుంది. దీనిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రక్షణ సమీక్ష నిర్వహించారు. యాక్టివిస్టులను సముద్రంలోనే అదుపులోకి తీసుకుని "ఫ్లోటింగ్ ప్రిజన్" (తేలియాడే జైలు) లో బంధించేందుకు ఇజ్రాయెల్ సైన్యం వ్యూహాలు రచిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh