వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ పనులపై మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విశాఖపట్నం రూరల్ మండలం అడవివరం-ముడసర్లోవ గ్రామాల మధ్య 160 ఎకరాలను ప్రభుత్వం ఈ డేటా సెంటర్‌కు కేటాయించింది.
దీంతో అక్కడ ఆ సంస్థ నిర్మాణ పనులను చేపడుతోంది. ఆ ప్రాజెక్టు కంబాలకొండ అభయారణ్యానికి కూతవేటు దూరంలో ఉంది. అందువల్ల పర్యావరణ పరంగా సున్నితమైన, జీవ వైవిధ్యం గల (ఎకో సెన్సిటివ్ జోన్) ప్రాంతాన్ని డేటా సెంటర్‌కు అటవీ శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం ఇవ్వడం తగదని హెచ్‌ఆర్‌ఎఫ్ పేర్కొంది. ఇది పర్యావరణ పరిరక్షణకు, ప్రజా హితవుకు విఘాతం కలిగించే ఉన్మాద చర్యగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో అక్కడ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆందోళన చెందుతోంది.
హెచ్‌ఆర్‌ఎఫ్ బృందం డేటా సెంటర్ ప్రాంత సందర్శన..
సింహాచలం పర్వత శ్రేణిలో అంతర్భాగంగా ఉన్న కైలాసగిరి అటవీ ప్రాంతంలో ఉన్న ఆ పచ్చని ప్రాంతాన్ని మానవ హక్కుల వేదిక ప్రతినిధి బృందం ఈనెల 18న సందర్శించింది. అమూల్యమైన ఈ అటవీ ప్రాంతంలోని పచ్చదనాన్ని, చెట్లను కొట్టేసి భూభాగాన్ని తవ్విపోయడం, చదును చూసి నిర్ఘాంతపోయినట్టు హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, హెచ్‌ఆర్‌ఎఫ్ ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణలు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటన సారాంశం ఇలా..

డేటా సెంటర్‌కు ఆవల ఉన్న ముడసర్లోవ రిజర్వాయరు
ర్యావరణ అనుమతుల్లేకుండానే...
'డేటా సెంటర్‌కు కేటాయించిన భూమిలో చదును చేసి తాత్కాలిక కచ్చా రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పర్యావరణ ఆమోదం పొందలేదు. అయినా అదురూ బెదురూ లేకుండా బరితెగించి చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తూ పనులు మొదలెట్టారు. ప్రాజెక్టును ప్రతిపాదించే వ్యక్తులు/సంస్థలు ముందస్తు పర్యావరణ అనుమతులు పొందకుండా భూమి నైసర్గిక స్వరూపాన్ని మార్చడం, చెట్లను తొలగించడం, ఇతర పనులు చేపట్టడం వంటివి చేయకూడదుని పర్యావరణ చట్టాలు చెబుతున్నాయి. అలా చేస్తే అది పర్యావరణ ప్రభావ అంచనా మదింపునకు ఆటంకం కలుగుతుంది.
టగిరి బీ-2 ప్రాజెక్టుగా వర్గీకరణ తప్పు..
గూగుల్-రైడెన్-అదానీ ప్రోత్సహిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిపుణుల అంచనా కమిటీ అన్యాయంగా కేటగిరి బీ-2 ప్రాజెక్టుగా వర్గీకరించింది. ఇది పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం కావడం, కంబాల కొండ అభయారణ్య సమీప ప్రాంతం కావడం వల్ల పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్, 2006లోని సాధారణ నిబంధనలు వర్తిస్తాయి. అంటే ఈ ప్రాజెక్టును కేటగిరి ఏ ప్రాజెక్టు గుర్తించాలి. దాని పర్యావరణ ప్రభావ అంచనా మదింపు చేయాల్సింది కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ. సమగ్రమైన పర్యావరణ ప్రభావ అంచనా, బహిరంగ విచారణ తదితర చర్యలు చేపట్టాలి. ఈ డేటా సెంటర్ ప్రాంతం కంబాల కొండ వన్య ప్రాణుల అభయారణ్య సరిహద్దుకు కేవలం 0.86 కి.మీలు, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతానికి (ఈఎస్‌జెడ్) 0.45 కి.మీల దూరంలోను ఉందని స్వయంగా ప్రాజెక్టు ప్రతిపాదకుల నివేదికలోనే ఒప్పుకున్నారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం 1972 కింద సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతానికి చుట్టూ 10 కి.మీల పరిధిలో కేటగిరి-బి ప్రాజెక్టులన్నీ కేటగరి-ఏ ప్రాజెక్టులుగా పరిగణించబడతాయి.
ప్రతిపాదకుల్లో ద్వంద్వ వైఖరి..
ప్రాజెక్టు ప్రతిపాదకుడు ఒకవైపు కంబాలకొండ వన్య ప్రాణుల అభయారణ్యానికి, ఈఎస్‌జెడ్ ప్రాంతానికి సమీపంలో ఉన్నామని ఒప్పుకుంటూనే మరోవైపు సాధారణ నిబంధనలు వర్తిస్తాయా? అంటే 'నో' అని, ఇది వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 పరిధిలోకి వస్తుందా? అంటే 'నో' అని పేర్కొన్నారు. వారు చేసిన ప్రకటన, వారిచ్చిన నివేదికలకు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కేటగిరి-ఏ కింద జరగాల్సిన సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి కుయుక్తులకు పాల్పడ్డారు.
అటవీ శాఖ ఎన్‌వోసీ చెల్లదు..
రాష్ట్ర అటవీ శాఖ ఈ ప్రాజెక్టు స్థాపనకు అభ్యంతరం లేదని జారీ చేసిన ఎన్‌వోసీ ఏ విధంగా చూసుకున్నా చెల్లదు. వారు కనీసం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అటవీ సలహా మండలి నుంచి ముందుగా అనుమతి పొందలేదు. పర్యావరణ పరంగా ఇంతటి సున్నితమైన ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రదేశంలో అటవీ విభాగం ఇంత అనాలోచితంగా కళ్లు మూసుకుని ఎన్‌వోసీలు మంజూరు చేయకూడదు. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం విశాఖ ప్రాంతానికి పర్యావరణ పరంగా ఆయువు పట్టు లాంటిది. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని, భూగర్భ జలాల పునరుజ్జీవనాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ఒక అరుదైన ప్రకృతి సంపద కంబాలకొండ.
ముడసర్లోవ రిజర్వాయరుకు ముప్పు..
ఈ ప్రతిపాదిత డేటా సెంటర్ విశాఖకు మంచినీరు అందించే ముడసర్లోవ రిజర్వాయరుకు అత్యంత సమీపంలో ఉంది. హనుమంతవాక నుంచి సింహాచలం వెళ్లే రోడ్డుకు ఎడమ వైపున ఈ ప్రాజెక్టు స్థాపిస్తున్నారు. ముడసర్లోవ రిజర్వాయరు ఈ రోడ్డుకు కుడివైపున ఉంది. ఈ ప్రాజెక్టు పేరిట అడవులను నరికేయడం, భూభాగాన్ని అతలాకుతలం చేయడం, భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడం, చమురును నిల్వ చేయడం, భారీ జనరేటర్లను ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడితే ముడర్లోవలోకి పారే సెలయేళ్లు ఎండిపోయి రిజర్వాయరు మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. విశాఖ నగర నీటి భద్రత ప్రశ్నార్థకమవుతుంది.
నీటి వినియోగంపై తప్పుడు సమాచారం..
ఇది 512 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అతి పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్. పర్యావరణ నిర్వహణ ప్లాన్‌లో దాని శీతలీకరణ వ్యవస్థ, నీటి వాడకం వంటి అంశాల ప్రభావం గురించి ప్రస్తావన లేఉ. ఈ ప్రాజెక్టుకు కేవలం 246 కేఎల్‌డీల మంచినీరు అవసరమవుతుందని పేర్కొన్నారు. కానీ ఇంత భారీ డేటా సెంటర్‌కి కేవలం ఇంతటి నీటి వాడకం సరిపోతుందని చెప్పడం హాస్యాస్పదం. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆ పనే వారు తర్లువాడ, రాంబిల్లి డేటా సెంటర్ల విషయంలోనూ చేశారు.
పనులు తక్షణమే నిలిపివేయాలి..
ఇప్పటికే పర్యావరణ ప్రభావ అంచనాల ప్రక్రియ కొనసాగుతున్నందున ఆ ప్రాంతంలో డేటా సెంటర్ పనులను తక్షణమే నిలిపివేయాలి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ పనులు అంచనా వేసే అధికారం రాష్ట్ర నిపుణుల అంచనా కమిటీకి లేదు. కేటగిరి-ఏ ప్రాజెక్టు కాబట్టి దీని ప్రతిపానను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు పంపాలి. వారిచే సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను రూపొందించి, బహిరంగ విచారణ జరిపించాలని ఎస్‌ఇఏసీకి హెచ్‌ఆర్‌ఎఫ్ వినతి పత్రం అందజేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో చేస్తున్న పర్యావరణ ఉల్లంఘనలను నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని, అడవివరంలో అక్రమంగా అడవి నరికివేతకు కారకులైన అధికారులు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌ఎఫ్ డిమాండ్ చేస్తోంది' అని ఆ ప్రకటనలో ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.

