Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు'

'వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు'

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, పార్టీ అధినేత మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీని వీడాలనుకునే నాయకులు వెళ్లొచ్చని స్పష్టం చేస్తూనే, పార్టీని మళ్లీ బలోపేతం చేస్తానని ఆమె ప్రకటించారు. శుక్రవారం కోల్‌కతాలోని కాళీఘాట్ నివాసంలో, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) సమక్షంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మమతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ఓటమితో నిరాశ చెందవద్దని, మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

'పార్టీని మళ్లీ నిర్మిస్తా'

"ఇతర పార్టీలకు వెళ్లాలనుకునేవారిని వెళ్లనివ్వండి. నేను పార్టీని మళ్లీ నిర్మిస్తాను," అని మమతా అన్నారు. దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను తిరిగి నిర్మించాలని, అవసరమైతే తానే స్వయంగా రంగులు వేస్తానని కూడా వ్యాఖ్యానించారు. "తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటికీ తలవంచదు. ప్రజా తీర్పును దోచుకున్నారు," అని ఆమె ఆరోపించారు.

టీఎంసీకి భారీ దెబ్బ..

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కేవలం 80 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పార్టీ 291 స్థానాల్లో పోటీ చేయగా, 211 మంది అభ్యర్థులు ఓడిపోయారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతలు కూడా పరాజయం పాలయ్యారు.

భబనీపూర్‌లో మమతాకు షాక్..

తన కుంచుకోటగా భావించే భబనీపూర్ నియోజకవర్గంలో కూడా మమతా బెనర్జీ ఓటమి చవిచూశారు. ఈ ఫలితాలు టీఎంసీ శిబిరంలో తీవ్ర ఆందోళన కలిగించాయి.

ఫిరాయింపులపై ఊహాగానాలు..

ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీలో అసంతృప్తి పెరిగిందని, కొందరు నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మమతా అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

'ఎవరినీ బలవంతంగా ఆపం'

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మమతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఎవరైనా పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. నేను ఎవరినీ బలవంతంగా ఆపను," అని ఆమె స్పష్టం చేశారు.

టీఎంసీ 'ఎక్స్' పోస్ట్..

సమావేశం తర్వాత టీఎంసీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేశారు. "ఎన్నికల్లో మా అభ్యర్థులు బెదిరింపులు, ఒత్తిడులను ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడారు. టీఎంసీ ఒక కుటుంబంలా ఐక్యంగా నిలుస్తుంది," అని పార్టీ పేర్కొంది. అలాగే ప్రజా తీర్పును దోచుకున్నారని మరోసారి ఆరోపించింది.

నేతల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం..

పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న సమయంలో, నాయకుల్లో మనోధైర్యం పెంచేందుకు, ఐక్యతను కాపాడేందుకు మమతా ఈ సమావేశం నిర్వహించినట్లు పార్టీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh