Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెంకన్న కిరీటం.. తాకట్టుకు ఎలా చేరిందేమీ?

వెంకన్న కిరీటం.. తాకట్టుకు ఎలా చేరిందేమీ?

తాకట్టు నుంచి తిరిగి ఆలయానికి.. గుడివాడలో సంచలనం రేపిన "కిరీటం డ్రామా"

గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపులో బంగారు కిరీటం మాయం వ్యవహారం చివరకు భారీ వివాదానికి దారితీసింది.

మొదట కిరీటం తాకట్టు పెట్టలేదంటూ ఖండించిన ఆలయ ట్రస్టు సభ్యులు.. చివరకు ఒత్తిడి పెరగడంతో నిజాన్ని అంగీకరించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం గుడివాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎలా బయటపడింది?

గత ఏడాది దాత మట్టూరి సుబ్బారావు దంపతులు స్వామివారికి సుమారు రూ.75 లక్షలకు పైగా విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. అయితే ఇటీవల స్వామివారి దర్శనానికి వచ్చిన సుబ్బారావు.. కిరీటం కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు.

ఆలయ ట్రస్టు సభ్యులను ప్రశ్నించగా.. వారు తొలుత "కిరీటం సురక్షితంగానే ఉంది.. ఎక్కడికీ పోలేదు" అంటూ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ సందేహం తీరకపోవడంతో దాత తీవ్రంగా నిలదీశారు.

పోలీసుల జోక్యంతో బయటపడిన నిజం

వివాదం ముదరడంతో పోలీసుల జోక్యం జరిగింది. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ ట్రస్టు సభ్యులే ఆ బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు తేలింది. దీంతో ట్రస్టు బోర్డు ఛైర్మన్‌పై, ఇతర సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

దేవాదాయశాఖ పరిధిలో అధికారిక నియంత్రణ లేకపోయినా.. విషయం తీవ్రత దృష్ట్యా అధికారులు కూడా విచారణ చేపట్టారు.

"కల్యాణ మండపం నిర్మాణం కోసమే"

వివాదం మరింత పెద్దది కావడంతో ట్రస్టు ఛైర్మన్ పోకూరి మోహన్ రావు చివరకు మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్యవైశ్య కల్యాణ మండప నిర్మాణ నిధుల కోసమే కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు అంగీకరించారు. "తప్పు జరిగింది.. క్షమించండి" అంటూ ప్రజలను, దాత కుటుంబాన్ని క్షమాపణ కోరారు.

అలాగే దాత కుటుంబంతో మాట్లాడి సంప్రోక్షణ అనంతరం కిరీటాన్ని మళ్లీ స్వామివారికి అలంకరిస్తామని ప్రకటించారు.

రాజస్థాన్ నుంచి రాత్రికి రాత్రే కిరీటం

వివాదంలో మరో సంచలన అంశం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్‌కు వెళ్లిపోయాడని సమాచారం. దీంతో ట్రస్టు సభ్యులు హుటాహుటీన అక్కడి నుంచి కిరీటాన్ని తిరిగి తెప్పించినట్లు తెలిసింది.

తర్వాత గుడివాడ పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం ప్రాంగణంలో మీడియా ముందు ఆ కిరీటాన్ని ప్రదర్శించారు. అయితే ఇదే సమయంలో ట్రస్టు సభ్యుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.

మీడియాపై ఆగ్రహం

"కిరీటం వ్యవహారం మా కుటుంబ సమస్య.. మీడియాకు సంబంధం లేదు" అంటూ ట్రస్టు సభ్యులు మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులపై దౌర్జన్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తర్వాత ఆర్యవైశ్య సంఘం పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దిచెప్పినట్లు తెలిసింది.

రాజకీయ రంగు

ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా దాల్చింది. గుడివాడలో వివాదం తీవ్రంగా మారడంతో స్థానిక రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఇప్పుడు ప్రజల్లో ప్రధాన ప్రశ్నలు

దేవుడికి సమర్పించిన బంగారు ఆభరణాలను ట్రస్టులు తాకట్టు పెట్టే హక్కు ఉందా?

దాత అనుమతి లేకుండా ఇలా చేయడం చట్టబద్ధమేనా?

ఆలయ ఆస్తుల భద్రతపై ఎవరి పర్యవేక్షణ ఉంటుంది?

ఆలయ ట్రస్టుల వ్యవహారాల్లో పారదర్శకత ఎక్కడ?

ఒక ఆలయ బంగారు కిరీటం వివాదం.. ఇప్పుడు విశ్వాసం, బాధ్యత, పారదర్శకతపై పెద్ద చర్చకు దారితీసింది. "స్వామివారి ఆభరణం"గా సమర్పించిన కిరీటం.. తాకట్టు దుకాణం వరకు ఎలా వెళ్లింది? అన్న ప్రశ్నకు సమాధానం కోరుతూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి పోలీసు విచారణ, ట్రస్టుపై తీసుకునే చర్యలు, అలాగే భవిష్యత్తులో ఆలయ ఆస్తుల రక్షణపై పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh