హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 'ఆపరేషన్ ఆక్టోపస్ 3.0' చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో హైదారాబాద్ పోలీసులు దాడులు చేశారు.
ఈ దాడుల్లో 66 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో ఘోస్ట్ సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 బృందాలతో 7 రోజుల పాటు ఈ ఆపరేషన్‌ను కొనసాగించారు. ఇందులో నేరగాళ్లు మొత్తం 1194 ఘోస్ట్ సిమ్‌కార్డులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కాగా వాటిలో 544 సిమ్‌కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో మరిన్ని విస్తుబోయే విషయాలను పోలీసులు గుర్తించారు. ఈ సైబర్ నేరగాళ్లకు 20 మంది పీఓఎస్ ఏజెంట్లు సహాయం చేసినట్లు నిర్ధారితమైంది. వారిలో ఒడాఫోన్ ఐడియా కంపెనీకి చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్ వారు ఏడుగురు, జీయో సంస్థ వాళ్లు ముగ్గురు ఉన్నారు. అయితే పీఎస్ఓలు తమ దగ్గరకు కొత్త సిమ్ కోసం వచ్చిన వారి డాక్యుమెంట్స్‌తో వారికి తెలియకుండా మరో సిమ్ యాక్టివేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

