Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అగ్నిగుండంలా మారిన తెలంగాణ

అగ్నిగుండంలా మారిన తెలంగాణ

రోహిణి కార్తె ప్రభావంతో తెలంగాణ అగ్నిగుండంలా మారింది. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, రాబోయే నాలుగు రోజుల పాటు పరిస్థితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా, మే 28 వరకు 48 డిగ్రీల మార్కును దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళ బయటకు రావద్దని సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రోహిణి కార్తె ప్రభావం వల్ల గురువారం తీవ్ర వేడిగాలులు వీచాయి. గురువారం నుంచి మే 28వతేదీ వరకు తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు చెప్పారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47డిగ్రీల సెల్సియస్ వద్ద మండిపోయాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్‌లో 42నుంచి 43డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో రాబోయే కొన్ని రోజుల్లో సాధారణ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.గత 3 రోజులుగా అత్యంత తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. మే 25నుంచి 28వతేదీ మధ్య తెలంగాణలో మరోసారి వడగాలుల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

రాబోయే నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మళ్లీ 47నుంచి 48డిగ్రీల సెల్సియస్ మార్కును దాటుతాయని,హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 44డిగ్రీల సెల్సియస్ కు చేరువయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వివరించారు.

తీవ్ర వడగాలులు.. రెడ్ అలెర్ట్

తెలంగాణలోని వికారాబాద్,తాండూరు,మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూల్, నల్గొండ, దేవరకొండ, వనపర్తి,నారాయణపేట ప్రాంతాల్లో గురువారం తీవ్ర వడగాలులు వీచాయని వెదర్ మ్యాన్ తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాలలో అత్యధికంగా 46.5డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యయని వెదర్ మ్యాన్ తెలిపారు. గురువారం తెలంగాణలో వడగాలుల తీవ్రత అత్యధికంగా ఉంది.దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్ర వడగాలుల ప్రభావంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిశాయి.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో గురువారం అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు.

ఎల్ నినోతో తీవ్ర వడగాలులు

తెలంగాణతో సహా భారతదేశవ్యాప్తంగా సుదీర్ఘంగా, తీవ్రంగా కొనసాగుతున్న వడగాలులకు ఎల్ నినో పరిస్థితులే కారణమని తేల్చింది. బలమైన ఎల్ నినో ప్రభావాలు రుతుపవనాలకు ముందు నెలల్లో ఉష్ణోగ్రతలను గణనీయంగా పెంచుతాయని వాతావరణ పరిశోధకులు కనుగొన్నారు.రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి గురువారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఝార్ఖండ్ ఉత్తర చత్తీస్ ఘడ్ మీదుగా అంతర్గత ఒడిస్సా, మీదుగా ఒడిస్సా కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న చెప్పారు.

ఒకవైపు మండే ఎండలు, మరోవైపు అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ వాతావరణాన్ని అస్థిరంగా మారుస్తున్నాయి. రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్నప్పటికీ, అప్పటి వరకు రాష్ట్ర ప్రజలు తీవ్ర వడగాలుల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించడం అత్యంత అవసరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA