బండి భగీరథ్ కోసం పోలీసులు శనివారం మధ్యాహ్నం లుక్ ఔట్ నోటీసులను జారీచేశారు. అలాగే భగీరథ్ విషయమై కరీంనగర్ ఇంట్లో కూడా సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
మైనర్ బాలిక మీద లైంగిక దాడి కేసులో భగీరథ్ పై పేట్ బషీరా బాద్ పోలీసులు పోక్సో కేసును ఈనెల 8వ తేదీన నమోదుచేసిన విషయం తెలిసిందే. తనపైన పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిన దగ్గర నుండి నిందితుడు పరారీలో ఉన్నాడు. తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ లేకపోతే మధ్యంతర బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. భగీరథ్ బెయిల్ విషయమై హైకోర్టులో శుక్రవారం అర్ధరాత్రి కూడా విచారణ జరిగింది. బాలిక మైనర్ కావటం, నిందితుడికి ఉన్న రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని కోర్టు బెయిల్ నిరాకరించింది.
కోర్టు బెయిల్ నిరాకరణతో పోలీసులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. లుక్ ఔట్ నోటీసు జారీచేయటంతో పాటు కరీంనగర్లోని ఇంట్లో సోదాలు కూడా చేస్తున్నారు. నిందితుడిని అరెస్టుచేసేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు. అన్నీవైపుల నుండి నిందితుడికి ఉచ్చు బిగుస్తోంది. ఈనేపధ్యంలో భగీరథ్ లొంగిపోవటమో లేకపోతే అరెస్టో తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. కాసేపట్లో నిందితుడు పేట్ బషీరా బాద్ పోలీసుస్టేషన్ లో లొంగిపోతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే నిందితుడి కోసం లుక్ ఔట్ నోటీసును పోలీసులు జారీచేయటం గమనార్హం.

