పోక్సోకేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఇపుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయాడు. తనపై భగీరథ్ లైంగిక దాడిచేశాడని మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈనెల 8వ తేదీన పేట్ బషీరా బాద్ పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు.
అప్పటినుండి వారంపాటు పరారీలో ఉన్న భగీరథ్ ను 16వ తేదీరాత్రి పోలీసులు అరెస్టుచేశారు. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండుకు పంపారు. ఇపుడు భగీరథ్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు.
ఇపుడు తాజా అప్ డేట్ ఏమిటంటే కొత్తగా పోలీసులు నిందితుడిపై మరికొన్ని సెక్షన్లు జోడించారు. బాధితురాలిపై భగీరథ్ అనేకసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపధ్యంలో బృహత్ న్యాయ సమ్హిత్(BNS) 64(2)(ఎం) సెక్షన్ ను కొత్తగా చేర్చారు. నిందితుడి నేరం రుజువైతే కొత్తగా చేర్చిన సెక్షన్ కింద కనీసం 10 ఏళ్ళు జైలుశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంది. పేట్ బషీరా బాద్ పోలీసుస్టేషన్లో ఇఫ్పటికే భగీరథ్ పై బీఎన్ఎస్ 64(2)(ఎం), బీఎన్ఎస్ 74, బీఎన్ఎస్ 75 సెక్షన్లు, పోక్సో సెక్షన్ 5(1) ఆర్/డబ్య్లూ 6 సెక్షన్లు పెట్టారు. బాధితురాలి స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు కొత్తగా సోమవారం ఈ సెక్షన్ జోడించారు.
పోలీసులు భగీరథ్ పై పోక్సో కేసు నమోదుచేసిన దగ్గర నుండి నిందితుడు పరారీ అయిన విషయం తెలిసిందే. ఇతనని వెతకటానికి ఉన్నతాధికారులు నాలుగు బృందాలను ఏర్పాటుచేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. బంజారాహిల్స్, కరీంనగర్ లోని నిందితుడి ఇళ్ళను కూడా పోలీసులు వెతికారు. ఈ నేపధ్యంలోనే తండ్రి, కేంద్రమంత్రి బండి సంజయ్ వైఖరిపై తెలంగాణలో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. కొడుకునే సంజయే దాచిపెట్టాడనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అయ్యుండి తప్పుచేసిన కొడుకును సంజయే ఎలా దాచిపెడతాడనే పాయింట్ మీద బీఆర్ఎస్ నేతలు, అనుబంధ సంఘాల నేతలు, క్యాడర్, వామపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయి. ఇదే సమయంలో హైకోర్టు కూడా ముందస్తుబెయిల్ సాధ్యంకాదని తేల్చేసింది.
పార్టీలో మద్దతు దొరకక, బయటనుండి తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతున్న కారణంగా వేరేదారిలేక కొడుకును సంజయ్ 16వ తేదీ రాత్రి పేట్ బషీరా బాద్ పోలీసులకు సరెండర్ చేశాడు. భగీరథ్ సరెండర్ అయ్యాడా లేకపోతే పోలీసులే అరెస్టుచేశారా అనే విషయంలో క్లారిటిలేదు.
బండిని కూడా విచారిస్తారా ?
బండి భగీరథ్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ జర్నలిస్టుతో పాటు కేంద్రమంత్రి, తండ్రి బండి సంజయ్ ను కూడా పోలీసులు విచారించే అవకాశముంది అని సమాచారం. ఎందుకంటే ఇష్యూ వైరల్ కాకముందు బాలిక ఇంటికి బండి సంజయ్ తరపున ఒక సీనియర్ జర్నలిస్టు వెళ్ళిమాట్లాడాడు. ఈ విషయం అమ్మాయి తల్లే స్వయంగా రాసిన లేఖలో చెప్పింది. సంజయ్ తరపున సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడినట్లు చెప్పారు. తర్వాత తమను సంజయ్ ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడించినట్లు లేఖలో వివరించారు. అలాగే బాలిక తల్లి సంజయ్ మీద కూడా అనేక ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ కేసు విచారణలో భాగంగా సీనియర్ జర్నలిస్టుతో పాటు సంజయ్ ను కూడా పోలీసులు విచారించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

