కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి దొంగఓట్లతోనే గెలిచారని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం సర్ ఎన్నికల ప్రక్రియ విషయంలో చర్చించేందుకు బొమ్మ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్ సుదర్శనరెడ్డితో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో మొదలవ్వబోయే సర్ ప్రక్రియపై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు తెలంగాణలో కేంద్రమంత్రులు ఇద్దరు గెలిచింది దొంగఓట్లతోనే అని ఆరోపించారు. 14 రాష్ట్రాల్లో సర్ పేరుతో ఓట్ల చోరి జరిగిందన్నారు. ఓట్ల ప్రక్రియ పేరుతో దుర్మార్గంగా నిజమైన ఓట్లను తొలగించినట్లు మండిపడ్డారు.
దేశంలో 8.2 కోట్ల ఓట్లను జోడిస్తే 5.90 లక్షల ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. సర్ ఓటర్ల ప్రక్రియలో ఓట్లను తొలగించిన కారణంగాన బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారిపోయి అధికారంలోకి రావాల్సిన పార్టీ ఓడిపోయిందని గుర్తుచేశారు. బెంగాల్ లో 90 లక్షల ఓట్లను తొలగించి మళ్ళీ 60 లక్షల ఓట్లను కలిపినట్లు చెప్పారు.
తెలంగాణలో వచ్చే రెండేళ్ళలో ఎన్నికలు ఏమీ లేవుకాబట్టి సర్ ప్రక్రియను ఏడాదిపాటు జరపాలని డిమాండ్ చేశారు. సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంగా పేదల ఓట్లను తొలగించటం సరైన పద్దతి కాదన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్ ప్రక్రియ జరగాలని సూచించారు. బీజేపీకి పడవు అన్న అనుమానంతో ఓట్లను తొలగించే ప్రమాదముందని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజలు తమ ఓట్లను తామే కాపాడుకోవాలని సూచించారు. జూన్ 25 నుండి సర్ ప్రక్రియ ప్రారంభమవుతోందని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన ఓటర్ల జాబితాను ప్రచురిస్తారని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

