Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి సంజయ్‌ బాధితకుటుంబాన్ని భయపెట్టారా ?

బండి సంజయ్‌ బాధితకుటుంబాన్ని భయపెట్టారా ?

రోసా కోసం వెళితే మమ్మల్ని కేంద్రమంత్రి బండి సంజయ్ భయపెట్టారని మైనర్ బాలిక తల్లి ఆరోపించారు. తమ కూతురికి జరిగిన అన్యాయంగురించి చెప్పుకుని భరోసా కోరేందుకు కలిసినపుడు తమని కేంద్రమంత్రి భయపెట్టినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై భగీరథ్ లైంగికంగా దాడిచేశాడని, బలవంతంగా మద్యం సేవించే ప్రయత్నంచేసినట్లు ఒక మైనర్ బాలిక ఈనెల 8వ తదీన పేట్ బషీరా బాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్ పై పోక్సో కేసు పెట్టారు. తనపైన పోక్సో కేసు నమోదైన విషయం తెలుసుకున్న భగీరథ్ కరీంనగర్ పోలీసుస్టేషన్లో బాలికతో పాటు అమ్మాయి తల్లిపైన హనీట్రాప్, డబ్బుల కోసం బెదిరింపులంటు ఎదురు ఫిర్యాదుచేశాడు. భగీరథ్ ఫిర్యాదును నమోదుచేసుకున్న పోలీసులు బాలికతో పాటు తల్లిపైన హనీట్రాప్, బెదిరింపుల కేసు పెట్టారు.

పోలీసుల విచారణకు బాలిక అందుబాటులో ఉండగా భగీరథ్ మాత్రం పరారీలో ఉన్నాడు. సిట్ అధికారుల విచారణకు మొన్నటి బుధవారం హాజరుకాలేదు. ఈరోజు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఈ కేసును హైకోర్టు విచారిస్తోంది. ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఉదయం బాలిక తల్లి బహిరంగ లేఖ విడుదల చేసింది. అందులో ఏముందంటే చట్టానికి అనుగుణంగా మైనర్ బాలిక గుర్తింపును గోప్యంగా ఉంచుతున్నట్లు చెప్పారు. తన కూతురుకు రక్షణ, గౌరవంతో పాటు మంచి భవిష్యత్తు కావాలన్న ఉద్దేశ్యంతోనే తాను లేఖ రాసినట్లు వెల్లడించారు. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబమని, తమపై రాజకీయ, ఆర్ధిక ప్రభావం లేదన్నారు. ప్రతీకారం లేదా ప్రచారం కోసం కాదని న్యాయం కోసమే ఈ లేఖ రాసినట్లు తెలిపారు.

బాలిక తల్లి లేఖలో చెప్పిన ప్రకారం తన కూతురుతో భగీరథ్ కు 2025లో పరిచయం ఏర్పడింది. చదువులపై దృష్టి తగ్గేలాచేసి, శారీరక సంబంధం కోసం తన కూతురుపై భగీరథ్ బాగా ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. 2025, డిసెంబర్ 31 రాత్రి నుండి 2026, జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు మోయినాబాద్ లో జరిగిన ఘటనలను బాలిక తల్లి వివరించారు. తన కూతురును మద్యం సేవించమని ఒత్తిడిచేసి, బలహీన పరిస్ధితిలో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఘటనతో తన కూతురు భయపడిపోయిందని, అవమానం జరిగినట్లుగా మానిసక వేదన అనుభించిందన్నారు. తమ దగ్గర భగీరథ్ నుండి వచ్చిన చాట్స్, మెసేజ్ లు , ఎలక్ట్రానిక కమ్యూనికేషన్ ఆధారాలున్నీ ఉన్నట్లు చెప్పారు.

చాటింగులో భగీరథ్ క్షమాపణలు చెప్పటం, ఎమోషనల్ గా ఒత్తిడిచేయటం, శారీరక కలయికకు ఒత్తిడి చేసినట్లు మండిపడ్డారు. జనవరిలో బ్రేకప్ తర్వాత తమ కూతురు మానసిక పరిస్ధితి తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నారు. ఆనందంగా ఉండే తమ కూతురు పూర్తిగా మౌనంగా, భావోద్వేగంగా కుంగిపోయిందని ఆవేధన వ్యక్తంచేశారు. ఆ సమయంలో కూడా భగీరథ్ నుండి తమ కూతురికి చాలాసార్లు ఫోన్లు వచ్చాయని చెప్పారు. 2026, మార్చి, ఏప్రిల్ నెలల్లో చట్టపరంగా చర్యలు తీసుకునేలా తాము ముందుకు వెళ్ళినట్లు తెలిపారు. అప్పట్లో తమపై ఒత్తిళ్ళు, రాజీ ప్రయత్నాలు, కేసు పెట్టవద్దని అభ్యర్ధనలు కూడా వచ్చినట్లు చెప్పారు. ఏప్రిల్ 21వ తేదీన తమ కుటుంబంపై బ్లాక్ మెయిల్, ఎక్స్ టార్షన్ ఆరోపణలతో ఫిర్యాదు నమోదు కావటం తమను భయాందోళనలకు గురిచేసిందన్నారు. బాధితులనే నిందితులుగా చూపించే ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు.

ఏప్రిల్ 22వ తేదీ సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడినట్లు ఆమె చెప్పారు. అయితే సంగప్ప ఎవరు, ఆయన ఏమి మాట్లాడారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. మరుసటి రోజు కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ను కలిసినట్లు చెప్పారు. భరోసా కోసం వెళితే మంత్రి తమను భయపెట్టారని ఆరోపించారు. అప్పటినుండి తమ కుటుంబం నిరంతరం భయం, భావోద్వేగ ఒత్తిడిలో జీవిస్తోందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బెదిరింపులు, ఒత్తిళ్ళు, సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవ్యవస్ధ, దర్యాప్తు సంస్ధలు, మహిళా కమిషన్లు, బాలల హక్కుల సంఘాలు తమకు న్యాయం చేయాలని రిక్వెస్టు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA