Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. మమతకు భారీ షాక్

బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. మమతకు భారీ షాక్

శ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. తాజా ఫలితాల ప్రకారం భారతీయ జనతా పార్టీ 200 స్థానాల్లో గెలిచి మరికొన్ని స్థానాల్లో ఇంకా ఆధిక్యం కనబరుస్తోంది.

ఇప్పటి వరకు కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ప్రజలు ముగింపు పలికారు. ప్రస్తుతం వచ్చిన ట్రెండ్స్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి.

కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో పోటీ సమంగా ఉన్నట్టే కనిపించింది. కానీ కొద్దిసేపటికే బీజేపీ ఆధిక్యం పెరగడం మొదలైంది. మధ్యాహ్నానికి స్పష్టమైన లీడ్ సాధించిన పార్టీ, ఆ తర్వాత తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది. చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసింది.

202 స్థానాల్లో బీజేపీ

ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం బీజేపీ 202 స్థానాల్లో గెలిచి, మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 206 స్థానాల్లో ప్రభావం చూపుతూ ప్రధాన శక్తిగా అవతరించింది. తృణమూల్ కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలిచి, 10 చోట్ల ఆధిక్యంలో ఉండి మొత్తం 81 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ రెండేసి స్థానాలు గెలిచాయి. సీపీఎం, ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్నాయి. మొత్తం 294 స్థానాల్లో 148 మెజారిటీ అవసరమై ఉండగా, బీజేపీ దాన్ని దాటేయడం గమనార్హం. 274 స్థానాల్లో ఫలితాలు స్పష్టమయ్యాయి, మిగిలిన చోట్ల లీడింగ్ కొనసాగుతోంది.

దీదీకి సువేంధు షాక్..

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆమె తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై 15,105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ పోరులో సువేందు అధికారికి 73,917 ఓట్లు రాగా, మమతా బెనర్జీకి 58,812 ఓట్లు లభించాయి. సీపీఎం అభ్యర్థి శ్రీజీబ్ బిస్వాస్‌కు కేవలం 3,556 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ప్రజలు ఎన్నడూ లేని స్థాయిలో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. కొన్ని ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన వంటి అంశాలు ఓటర్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషణల్లో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మార్పు వైపు మొగ్గుచూపినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి.

కీలకంగా భావోద్వేగ అంశాలు

ఆర్జీ కర్ ఘటన బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ పానిహతి నుంచి గెలుపొందారు. సందేశ్‌ఖాలీ ఘటనకు సంబంధించిన బాధితుల్లో ఒకరైన రేఖా పాత్ర హింగల్‌గంజ్ నుంచి విజయం సాధించారు. ఈ విజయాలు ఎన్నికల్లో భావోద్వేగ అంశాలు కూడా ప్రభావం చూపినట్లు సూచిస్తున్నాయి.

ఫలితాలపై స్పందించిన బీజేపీ ఈ విజయాన్ని భయరహిత వాతావరణానికి సంకేతంగా అభివర్ణించింది. మరోవైపు మమతా బెనర్జీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల నిర్వహణపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫలితాలను రాష్ట్ర అభివృద్ధికి ముందడుగుగా అభివర్ణించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA