Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి చివరి దశ?

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి చివరి దశ?

భారత్‌, అమెరికా మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వాణిజ్య విభేదాలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, పరిష్కరించాల్సిన అంశాలు కొన్నే మిగిలాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.

ముంబైలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో ఆయన జరిపిన చర్చలు ఇరు దేశాల సంబంధాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

భారత్‌-అమెరికా సంబంధాలు గత కొంతకాలంగా సుంకాలు, రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు వంటి అంశాలతో ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రూబియో భారత పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటు ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించే విషయంలో అమెరికా తీసుకున్న తాత్కాలిక సడలింపు భారత్‌కు ఊరటనిచ్చింది. ప్రపంచ ఇంధన అవసరాలు, భారత్‌ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు మారడానికి పట్టే సమయం వంటి అంశాలను ఈ నిర్ణయంలో పరిగణనలోకి తీసుకున్నట్లు రూబియో వెల్లడించారు. వాణిజ్య ఒప్పందంలో పురోగతి కూడా ఈ నిర్ణయానికి సంబంధించిన అంశాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు.ముంబైలో జైశంకర్‌తో సమావేశమైన రూబియో.. వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ, సాంకేతికతతో పాటు ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఇద్దరూ గుర్తించారు.ఈ పర్యటనలో వ్యాపార రంగానికి కూడా ప్రాధాన్యం ఉంది. బుధవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిఫైనరీని సందర్శించడంతో పాటు, ముఖేష్‌ అంబానీతో ఇంధన సహకారంపై చర్చించనున్నారు. వెనిజులా నుంచి మరింత ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేసే అవకాశాలను రిలయన్స్‌తో చర్చించడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. అమెరికాలో భారీ రిఫైనరీ ప్రాజెక్టులోనూ అంబానీ కుటుంబం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.మరోవైపు, అమెరికాలో నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను నియంత్రించడం ట్రంప్‌ ప్రభుత్వానికి కీలకంగా మారింది. డీజిల్‌ ధరలు ట్రక్కుల రవాణా, వ్యవసాయం, సరకు రవాణా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంచుకోవడం అమెరికాకు కూడా ప్రయోజనకరంగా ఉండనుంది.మొత్తంగా, రూబియో పర్యటన భారత్‌-అమెరికా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఒక అవకాశంగా కనిపిస్తోంది. అయితే, వాణిజ్య ఒప్పందం ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. తాజా చర్చలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయన్నది, మిగిలిన విభేదాలకు ఇరు దేశాలు ఎలా పరిష్కారం కనుగొంటాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.అయితే రెండు దేశాలు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు రూబియోతో కేవలం జైశంకర్ మాత్రమే చర్చలు జరిపారు. ఇతర భారత అధికారులు, మంత్రులు ఎవరూ కలవకపోవడం గమనార్హం.
మధ్యంతర ఎన్నికలు...
ట్రంప్ పరిపాలనకు ఇప్పుడు జరగబోయే మధ్యంతర ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. ఎన్నికల్లో ఇంధన ధరల పెరుగుదల ఒక ముఖ్యమైన అంశంగా మారింది. డీజిల్ ధరలు అమెరికన్ వ్యవసాయదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల భారత్ ఇంధన అవసరాలు కూడా అమెరికన్ పాలకులు అర్థమవుతున్నాయి. వాషింగ్టన్ స్వయంగా రష్యాతో ఇంధన అవసరాల ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA