తెలంగాణలో ఇపుడు టాక్ ఆఫ్ ది ఇష్యు ఏమిటంటే బండి భగీరథ్. పోక్సో కేసులో నిందితుడు అయిన భగీరథ్ ను పోలీసులు వెంటనే అరెస్టుచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నేతలు, మహిళా, యువజన, విద్యార్ది విభాగం నేతలు ప్రతిరోజు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
గడచిన 12 ఏళ్ళల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఇంతలా ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. మరి ఇపుడే ఎందుకింతగా ప్రతిరోజు టార్గెట్ చేస్తు రెచ్చిపోయి ఆందోళనలు చేస్తున్నట్లు ? భగీరథ్ వల్ల బీఆర్ఎస్ కు వచ్చిన సమస్య ఏమిటి ?
నిజానికి భగీరథ్ వల్ల బీఆర్ఎస్ కు వచ్చిన సమస్య ఏమీలేదు. సమస్యంతా తండ్రి, కేంద్రమంత్రి బండి సంజయ్ వల్లనే. మొదటినుండి సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్‌గా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సంజయ్ టార్గెట్ మాత్రం కేసీఆరే అనటంలో ఎలాంటి సందేహంలేదు. బండి సంజయ్ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా కూడా కేసీఆర్ పైన ప్రతిరోజు ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. కాళేశ్వరం అవినీతి కావచ్చు లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కూడా కావచ్చు. అలాగే డ్రగ్స్ అంశంపై ఎప్పుడు సంజయ్ మాట్లాడినా కేటీఆర్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, టెస్టుకు రెడీనా అని చాలాసార్లు చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విధంగా తండ్రి, కొడుకులను ఏకకాలంలో సంజయ్ ఆరోపణలు, విమర్శలతో దుమ్ము దులిపేస్తున్నారు. సంజయ్ దెబ్బకు బీఆర్ఎస్ చాలాసార్లు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీ బలోపేతానికి సంజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్‌ను బలహీనపరచటం ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమవుతుందన్న ప్లాన్‌తో సంజయ్ రాజకీయంగా ఎత్తులు వేస్తున్నారు. ఇలాంటి అనేక అంశాలపై సంజయ్ అంటే బీఆర్ఎస్ మండిపోతోంది. కేంద్రమంత్రిని టార్గెట్ చేయాలంటే బీఆర్ఎస్ కు సరైన అంశం ఏదీ దొరకలేదు.
కేటీఆర్ స్ధాయి సరిపోవటంలేదా ?
2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటంలేదు. రెండుమూడుసార్లు బయటకు వచ్చినా పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొని మళ్ళీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయారు. సంజయ్‌కు కేటీఆర్ కౌంటర్లు ఇస్తున్నా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. 2028 ఎన్నికలకు బీజేపీ సారధ్య బాధ్యతలు మళ్ళీ బండిచేతికే దక్కుతాయనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే నిజమైతే బీఆర్ఎస్ టార్గెట్‌గా సంజయ్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతాయి. అందుకనే సంజయ్‌ను ఎలా ఎదుర్కోవాలా అనేవిషయం అర్ధంకాక కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే సంజయ్ కొడుకు భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. మైనర్ బాలికపై లైగింకదాడి చేశాడనే ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేంద్రమంత్రి కొడుకుపై పోక్సోకేసు పెట్టడం తెలంగాణలో సంచలనమైంది. ఇంకేముంది వెంటనే బీఆర్ఎస్ నేతలంతా అలర్టయిపోయారు. సంజయ్ మీద మంటతో రగిలిపోతున్న కేటీఆర్, సీనియర్ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. భగీరథ్‌ను వెంటనే అరెస్టుచేయాలని, కోర్టులో ప్రవేశపెట్టి కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో హోరెత్తించేస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ సీనియర్ నేతలు లేదా అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు నానా రచ్చచేస్తున్నారు. భగీరథ్ పై యాక్షన్ డిమాండ్ చేస్తు బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనల వల్ల ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లుగా తయారైంది.
మొదటిదేమో కొడుకు భగీరథ్‌ను పోలీసులు అరెస్టుచేయటం. రెండోది కొడుకు అరెస్టు అవ్వగానే మంత్రిపదవికి రాజీనామా చేయాలని సంజయ్ ను డిమాండ్ చేయటమే బీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతోంది. పనిలోపనిగా భగీరథ్ అరెస్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపైన కూడా బాగా ఒత్తిడి పెంచేస్తోంది. మామూలుగా అయితే పోక్సో కేసు నమోదుకాగానే వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేస్తారు. కాని భగీరథ్ పై పోలీసులు పోక్సో కేసు నమోదుచేసి 7 రోజులు అవుతున్నా ఇప్పటివరకు అరెస్టుచేయలేదు. కారణం ఏమిటంటే నిందితుడు పారారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అరెస్టుచేయటంలో పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే జాప్యంచేశారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
కేసు విచారణకు ముఖ్యమంత్రి నియమించిన సిట్ విచారణకు బుధవారం నిందితుడు హాజరుకావాల్సుంది. అయితే హాజరుకాకపోవటమే కాకుండా 15వ తేదీన హాజరవుతానని లేఖ రాశాడు. నిందితుడు రాసిన లేఖను పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకుండా గాలింపు కోసం ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. మరి చెప్పినట్లుగా భగీరథ్ 15వ తేదీన లొంగిపోతాడా ? లేకపోతే పోలీసులే అరెస్టుచేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా భగీరథ్ ను అడ్డంపెట్టుకుని సంజయ్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేయటం స్పష్టంగా కనబడుతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

